Amravati: మూడు మార్గాలూ డబుల్‌ లైన్లతోనే అమరావతికి న్యాయం

రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Updated : 22 Jun 2024 06:57 IST

56 కి.మీ. సింగిల్‌ లైన్‌తో ఒరిగేదేంటి?
ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్‌ సిద్ధం
మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలి
సీఎం చంద్రబాబు జోక్యంతోనే.. ఇదంతా సాధ్యం
ఈనాడు, అమరావతి

రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్‌ లైన్‌తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రాజెక్టు అసలు స్వరూపమిది..

అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.

  • ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్‌ లైన్, అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ. సింగిల్‌ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కి.మీ. సింగిల్‌ లైన్‌ కలిపి మొత్తం 106 కి.మీ. మేర కొత్త లైన్‌కు ఆమోదం తెలిపారు.
  • దీనికి రూ.3,272 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్‌ తయారుచేసి 2017 నవంబరు 13న రైల్వేబోర్డుకు అందజేశారు. 
  • వీటికి 687 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటుందని తేల్చారు.
  • మూడు లైన్లలో కలిపి మొత్తం 200 వంతెనలు నిర్మించాలని నివేదికలో పేర్కొన్నారు.
  • వీటన్నింటికీ మట్టి పరీక్షలు సైతం అప్పట్లోనే పూర్తిచేశారు.

ఇప్పుడేం చేస్తున్నారు?

ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్‌లో ఇది డబుల్‌ లైన్‌ ఉండగా, సింగిల్‌ లైన్‌కే పరిమితం అవుతున్నారు. 


పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..

రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్‌పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్‌కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.


106 కి.మీ. డబుల్‌ లైన్‌ నిర్మిస్తేనే..

రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్‌ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్‌లైన్‌కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్‌ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.


అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి

మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్‌లైన్‌కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.


మూడు లైన్లతో మేలు జరిగేదిలా..

1 ఎర్రుపాలెం-నంబూరు లైన్‌తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం

విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్‌ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్‌కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్‌ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్‌లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.


2 అమరావతికి దగ్గరి మార్గం.

సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్‌ లైన్‌ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్‌ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్‌ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.


3 సీమ నుంచి నేరుగా రాజధానికి..

రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్‌ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్‌ లైన్‌లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్‌-గుంటూరు పాతలైన్‌లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని