Vizag Steel Plant: అమ్మకానికి రూ.475 కోట్ల విశాఖ ఉక్కు ఆస్తులు!

విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖలోని విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టిన విషయం విదితమే.

Updated : 21 Jun 2024 07:53 IST

కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ముందు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్రతిపాదనలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు

స్టీలు ప్లాంటుకు చెందిన హైదరాబాద్‌లోని యార్డు భూములు

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖలోని విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టిన విషయం విదితమే. తాజాగా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు, యార్డు స్థలాలు అమ్మేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌లో సుమారు రూ.475 కోట్లు ఉంటుందని అమ్ముకునేందుకు అనుమతులివ్వాలంటూ కేంద్ర మంత్రిత్వశాఖ ముందు ప్రతిపాదన ఇప్పటికే పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టడంపై కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మకానికి పెట్టిన స్థలాలు ఇవే

 స్టీలు ప్లాంటుకు చెందిన మొత్తం 11 ఆస్తులను అమ్మేందుకు మరోసారి రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం పక్కన సుమారు ఎకరం స్థలంలో ఉన్న ఉక్కు గెస్ట్‌హౌస్, మార్కెటింగ్‌ కార్యాలయ భవనం, ముంబయి, దిల్లీ, బెంగళూరులోని కార్యాలయ భవనాలు, ప్లాట్లను కలిపి రూ.50 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. వీటితోపాటు హైదరాబాద్‌లోని స్టాకు యార్డు స్థలం 22 ఎకరాలు, చెన్నైలోని యార్డుకు చెందిన 13.20 ఎకరాలు కలిపి మొత్తం రూ.475 కోట్లకు అమ్మాలని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) నిర్ణయించింది.. కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి అనుమతి రాగానే ఆస్తులను విక్రయానికి పెట్టి.. ప్రభుత్వరంగ సంస్థలు ఆసక్తి చూపాలంటూ లేఖ విడుదల చేయడమే తరువాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

విశాఖ ఉక్కు వ్యాపారం ఎలా సాగుతుంది? 

చెన్నై యార్డును ఇటీవల పరిశీలించడానికి కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి ఓ అధికారి వెళితే, అదే రోజు అదానీ సంస్థ ప్రతినిధి అక్కడికి వెళ్లి సంయుక్తంగా పరిశీలించినట్లు సమాచారం. చెన్నై, హైదరాబాద్‌లో అమ్మకానికి పెడుతున్న యార్డుల స్థలాల పక్కనే..విశాఖ ఉక్కుకు పోటీగా ఉన్న జిందాల్, టాటా, సెయిల్‌ సంస్థలకు యార్డులు ఉన్నాయి. ఇలాంటి చోట యార్డులు మూసివేస్తే వ్యాపారం ఎలా సాగుతుందని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సొంత యార్డులో ఉత్పత్తులు పెట్టి హ్యాండ్లింగ్‌ చేయడానికి టన్నుకు రూ.35 వరకు ఖర్చవుతుంది. అదే బయట యార్డుల్లో ఉత్పత్తులు ఉంచి కన్సైన్‌మెంట్‌ ఏజెన్సీని (సీఏ) నియమిస్తే..టన్నుకు రూ.700-800 వరకూ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా విశాఖ స్టీలు ప్లాంటుకు లాభమని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ప్రస్తుత వ్యాపారం 40% వరకు ఉంటుంది. ఈ ఫ్యాక్టరీకి రోజుకు రూ.34 కోట్ల టర్నోవర్‌ ఉంటే, అందులో రూ.12.50 కోట్ల విలువగల ఉత్పత్తిని ఈ మూడు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అలాంటి చోట యార్డు భూములను అమ్మడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ అమ్మకాలపై స్టే లేదా? 

స్టీలు ప్లాంటు ఆస్తులను అమ్మకానికి పెట్టకూడదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్టే ఇచ్చారు. స్టే అమలులో ఉన్నప్పుడు, మరోసారి విశాఖ ఉక్కు ఆస్తులను అమ్మేందుకు దస్త్రాలు  ఎలా కదుపుతారని కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రెండో దఫాగా ఈ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు అనుమతుల కోసం బోర్డుకు ప్రతిపాదించారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వినర్‌ అయోధ్యరామ్‌ తెలిపారు. ఇలాంటి వ్యవహారాలు పక్కనపెట్టి ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకునే విషయంపై దృష్టిపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు