Polavaram: రివర్స్‌ టెండర్‌.. ‘రివర్స్‌’ కొట్టింది!

ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా నాటి ముఖ్యమంత్రి జగన్‌ పట్టుబట్టి కాంట్రాక్టరును మార్చడం, కొత్తగా రంగంలోకి దిగిన గుత్తేదారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడం పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది.

Updated : 08 Jul 2024 06:48 IST

డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం 
రూ.1,548 కోట్ల నుంచి రూ.4,637 కోట్లకు పోలవరం పనుల పెంపు 
అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి

ఈనాడు, అమరావతి: ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా నాటి ముఖ్యమంత్రి జగన్‌ పట్టుబట్టి కాంట్రాక్టరును మార్చడం, కొత్తగా రంగంలోకి దిగిన గుత్తేదారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడం పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది. జగన్‌ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.628 కోట్లు ఆదా చేసినట్లు చూపించి.. రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లుగా పోజులు కొట్టి, అప్పటికే 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కుట్రపూరితంగా మేఘా చేతిలో పెట్టారు. 2019 నవంబరులో ప్రాజెక్టును అప్పగిస్తే.. కొత్త గుత్తేదారు మేఘా 2020 జూన్‌ వరకు పనులే ప్రారంభించలేదు. ఇంత ఆలస్యం చేయడం ప్రాజెక్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీలను పూడ్చి, లీకులు అరికట్టకపోవడంతో 2020 భారీ వరదలకు డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సినచోట భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యాం దెబ్బతింది. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. గుత్తేదారును మార్చొద్దని కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ నెత్తీనోరూ కొట్టుకుని మొత్తుకున్నా అప్పటి సీఎం జగన్‌కు చెవికెక్కలేదు. 

రివర్స్‌తో అదనపు ప్రయోజనం దక్కిందెవరికి?

2019లో మేఘా సంస్థతో రూ.1,548.12 కోట్లకు ఒప్పందం జరిగింది. అలా ఖజానాకు రూ.628 కోట్లు మిగిల్చినట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత పని విలువ క్రమంగా పెంచేశారు. కొన్ని పనులు తొలగించి, మరికొన్ని పెంచి... అదనపు ఒప్పందాలు చేసుకుని పని విలువను రూ.2,077.78 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. అది చాలదన్నట్టు కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ సిఫార్సు చేశాయన్న పేరుతో... రూ.669.47 కోట్లు, రూ.1,615.75 కోట్లతో రెండుసార్లు అదనంగా మరికొన్ని పనులకు టెండర్లు పిలిచారు. వాటి అంచనాల్ని కొత్త ధరలతో రూపొందించారు. మేఘాతో పాటు మరో గుత్తేదారు సంస్థ మాత్రమే ఈ టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకుంది. కానీ, కేవలం 1.980% తక్కువకు మొదటి టెండరును, 1.0240% తక్కువకు రెండో టెండరును మేఘా దక్కించుకుంది. దీని వెనుక జగన్‌ ప్రభుత్వ సహకారం చాలానే ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇంకా.. అదనపు జోడింపులు, డీవియేషన్స్‌ పేరుతో ఆ పనుల అంచనాలనూ జగన్‌ ప్రభుత్వం పెంచేసుకుంది. రూ.2,167 కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు చేసుకుని... వాటిని క్రమంగా రూ.2,559.31 కోట్లకు చేర్చింది. మొత్తమ్మీద మొదట్లో రూ.1,548 కోట్లు అనుకున్న పనులు కాస్తా.. చివరకు ఏకంగా రూ.4,637.09 కోట్లకు చేరాయి. 

72 శాతం నుంచి 45 శాతానికి రివర్స్‌!

నిజానికి 2019 నాటికి చంద్రబాబు హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయి. కానీ, తర్వాత ఐదేళ్లలో కీలక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిని, దాదాపు పనికిరాకుండా పోయాయి. దాంతో ప్రాజెక్టు తిరోగమనంలోకి వెళ్లి, 45% పనులే పూర్తయిన స్థాయికి దిగజారింది. ఆ పనులన్నింటినీ మళ్లీ చేసుకోవాల్సి రావడంతో.. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని సందిగ్ధ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. తామేమీ చేయలేమని కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది. చివరకు విదేశీ నిపుణుల్ని పిలిపించి... ప్రాజెక్టును మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంచనాలు పెంచేయడం, టెండర్ల ప్రక్రియను అడ్డగోలుగా నిర్వహించి ఒకే సంస్థకు మేలు జరిగేలా చేసిన తీరుపై చంద్రబాబు ప్రభుత్వం లోతైన విశ్లేషణ జరిపి, లోగుట్టు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సాంకేతిక, నిర్మాణ, నిర్వహణ లోపాలతో... మొత్తం ప్రాజెక్టును రివర్స్‌ బాట పట్టించి... రాష్ట్రానికి రూ.వేల కోట్ల నష్టం చేకూర్చినవారందరిపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 


ఎవరెంత చెప్పినా.. ఎందుకలా?

పోలవరం గుత్తేదారును మారిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ... జగన్‌కు చిలకకి చెప్పినట్టు చెప్పాయి. పదే పదే లేఖలు రాశాయి. ప్రత్యేకంగా పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటుచేసి... గుత్తేదారును మార్చడం వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాలపై చర్చించింది. కానీ, పనులు ఎవరికి కట్టబెట్టాలో అప్పటికే నిర్ణయించుకున్న జగన్‌... ఆ సూచనలన్నింటినీ పెడచెవిన పెట్టారు. చివరకు అందరూ భయపడ్డట్టే.. ప్రాజెక్టు సంక్షోభంలో చిక్కుకుపోయింది. ‘ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉన్న ఖాళీలను సకాలంలో పూడ్చకపోవడం వల్లే పోలవరంలో ఇంతటి విధ్వంసం జరిగింది’ అని నీతి ఆయోగ్‌ నియమించిన హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది.

  • గుత్తేదారును మార్చేందుకు జగన్‌ అన్ని నిబంధనలూ ఉల్లంఘించారు. టెండర్లు పిలిచే క్రమంలో జగన్‌ ప్రభుత్వం సాంకేతిక అర్హతలు మార్చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.
  • మేఘా సంస్థ ఒక్కటే టెండరు దాఖలు చేసినా అంచనా విలువ కన్నా తక్కువకే పనులు అప్పగిస్తున్నామన్న పేరుతో ఖరారు చేసేశారు.
  • తర్వాత రెండు దఫాలుగా టెండర్లు పిలిచిన అదనపు పనులూ మేఘాకే దక్కేలా ఇతర గుత్తేదారు సంస్థల్ని జగన్‌ ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని