Vidya Kanuka: విద్యా కానుకలో ముందస్తు కుమ్మక్కు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే విద్యా కానుక కిట్లకు గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదార్లు ఈ ఏడాది సరఫరాలో జాప్యం చేస్తున్నారు.

Updated : 12 Jun 2024 06:30 IST

టెండర్లు లేకుండా రూ.772 కోట్ల  కిట్ల సరఫరా పాత గుత్తేదార్లకే
గతేడాది అందించిన వారికి బిల్లుల బకాయిలు
దాంతో ఇప్పుడు సరఫరాలో జాప్యం 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే విద్యా కానుక కిట్లకు గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదార్లు ఈ ఏడాది సరఫరాలో జాప్యం చేస్తున్నారు. గత సర్కారులో పని చేసిన అధికారులే ఇప్పుడూ ఉండడంతో సామగ్రి సరఫరాలో ఆలస్యం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పాఠశాలలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బడులు తెరిచినప్పటి నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ చేసేందుకంటూ ఎన్నికల ముందు అధికారులు, వైకాపా నేతలు హడావుడి చేశారు. తీరా ఇప్పుడు పంపిణీ చేసే సమయం వచ్చేసరికి కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదు. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావులు కలిసి రూ.772 కోట్ల విలువ చేసే కిట్లకు టెండర్లు లేకుండా గతేడాది సామగ్రి ఇచ్చిన గుత్తేదార్లకే నామినేషన్‌పై ఇచ్చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో కిట్లను సరఫరా చేసిన గుత్తేదార్లకు 10 శాతం బిల్లులను వైకాపా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ బిల్లులు సక్రమంగా ఇవ్వకుండానే కమీషన్ల కోసం ఎన్నికల ముందు టెండర్లు లేకుండా పాత గుత్తేదార్లకే మళ్లీ సామగ్రి సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు గుత్తేదార్లు బకాయిలు ఇవ్వాలంటూ మెలిక పెట్టి, సరఫరా సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్‌ సమయంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దిల్లీకి వెళ్లి బూట్లు, బ్యాగ్‌ల సరఫరా వేగంగా ప్రారంభమైనట్లు హడావుడి చేసినా సామగ్రి సక్రమంగా వచ్చేందుకు చర్యలు తీసుకోలేదు.

పథకం ప్రకారమే.. 

పాత గుత్తేదార్లతో కుమ్మక్కై విద్యా కానుక కిట్లు సక్రమంగా రాష్ట్రానికి రాకుండా పథకం ప్రకారం వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. నోటు పుస్తకాల కాంట్రాక్టును ఒకే గుత్తేదారుకు ఇచ్చినందుకు రూ.30 లక్షల వరకు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రికి ముట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడైనా రూ.700 కోట్లకుపైగా విలువ చేసే దాన్ని టెండర్లు లేకుండా అప్పగిస్తారా? అది కూడా పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు. గతేడాది బకాయిలు చెల్లిస్తేనే ఈ ఏడాది సామగ్రి సరఫరా చేస్తామంటూ గుత్తేదార్లు మెలికపెడుతున్నారు. అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో సరఫరాలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏకరూపదుస్తులు 17%, నోటుబుక్స్‌ 82%, బ్యాగ్‌లు 39%, బెల్టులు 72%, బూట్లు 32%, నిఘంటువులు 80% వచ్చాయి. వీటి పంపిణీ మొదలు పెడితే క్రమంగా మిగతావి వస్తాయని అధికారులు సమాధానమిస్తున్నారు. 

విద్యాకానుక పేరు మార్పు

విద్యా కానుక పేరును విద్యార్థి కిట్టుగా మార్పు చేశారు. ఆ మేరకు జిల్లాలకు సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు దాదాపు అన్ని మండల స్థాయికి చేరాయి. బూట్లు, బెల్టులు, ఏకరూపదుస్తులు కొంత మేరకు వచ్చాయి. మండలాల్లోని నిల్వ కేంద్రాల నుంచి పాఠశాలలకు తరలించేందుకు అయ్యే వ్యయాన్ని మండల విద్యాధికారులకు అందించారు. సామగ్రి కొరత ఏర్పడితే సరఫరాదారుడికి నేరుగా ఈ-మెయిల్‌ ద్వారా సమచారం అందించాలని ఎస్‌ఎస్‌ఏ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో చదివే 36.69 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇవ్వనున్నారు. వీటి సరఫరాకు ఎన్నికల ముందే వైకాపా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని