Kishan reddy: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్‌లో ఉంది. ఆ దస్త్రంలో ఏమీ కదలిక లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Updated : 20 Jun 2024 07:40 IST

దానిపై భయాందోళనలు అక్కర్లేదు
కేంద్ర మంత్రి భరోసా
గనుల వేలంలో పాల్గొని  క్యాప్టివ్‌ మైన్స్‌ పొందొచ్చని సూచన

ఈనాడు, దిల్లీ: ‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్‌లో ఉంది. ఆ దస్త్రంలో ఏమీ కదలిక లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కారణంగా వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పటికీ దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. విశాఖ ఉక్కు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోందని చెప్పారు. త్వరలో రూ.3 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాబట్టి దాని నిర్మాణం పూర్తి చేయడానికి మోదీ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారానికి తగిన చొరవ తీసుకుంటానన్నారు. వైజాగ్‌ స్టీల్‌కు క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయింపు గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు, ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. దానిపై నేను ఇంకా సమీక్ష జరపలేదు. ఒకసారి ఉక్కు శాఖ, వైజాగ్‌ స్టీల్, మా మంత్రిత్వ శాఖలతో మాట్లాడి అందుకు ఏమైనా అవకాశం ఉందా అన్నది చర్చిస్తా. నాకు తెలిసినంత వరకు వైజాగ్‌ స్టీల్‌ కూడా వేలం పాటలో పాల్గొని గనులను సొంతం చేసుకోవచ్చు’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన బొగ్గు గనుల్లోని నిల్వలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని.. అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని