Ramoji Rao: నిజాయతీకి నిలువుటద్దం రామోజీరావు

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలోనూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని.. ప్రజల తరఫున పోరాడిన మహోన్నత వ్యక్తి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ‘ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం పోరాడి ప్రజా విజయానికి కృషి చేసిన వ్యక్తిగా రామోజీరావు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

Updated : 08 Jul 2024 06:30 IST

ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధుడు 
ఆయన తెలుగుజాతి గర్వించదగ్గ విలువల శిఖరం 
రామోజీరావు జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాలి 
గుంటూరులో సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు 

గుంటూరులో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతున్న ముఖ్యఅతిథి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. సమావేశంలో న్యాయవాది రవితేజ, సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గళ్లా మాధవి, మహమ్మద్‌ నసీర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కాంగ్రెస్‌ నాయకుడు తులసిరెడ్డి, సీపీఎం నాయకుడు వెంకటేశ్వరరావు, ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్టు కార్యదర్శి రామచంద్రరాజు, డిప్యూటీ మేయర్‌ సజీలా

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు నగరం, కలెక్టరేట్, నెహ్రూనగర్‌: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలోనూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని.. ప్రజల తరఫున పోరాడిన మహోన్నత వ్యక్తి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ‘ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం పోరాడి ప్రజా విజయానికి కృషి చేసిన వ్యక్తిగా రామోజీరావు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రభుత్వాలకు దీటుగా సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఆదుకునేవారు. సారా వ్యతిరేక, అక్షరాస్యత ఉద్యమాలను మహోద్యమాలుగా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. భావితరాలకు ఆయన జీవిత చరిత్రను తెలియజేసేందుకు పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు ప్రకటించాలి’ అని ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరయోధుడు, పద్మవిభూషణ్‌ రామోజీరావు సంస్మరణ సభలో పలువురు వక్తలు కోరారు. ‘రామోజీరావు వ్యక్తి కాదు. ఓ శక్తి. తెలుగుజాతి గర్వించదగ్గ విలువల శిఖరం. జీవితాంతం ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పరితపించారు’ అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ‘ఎవరి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా.. నీతి, నిజాయతీగా ఈనాడు పత్రికను నడిపించారు. దుర్మార్గుల పాలిట సింహస్వప్నంగా పోరాడి ప్రజా విజయాన్ని చూశారు. ఆయన పాటించిన విలువలు, నిబద్ధత.. పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. 

రామోజీరావు జీవిత ఘట్టాలతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన 


క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు

- ఎం.నాగేశ్వరరావు, ‘ఈనాడు’ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్‌

మూడు దశాబ్దాలకు పైగా రామోజీరావుతో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఆయనది చాలా ముందుచూపు అని అందరూ అంటారు. మరణాన్నీ ముందే ఊహించారు. కొన్ని రోజులే అని చెప్పారు. కానీ మేమెవరం నమ్మలేదు. ఆయన చెప్పిన మాటల్లో మేం నమ్మనిది ఇదొక్కటే. ఆయన జీవిత చరిత్ర రాద్దామనేది నా ఆలోచన. ఆయన జీవితం సరళమైంది. నమ్మిన విలువలు ఆదర్శప్రాయమైనవి. క్రమశిక్షణ, విశ్వసనీయత, ధైర్యం.. అవే ఆయన బలాలు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు ఎదిగి ఒక లెజెండ్‌గా నిలిచారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి చూపిన దార్శనికుడు. ఫిల్మ్‌సిటీ ద్వారా ప్రభుత్వాలకు ఏటా రూ.2,500 కోట్ల పన్నుల ఆదాయం లభిస్తోంది. ఆయన ధైర్యం అనితర సాధ్యం. ఏపీలో 2022 నవంబరు నుంచి ఇటీవలి వరకు మార్గదర్శిలో ఒక్క చిట్‌ కూడా వేయనీయలేదు. ఇదే పరిస్థితి 2006లో కూడా ఎదురైంది. అయినా చలించలేదు. రామోజీ గ్రూపు సంస్థల అస్తిత్వానికే సవాళ్లు ఎదురైనా రాజీపడలేదు. ఈ పరిస్థితిపై ఏ ఒక్కరికీ ఫోన్‌ చేయలేదు. జేఆర్‌డీ టాటా, సింగపూర్‌ నిర్మాత లీ లక్షణాలు ఆయనవి. పదవుల్ని అడగరు, తీసుకోరు. తాను బలహీనపడే ఏ ఒక్క పనీ చేయరు. దినపత్రికను విశాఖలో ప్రారంభించడం, జిల్లా పత్రికలు తీసుకురావడం సాహసాలే. ఫిల్మ్‌సిటీ నిర్మాణం కూడా అంతే. మార్గదర్శిపై సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే తెగబడ్డారు. అయినా.. రెండున్నర లక్షల మంది చందాదారుల్లో ఒక్కరూ భయపడలేదు. రామోజీరావుపై నమ్మకం అలాంటిది. పత్రిక మన చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు రాయడం పాఠకుల పట్ల అపచారమని చెప్పేవారు. ఆయనకు పనే ఆనందం, పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం.


తెలుగు భాష పరిరక్షణకు పాటుబడ్డారు

- మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే 

భారతీయ పత్రికా రంగంలో రామోజీరావుది ఒక విశిష్ట స్థానం. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాకే తుదిశ్వాస విడిచారు. జైలుకు పంపాలనే కుట్రలు జరిగినా.. చలించని ధైర్యశాలి. ఆయన జీవితం ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథం. గతంలో నేను కృష్ణా డెల్టా పరిరరక్షణ ఉద్యమానికి నాయకత్వం వహించా. ఆ ఉద్యమ తీవ్రత, రైతాంగం ఇక్కట్లను కళ్లకు కట్టినట్లుగా అప్పట్లో ఈనాడు-ఈటీవీలో ప్రముఖంగా చూపడం వల్లే పాలకులు స్పందించి నీళ్లు ఇచ్చారు. శ్రమదానం ఉద్యమానికి ఊరూవాడా కదిలొచ్చి ఊళ్లు, చెరువులు బాగు చేసుకోవడం వెనుక ‘ఈనాడు’ ప్రముఖ పాత్ర పోషించింది. దివిసీమ తుపాను సమయంలో బాధితులకు ఇళ్లు నిర్మించారు. తెలుగుభాష పరిరక్షణకు నడుంకట్టారు.


ఆయన నిత్యకృషీవలుడు 

- ఎన్‌.తులసిరెడ్డి, మీడియా కమిటీ ఛైర్మన్, ఏపీసీసీ

చరిత్రలో కొద్దిమంది వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. వారిలో రామోజీరావు ఒకరు. ఏ రంగంలో ప్రవేశించినా.. తన కృషితో అగ్రగామిగా నిలవడమే ఆయన నైజం. రాళ్లగుట్టను రామోజీ ఫిలింసిటీగా మార్చిన యోధుడు. పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేసి ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. సేవాతత్పరుడిగా, పరోపకారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా పెట్టాలి.


ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు

- నసీర్‌ అహ్మద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే

తుపాను, భూకంపాలు సంభవించిన సమయంలో ప్రభుత్వానికి దీటుగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి రామోజీరావు. రామోజీరావుపై, మార్గదర్శిపై కేసులు పెట్టమంటే.. ఆయనపై ఉన్న నమ్మకంతో ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వారున్నారు. ఆయనపై నమ్మకానికి ఇదే నిదర్శనం. దేవుడు, తల్లిదండ్రులు, గురువు తర్వాత రామోజీరావుకు కృతజ్ఞతగా ఉంటాను. 


తెలుగు లోగిళ్లలో ఆయనకు ప్రత్యేకస్థానం

- డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ మంత్రి

తెలుగువారి చిరంజీవుల జాబితాలో రామోజీరావు మొదటి వరసలో ఉంటారు. భాష, సాహిత్యం, విలువలు, రాజకీయాలు ఇలా అనేక విషయాల్లో ఆయన ప్రభావం తెలుగువారిపై ఉంది. చిన్ననాటి నుంచి ఈనాడు పత్రిక చదువుతున్నా. శ్రీశ్రీ చనిపోయిన సమయంలో శ్రీశ్రీ చిరంజీవి అనే శీర్షిక నన్ను ఆకర్షించింది. ఇప్పటికీ అది గుర్తుంది. తెలుగు లోగిళ్లలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.


సామాజిక ఉద్యమాలకు ఊపిరిపోశారు 

- వి.లక్ష్మణరెడ్డి, అధ్యక్షుడు, జన చైతన్య వేదిక 

తెలుగునాట సామాజిక ఉద్యమాలకు ఊపిరిపోసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి. తెలుగుజాతికి మార్గదర్శకంగా నిలిచారు. సంపూర్ణ అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమాలకు ఆయన అందించిన సహకారం మరువలేనిది.


తెలుగు ఉచ్చారణకు ‘ఈనాడు’ చదవమనేవారు

- పి.రామచంద్రరాజు, కార్యదర్శి. ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్టు 

మేం చదువుకునే రోజుల్లో తెలుగుభాష చక్కగా ఉచ్చరించాలంటే ఈనాడు పత్రికను చదవాలని చెప్పేవారు. ఆ పత్రికను చదువుతూ పెరిగాం. ఇప్పటికీ రోజూ చదవాల్సిందే. లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది. ఈటీవీ ‘పాడుతా తీయగా’ ద్వారా వేల మందికి  అవకాశాలు కల్పించారు.


మా జీవితంపైనా ఆయన ముద్ర ఉంది..
- గళ్లా మాధవి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే మాటకు నిర్వచనం రామోజీరావు జీవితం. మా జీవితంపైనా ఆయన ముద్ర ఉంది. నా భర్త రామచంద్రరావు ఉషాకిరణ్‌ మూవీస్‌లో లైట్‌మెన్‌గా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా. అది నెరవేరలేదు.


విశ్వసనీయతకు మారుపేరు 
- ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ నేత

రామోజీరావు ప్రతి అడుగూ దార్శనికతతో కూడుకున్నది. ఈనాడు, ఈటీవీ వార్తలు విశ్వసనీయతకు మారుపేరు. ఆ నమ్మకాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తుండటం చాలా గొప్ప విషయం. 


ప్రజలే చరిత్ర నిర్మాతలని నమ్మారు
- వై.వెంకటేశ్వరరావు, సీపీఎం నేత

రామోజీరావు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోవచ్చు. కానీ ఆయనపై కమ్యూనిస్టు ఉద్యమ భావజాల ప్రభావం ఉంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని నమ్మారు. పాలకుల తప్పిదాలను నిర్మొహమాటంగా ఖండించేవారు. 


సమాజ నిర్దేశకుడు
- పాతూరి నాగభూషణం, భాజపానేత 

ఒక వ్యక్తి సమాజాన్ని మార్చగలరనడానికి రామోజీరావు నిదర్శనం. వ్యక్తితో సంబంధం లేకుండా సంస్థను నడుపుతూ.. మరో వందేళ్లు నడిచేలా పునాదులు వేశారు. 


ప్రజాస్వామ్య పరిరక్షకుడు
- కేఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ 

ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతి సందర్భంలో దాన్ని కాపాడటానికి రామోజీరావు ఎంతో కృషి చేశారు. ప్రాంతీయ భాషల పత్రికలన్నింటిలో ఈనాడు ముందంజలో ఉంది.


దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలి 
- డాక్టర్‌ పి.కృష్ణయ్య, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి  

సినీ రంగానికి రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు ఇవ్వాలి.  భారతరత్న కంటే ముందే ఫాల్కే అవార్డు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. 

  • సంస్మరణ సభలో కన్నా విద్యా సంస్థల అధినేత కన్నా మాస్టరు, హైకోర్టు న్యాయవాది రవితేజ తదితరులు రామోజీరావు సేవలను కొనియాడారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని