PSR Anjaneyulu: చంద్రబాబును కలిసేందుకు సీతారామాంజనేయులు విశ్వప్రయత్నం

వైకాపాతో అన్ని విధాలుగా అంటకాగి, ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొంటున్న నిఘా విభాగం మాజీ అధిపతి పి.సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు.

Updated : 08 Jul 2024 06:58 IST

జూబ్లీహిల్స్‌లోని ఇంటికి మూడుసార్లు రాక
గేటు దగ్గర్నుంచే పంపేసిన భద్రతా సిబ్బంది 

ఈనాడు, అమరావతి: వైకాపాతో అన్ని విధాలుగా అంటకాగి, ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొంటున్న నిఘా విభాగం మాజీ అధిపతి పి.సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అపాయింట్‌మెంట్‌ లేకున్నా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండటంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు సీతారామాంజనేయులు శని, ఆదివారాల్లో మూడు సార్లు వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు వద్దే ఆపేసి వెనక్కి పంపించేశారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవర్నీ కలవడం లేదని చెప్పి తిప్పి పంపించేశారు. అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా అందుకు నిరాకరించారు.

జగన్‌ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ఐపీఎస్‌ అధికారి... ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. సీఎం అనుమతి ఇవ్వకున్నా, పిలవకున్నా పదే పదే ఆయన్ను కలిసేందుకు యత్నిస్తున్నారు. జూన్‌ 6న ఉండవల్లిలోని నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా.. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచే వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్‌ 13న తొలిసారి సచివాలయానికి వెళ్లగా అప్పుడు సీతారామంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ అధికారులు వెనక్కి పంపించేశారు. వైకాపాతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్‌ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని