Updated : 10 Apr 2022 06:41 IST

Property Tax: మళ్లీ ఆస్తి పన్ను దెబ్బ

పట్టణాల్లో మరో 15% పెంపు

రెండేళ్లలో 32.24% పెరుగుదల

ఈ ఏడాది అదనపు భారం రూ.214 కోట్లపైనే

ఈనాడు - అమరావతి

విజయవాడలోని కరెన్సీనగర్‌కు చెందిన ఒకరు తన ఫ్లాట్‌కు 2020-21 వరకు ఏడాదికి రూ.6,400 ఆస్తి పన్ను చెల్లించేవారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధానం అమలులోకి వచ్చాక 2021-22లో పన్ను రూ.7,360(15%)కి పెరిగింది. మరోసారి(2022-23) 15% పెంచడంతో పన్ను రూ.8,464కి చేరింది. అంటే రెండేళ్ల వ్యవధిలో పన్ను రూ.2,064 (32.25%)పెరిగింది.

ట్టణాల్లో ఆస్తి పన్ను మరోసారి పెరిగింది. 2021-22లో పెంచిన మొత్తం పన్నుపై 2022-23లోనూ మరో 15% పెంచారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పెరిగిన పన్నుకు సమానమయ్యే వరకు ప్రజలపై ఏటా దెబ్బ మీద దెబ్బపడుతూనే ఉంటుంది. గత రెండేళ్లలోనే 32.24 శాతం పన్ను పెరిగింది. 2022-23లో పెంచిన పన్నుతో పట్టణ ప్రజలపై రూ.214 కోట్లకుపైగా అదనపు భారంపడనుంది. కొవిడ్‌ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతినడం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విద్యుత్తు ఛార్జీల మోతతో రాష్ట్ర ప్రజలు కొంతకాలంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ 2021-22లో పెరిగిన 15% ఆస్తి
పన్నుని పట్టణ స్థానిక సంస్థలు గత నెలాఖరు వరకు వసూలు చేశాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేసి పన్నులు చెల్లించి ఇంకా ఊపిరి పీల్చుకోకముందే పన్ను మరోసారి పెంచారు. అన్ని పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో పెరిగిన పన్ను నోటీసులను త్వరలో జారీ చేయనున్నారు.

పన్ను పెరుగుదల ఇలా....

గుంటూరుకి చెందిన ఒక వ్యాపారి తన వాణిజ్య భవనానికి 2020-21లో ఏడాదికి రూ.9,600 ఆస్తి పన్ను చెల్లించేవారు. 2021-22లో రూ.11,040 చెల్లించారు. 2022-23లో మరో 15% పెంచి రూ.12,696 చెల్లించాలని పురపాలకశాఖ నోటీసు సిద్ధం చేసింది. రెండేళ్ల వ్యవధిలో పన్ను రూ.3,096(32.25%) పెరిగింది.

తిరుపతిలోని శివజ్యోతినగర్‌కు చెందిన ఒకరు తన ఫ్లాట్‌కు ఏడాదికి రూ.5,600 చొప్పున ఆస్తి పన్ను చెల్లించేవారు. కొత్త విధానం అమలులోకి వచ్చాక 2021-22లో ఆయన చెల్లించాల్సి పన్ను రూ.6,445కి పెరిగింది. దీనిపై మరోసారి 15% పెంపుతో 2022-23లో రూ.7,418 చెల్లించాలని పురపాలకశాఖ నోటీసు సిద్ధం చేసింది. రెండేళ్లలో పన్ను రూ.1,818 పెరిగింది(32.25%).

 విశాఖలోని టీపీటీ కాలనీకి చెందిన ఒకరు తన ఇంటికి ఏడాదికి రూ.4,500 పన్ను చెల్లించేవారు. 2021-22లో 15% పెంపుతో ఆయన చెల్లించాల్సిన పన్ను రూ.5,179కి పెరిగింది. 2022-23లో అదే పన్ను రూ.5,961కి పెంచారు. రెండేళ్లలో పన్ను రూ.1,461 పెరిగింది.

పన్ను పోటు తెలియకుండా రిబేట్‌ అస్త్రం

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఏప్రిల్‌ నెలాఖరులోగా చెల్లిస్తే 5శాతం రిబేట్‌ ఇస్తామని పురపాలకశాఖ ప్రకటించింది. ఈ ఏడాది పన్నులో 15% పెరుగుదల విషయాన్ని ప్రజలు గమనించకముందే రిబేట్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలకు నోటీసులు జారీ కాలేదు. ఆన్‌లైన్‌లో చూసిన వారికే పన్ను పెరిగిన విషయం తెలుస్తోంది. రిబేట్‌ని వినియోగించుకునేందుకు నగరాలు, పట్టణాల్లోని అత్యధికులు పన్నులు చెల్లిస్తారన్నది పురపాలకశాఖ ఆలోచన. ఒకసారి పన్ను చెల్లిస్తే పెరుగుదల అంశం తెరమరుగువుతుందన్నది అధికారుల భావన. సాధ్యమైనంత ఎక్కువ మందితో పన్నులు చెల్లించేలా చూడాలని పురపాలక శాఖ ఇటీవల పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేక సూచనలు చేసింది. ప్రజలకు పన్ను పోటు తెలిస్తే వసూళ్లు తగ్గుతాయన్న ఆలోచనతో రిబేట్‌ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని