Andhra News: అక్షరజ్ఞానం లేని తరం తయారవుతోంది.. ఇది ప్రమాదకరం

‘మన పిల్లలను మాతృభాషకు దూరం చేస్తూ.. ఆంగ్లం, తెలుగు రానివారుగా చేస్తున్నాం. ఇది జాతి ఉనికికే ప్రమాదకరం. అక్షరజ్ఞానం లేనితరాన్ని తయారుచేయడమంటే.. అణువిస్ఫోటం కంటే ప్రమాదకరం.

Updated : 24 Dec 2022 07:25 IST

అణు విస్ఫోటం కంటే ఇది ప్రమాదకరం
విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రెండూ రావట్లేదు
తానా ప్రపంచ సాహిత్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర

ఈనాడు, అమరావతి: ‘మన పిల్లలను మాతృభాషకు దూరం చేస్తూ.. ఆంగ్లం, తెలుగు రానివారుగా చేస్తున్నాం. ఇది జాతి ఉనికికే ప్రమాదకరం. అక్షరజ్ఞానం లేనితరాన్ని తయారుచేయడమంటే.. అణువిస్ఫోటం కంటే ప్రమాదకరం. కానీ.. ప్రస్తుతం తెలుగు నేర్చుకున్నా ఉపయోగం లేదనేలా అందరిలో ఒక అపోహ పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రగతిపథంలో ఉన్న ఏ దేశంలోనైనా సొంతభాషలోనే ప్రాథమిక విద్యాబోధన సాగుతోంది. ఆంగ్లం రాకపోతే ఉద్యోగాలు రావనే వాదనను కట్టిపెట్టండి. తెలుగుకు ఇతర భాషలు, దేశాలవాళ్లు ఎంతో గౌరవం ఇస్తుంటే, ఈ గడ్డపై పుట్టినవాళ్లుగా మనమేం చేస్తున్నామనేది అందరూ ప్రశ్నించుకోవాలి’ అని తానా ప్రపంచ సాహిత్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ రచయితల మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.


ఆలోచన లేకుండా ఏదీ చేయకూడదు..

మాతృభాష విషయంలో అపోహలు వీడాలి. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన తెలుగులో జరిగితే తర్వాత ఎన్ని భాషలైనా అవలీలగా నేర్చుకోవచ్చని ప్రపంచ మానసిక శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగును నేర్పించొచ్చు. మాతృభాషను విస్మరిస్తే.. భావితరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు ఆంగ్లం, తెలుగు రానివాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇది జాతి ఉనికికే ప్రమాదకరం. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించాలి. అంతేకానీ.. తప్పుమార్గంలో ప్రయాణించడం తగదు.


అమెరికాలో మాతృభాష నేర్పిస్తున్నాం

అమెరికాలో పిల్లలకు మన భాష, సంస్కృతి నేర్పుతున్నాం. తానా ఆధ్వర్యంలో పాఠశాలను ఏర్పాటుచేశాం. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతంలోనూ అక్కడి చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో అవకాశాలున్నా తెలుగు నేర్చుకోకపోవటం సిగ్గుపడాల్సిన విషయం.


రాజ్యాంగంలోనే ఉంది కదా..

చిన్నప్పటి నుంచి మాతృభాషలోనే విద్య నేర్పితే ఏ విషయాన్నయినా విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుంటారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాజ్యాంగంలో కూడా ఉంది. దాన్ని అవగాహనలోపంతో ప్రభుత్వం అమలుచేయట్లేదు. ఆంగ్లభాషకు ఉన్న ప్రాధాన్యాన్ని ఎవరూ కాదనలేం. ఆంగ్లభాష నేర్చుకోవాలన్న నెపంతో మాతృభాషను చంపేయకూడదు.


ఇతర దేశాల్లో లేనిది మనకే ఎందుకు?

మేమందరం తెలుగులోనే చదువుకున్నాం. మాతృభాషలో చదువుకున్న అబ్దుల్‌కలాం, మహాత్మాగాంధీ దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇతర దేశాల్లో విద్యార్థులకు వారి మాతృభాషలోనే బోధిస్తారు. అలా చేయటం ద్వారా వారిలో మానసిక వికాసం పెరుగుతుంది. తెలుగును నేర్పించే విషయంలో ప్రభుత్వాల మీద ఆధారపడే దౌర్భగ్యం తల్లిదండ్రులకు ఉండకూడదు. అందరూ ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. పిల్లలకు చిన్నచిన్న కథలను తెలుగులో చెబుతూ బాలసాహిత్యాన్ని దగ్గరచేయాలి. మన భాషను చిన్నారులకు దగ్గర చేస్తే.. మంచి సమాజాన్ని తయారుచేయడానికి వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని