Visakhapatnam: కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్‌ వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

Updated : 15 Jun 2024 16:20 IST

విశాఖ కేజీహెచ్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్‌ వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. శస్త్రచికిత్స చేసి మళ్లీ చూపు ప్రసాదించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురధరపాలేనికి చెందిన మీసాల నాగేశ్వరరావు (39) ఈ నెల 4వ తేదీ రాత్రి తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దిగుతూ కాలు జారి పడిపోయారు. అప్పుడు దాదాపు 12 అంగుళాల పొడవున్న సరుగుడు కొయ్య ఆయన కుడి కంటి నుంచి మెదడు కింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఆయనను పరీక్షించిన నర్సీపట్నం వైద్యులు ఐదోతేదీ ఉదయం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడి కంటి వైద్య నిపుణులు, న్యూరోసర్జన్లు, ఎముకలు, ఈఎన్టీ, మత్తు విభాగాల వైద్యులు బృందంగా ఏర్పడి బాధితుడికి పలు పరీక్షలు చేశారు. అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొయ్యను తొలగించారు. వారం రోజుల పాటు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నారు. ‘శస్త్రచికిత్స సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కన్ను, కంటి నరాలు, మెదడు కింద ఉన్న రక్త నాళాలకు నష్టం జరగలేదు. ఫలితంగా కంటి చూపు మళ్లీ వచ్చింది. క్లిష్టమైన ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదుగా జరుగుతాయి, పలు విభాగాల వైద్యులు కలిసి చేయడంతో విజయవంతమైంది’ అని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద తెలిపారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్‌ కల్యాణి, డాక్టర్‌ దక్షిణామూర్తి, డాక్టర్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ హయగ్రీవరావు, డాక్టర్‌ రవి, డాక్టర్‌ శ్రీలక్ష్మి బృందాన్ని ఆయన అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని