APSRTC: ఒత్తిడికి భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికీ భత్యం!

ఒత్తిడి ఎదుర్కొంటున్నందుకు నెలకు గరిష్ఠంగా రూ.8 వేల భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికి నెలకు రూ.గరిష్ఠంగా రూ.3,750 భత్యం.. అధికారులు రీఫ్రెష్‌మెంట్‌కు గరిష్ఠంగా నెలకు రూ.3,750 భత్యం.. అధికారులు బ్రీఫ్‌కేస్‌ కోసం రెండేళ్లకోసారి రూ.5 వేల భత్యం.. ఇదేమిటి చిత్రవిచిత్రమైన భత్యాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఆర్టీసీలో అంతే.

Published : 18 Jun 2024 05:10 IST

అనేక అలవెన్సుల కోసం ఆర్టీసీ అధికారుల ప్రతిపాదన
ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆర్టీసీ నిధులు డ్రాచేసే యోచన
దస్త్రాన్ని ఎలాగైనా ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: ఒత్తిడి ఎదుర్కొంటున్నందుకు నెలకు గరిష్ఠంగా రూ.8 వేల భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికి నెలకు రూ.గరిష్ఠంగా రూ.3,750 భత్యం.. అధికారులు రీఫ్రెష్‌మెంట్‌కు గరిష్ఠంగా నెలకు రూ.3,750 భత్యం.. అధికారులు బ్రీఫ్‌కేస్‌ కోసం రెండేళ్లకోసారి రూ.5 వేల భత్యం.. ఇదేమిటి చిత్రవిచిత్రమైన భత్యాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఆర్టీసీలో అంతే. అనేక రకాల భత్యాలతో వీలైనంత ఎక్కువ మొత్తం తీసుకోవడానికి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో.. వారికి ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాత్రమే భత్యాలు వస్తున్నాయి. దీంతో ఆర్టీసీలో గతంలో ఉండే అన్ని రకాల భత్యాలు పొందేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.

ఆర్టీసీకి తలకుమించిన భారం..

ఆర్టీసీలో గతంలో జూనియర్‌ స్కేల్‌ ఆఫీసర్‌ (డిపో మేనేజర్‌) కేడర్‌ నుంచి ఉన్నతస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) వరకు ఉండే అన్ని స్థాయిల్లోని అధికారులు గతంలో అనేక భత్యాల పేరిట భారీగా డబ్బులు డ్రా చేసేవారు. జీతానికి సమానంగా భత్యాలు ఉండేవి. అయితే అయిదారేళ్ల కిందట అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు.. ఈ భత్యాలపై సమీక్ష చేశారు. ఎక్కడాలేని విధంగా ఇన్ని భత్యాలు ఎందుకు? అంటూ అన్ని నిలిపేశారు. తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మాదిరిగానే ఆర్టీసీ అధికారులకు భత్యాలు వస్తున్నాయి. అయితే తాజాగా గతంలో ఉన్న భత్యాలను పునరుద్ధరించి, వాటిని పొందేందుకు అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. ఆర్టీసీ ప్రస్తుత ఎండీ ద్వారకాతిరుమలరావు ద్వారా దాన్ని ఆమోదింపజేసుకొని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని.. ఆ భత్యాలు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఈ భత్యాలు ఇవ్వకపోతే.. ఆర్టీసీ నిధుల నుంచి డ్రా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


31 రకాల భత్యాలకు పత్రిపాదన

అన్ని స్థాయుల్లోని అధికారులు, ఉద్యోగులు.. ఇలా అందరికీ కలిపి 31 రకాల భత్యాల కోసం తాజాగా దస్త్రాన్ని సిద్ధం చేశారు.

  • ఇందులో డిపో మేనేజర్లకు ఒత్తిడి భత్యం(స్ట్రెస్‌ అలవెన్స్‌).. ఆ డిపోల్లో ఉండే బస్సుల సంఖ్య బట్టి నెలకు రూ.4,500 నుంచి రూ.8 వేల వరకు ఇవ్వాలని ప్రతిపాదించారు.
  • ఆర్టీసీ ఆసుపత్రుల్లో డాక్టర్లకు బయో-హజర్డ్‌ రిస్క్‌ భత్యం కింద నెలకు రూ.9 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే డాక్టర్లకు రాత్రి భత్యం కింద రోజుకు రూ.500 చొప్పున ప్రతిపాదించారు.
  • ఈడీ నుంచి డీఎం వరకు అధికారులకు ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ భత్యం కింద ప్రతినెలా రూ.3 వేల నుంచి రూ.3,750 ఇవ్వాలని ప్రతిపాదించారు.
  • కన్వెయన్స్‌ భత్యం, రీఫ్రెష్‌మెంట్‌ భత్యం, ఫీల్డ్‌ అలవెన్స్‌.. ఇలా అనేక భత్యాలు పునరుద్ధరించాలని ఒత్తిడి తెస్తున్నారు.
  • ఇప్పటికే ఆర్టీసీ అధికారులు వినియోగించే కార్లకు నెలకు రూ.30 వేల చొప్పున సొమ్మును ఆర్టీసీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. ఇపుడు ఇతర భత్యాలు కూడా వాటి నుంచి తీసుకోవాలని చూస్తున్నారు.
  • ఆర్టీసీలో ఉద్యోగులకు ఏవైనా భత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విషయంలో ముప్పతిప్పలు పెట్టే అధికారులు... వారి భత్యాల విషయంలో మాత్రం గుట్టుగా దస్త్రం నడపటం ఏమిటని ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు