Ramoji Rao: మము చెక్కిన శిల్పీ.. మరలి రావయ్యా!

రామోజీరావుకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో, గ్రూప్‌ సంస్థల కార్యాలయాల్లో గురువారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమాల్లో ఆయనకు పుష్పాంజలి ఘటించారు.

Updated : 21 Jun 2024 07:19 IST

రామోజీరావుకు గ్రూప్‌ సంస్థల ఉద్యోగుల ఘన నివాళులు
తెలుగు రాష్ట్రాల్లోని ‘ఈనాడు’ కార్యాలయాల్లో పుష్పాంజలి

రామోజీ ఫిల్మ్‌ సిటీలో గురువారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో పూలతో అలంకరించిన రామోజీరావు చిత్రపటం

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీరావుకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో, గ్రూప్‌ సంస్థల కార్యాలయాల్లో గురువారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమాల్లో ఆయనకు పుష్పాంజలి ఘటించారు. తమను అక్షరయోధులుగా తీర్చిదిద్దిన.. తమ జీవితాలను చక్కదిద్దిన శిల్పి రామోజీరావుయే అని కొనియాడారు. ఆయన మళ్లీ రావాలని అశ్రునయనాలతో ఆకాంక్షించారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను సాధిస్తామని సంకల్పం బూనారు. 

 తెలుగు రాష్ట్రాల్లోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయాల్లో గురువారం సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈనాడు, ఈటీవీ సిబ్బంది పాల్గొని రామోజీరావుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ, సోమాజిగూడలోని ‘ఈనాడు’ కార్యాలయం, ఉప్పల్, గాంధీనగర్‌ యూనిట్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు, ప్రియా ఫుడ్స్, మార్గదర్శి సిబ్బంది, దేశవ్యాప్తంగా ఉన్న ఈటీవీ భారత్‌ ఉద్యోగులు పాల్గొని.. రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు. కరీంనగర్‌లోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రామోజీరావుకు నివాళులర్పించారు. నిజాయతీకి నిలువుటద్దంలా వ్యవహరించిన రామోజీరావు అన్ని తరాలకూ మార్గదర్శి అని అన్నారు. ఆయన సామాన్యుల భుజం తట్టి ప్రోత్సహించే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమాల్లో రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అనేక సంస్థలు, సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు రామోజీరావుకు నివాళి అర్పించారు.

రామోజీరావుకు పుష్పాంజలి ఘటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌

మార్గదర్శి శాఖల్లో.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 113 మార్గదర్శి కార్యాలయాల్లో ఉద్యోగులు రామోజీరావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 37,  తెలంగాణలో 37, తమిళనాడులో 16, కర్ణాటకలో 23 శాఖల కార్యాలయాల్లో.. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొత్తగూడెంలోని మార్గదర్శి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కళాంజలి సిబ్బంది సైతం రామోజీరావుకు నివాళులు అర్పించారు.

  • దేశవ్యాప్తంగా పత్రికా రంగంలో విశేష సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖ జర్నలిస్టులకు రామోజీరావు పేరిట ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ప్రదానం చేస్తామని, అందుకోసం కమిటీ వేయనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. తిరుపతిలో రామోజీరావు విగ్రహ ప్రతిష్ఠకు కృషి చేస్తానని చెప్పారు. 
  • మార్గదర్శిపై గత ప్రభుత్వం దురుద్దేశంతో దాడులు చేయగా, రామోజీరావు ధైర్యంగా ఎదుర్కొన్నారని విజయవాడలోని ప్రైడ్‌ మాధవ్‌ హోటల్‌లో గురువారం నిర్వహించిన సంస్మరణ సభలో పలువురు వక్తలు గుర్తుచేశారు. రామోజీరావు సమకాలికులు నాదెండ్ల మాధవరావు, గవర్నర్‌పేట మార్గదర్శి మేనేజర్‌ కొల్లి కృష్ణమోహన్, ఆలిండియా లాయర్స్‌ సంఘం జాతీయ కార్యదర్శి సుంకర రాజేంద్రప్రసాద్, ప్రముఖ నాచురోపతి వైద్యుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యశాస్త్రి పాల్గొన్నారు.

ద్వారకామాయి వృద్ధాశ్రమంలో..

శిర్డీ: మహారాష్ట్రలోని శిర్డీలో గల ద్వారకామాయి వృద్ధాశ్రమంలో రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. తెలుగువారికే కాకుండా భారతదేశానికి ఆయన చేసిన సేవలు అమోఘమంటూ స్మరించుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన అయ్యపురాజు సోమయాజుల అప్పరాయశర్మ అనే వృద్ధుడు మాట్లాడుతూ ఈనాడు ఆదివారం అనుబంధంలో ద్వారకామాయి ఆశ్రమం గురించి రాసిన కథనం చదివి తాను ఇక్కడకు వచ్చానని, ఆ పుస్తకాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానని తెలిపారు. ఇటీవలే అకాల మరణం చెందిన ఆశ్రమ ట్రస్టీ శ్రీనివాస్‌కు రామోజీరావు అంటే ఎనలేని అభిమానమని అక్కడ ఆశ్రయం పొందిన తెలుగువారైన వృద్ధులు గుర్తు చేసుకున్నారు. ద్వారకామాయి ఆశ్రమ నిర్వాహకులు రామోజీరావుకు స్మృత్యంజలి ఘటిస్తూ... వృద్ధులకు అన్నదానం చేశారు.


జైపుర్, బెంగళూరుల్లో నివాళి 

ఈటీవీ భారత్‌: రామోజీరావుకు సీనియర్‌ పాత్రికేయులు పలువురు నివాళులు అర్పించారు. జర్నలిజం విలువలను ఆయన పరిరక్షించారని కొనియాడారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో పింక్‌ సిటీ ప్రెస్‌ క్లబ్, కర్ణాటకలోని బెంగళూరు ప్రెస్‌ క్లబ్‌లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మీడియా రంగంలో రామోజీరావు సేవలను వక్తలు స్మరించుకున్నారు. ఆయన సాధించిన విజయాలను కొనియాడారు. జర్నలిజంలో విశ్వసనీయతను ఈనాడు, ఈటీవీ బలోపేతం చేశాయని అన్నారు. ఈటీవీ భారత్‌ బెంగళూరు బ్యూరో చీఫ్‌ సోమశేఖర్‌ కవచూర్, అమిత్‌ భట్, సుధీర్‌ శర్మ, శశిమోహన్‌ శర్మ, రామకృష్ణ ఉపాధ్యాయ, నరేంద్ర పుప్పాల, శివశంకర్, రాధికారాణి, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని