Updated : 31 Jan 2022 04:50 IST

PRC:ఉద్ధృతమవుతున్న ఉద్యోగుల ఉద్యమం

ముగిసిన రిలే దీక్షలు
కొత్త జీతాలు వద్దంటూ నేడు జేసీలు, కలెక్టర్లకు వినతులు
బెదిరించినా వెనక్కితగ్గబోమంటున్న నేతలు 

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళం, కర్నూలు: ఉద్యోగుల ఉద్యమం మలి అంకానికి చేరింది. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు ఆదివారంతో ముగిశాయి. రివర్స్‌ పీఆర్సీ అంటూ గుంటూరు జిల్లాలో రిలే దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులు పోలీసు కవాతు మైదానం నుంచి దీక్షా శిబిరం వరకు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. కర్నూలులో ఓ ఉద్యోగి అల్లూరి సీతారామరాజు వేషధారణలో హాజరయ్యారు. రిలే దీక్షలకు చివరి రోజైన ఆదివారం అన్నిచోట్లా ఉద్యోగులు భారీగా పాల్గొని.. ఈ పీఆర్సీ మాకొద్దంటూ నినదించారు. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టాలని, పాత జీతాలే చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడను వేలాది మంది ఉద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు తరలివచ్చేలా ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు సాధన సమితి నేతలు జిల్లాల పర్యటనలు చేశారు. 5న విద్యాశాఖ, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల యాప్‌ల్లో వివరాల నమోదును నిలిపివేయనున్నారు. 6న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సమ్మె అనివార్యమైతే సకలం నిలిచిపోనున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాల బిల్లులు చేయాలని డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తున్నా చాలా మంది చేయడం లేదు. ఈ నేపథ్యంలో డీడీవోల వద్ద డేటాను తీసుకొని.. కలెక్టర్లు, జేసీల ద్వారా వేతనాల బిల్లులు సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా జిల్లాల్లో జేసీ, కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపు, చలో విజయవాడకు ఉద్యోగుల సమీకరణపై సోమవారం విజయవాడలో పీఆర్సీ సాధన సమితి సమావేశం కానుంది.

ఉద్యమిస్తే ప్రభుత్వమే దిగివస్తుంది

రాష్ట్రంలో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం తగదని ఏపీˆ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రిలే దీక్షాశిబిరంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం చర్చలకు రమ్మంటోంది. అనుమానాలు, అపోహలు ఉంటే తొలగిస్తారట. మీకే ఏమైనా సందేహాలుంటే మా టీచర్లే లెక్కలు చెబుతారు రండి. మాకు జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుతున్నాం తప్ప ఇది ప్రభుత్వంపై యుద్ధమేమీ కాదు. ఏ చర్చలు లేకుండా అర్ధరాత్రి చీకటి జీవోలను విడుదల చేశారు. జీవోలు ఇస్తారని తెలిసి సజ్జలను కలిసేందుకు విమానాశ్రయానికి వెళ్లాం. ఆర్థిక మంత్రిని కలుద్దామంటే అడ్రస్‌ లేకుండా పోయారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తే, పండగ తరవాత ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఇప్పుడేమో వీరంతా మేం చర్చలకు రావడం లేదంటున్నారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వంతో చర్చలకు ఎలా వెళ్లాలి’ అని ధ్వజమెత్తారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే ప్రభుత్వమే దిగివస్తుందని పేర్కొన్నారు.

పీఆర్సీకి చట్టబద్ధత లేదు

ప్రభుత్వం నిర్బంధంగా అమలు చేస్తున్న పీఆర్సీకి చట్టబద్ధత లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (జీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. గుంటూరులో రిలే దీక్షల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘పీఆర్సీని అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో లోకల్‌ ఫండ్‌ అధికారులు సర్టిఫై చేయకుండానే సీఎఫ్‌ఎంఎస్‌లో సర్టిఫై చేస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఈ పనికి అధికారులు, సీఎఫ్‌ఎంఎస్‌ ఏజెన్సీలు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నాం. పే స్లిప్‌ చూడండని చెబుతున్నారు. దాని గురించి ప్రభుత్వం కంటే మాకే ఎక్కువ తెలుసు. ప్రకటించిన పీఆర్సీ ప్రకారం ఎంత జీతం వస్తుందో అంచనా వేసుకోగలం’ అని తేల్చిచెప్పారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నం వృథా ప్రయాస అని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలులో రిలేదీక్షల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులతో పోరాడాలని ప్రభుత్వం భావిస్తే డీడీవోలపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు.


‘ఎస్మా’ ప్రయోగిస్తే జైలుకైనా వెళతాం: బండి శ్రీనివాసరావు

మెరుగైన పీఆర్సీ సాధనకు ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ఏపీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల రిలే దీక్షాశిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం సరిచేసి మెరుగైన వేతనాలను చెల్లించేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగులను అణచివేయాలని చూసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె దిశగా వెళితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మరో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని