Andhra News: ‘స్వచ్ఛాంధ్ర’లో అవినీతి కంపు!

‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో గత ఐదేళ్లలో వివిధ కొనుగోళ్లలో భారీగా నిధుల గోల్‌మాల్‌ జరిగింది. వైకాపా ప్రభుత్వంలో అస్మదీయ గుత్తేదారు సంస్థలకు స్వచ్ఛాంధ్ర సంస్థ నిధులు అడ్డగోలుగా ధారపోశారు.

Updated : 22 Jun 2024 07:36 IST

డస్ట్‌ బిన్లు, ట్రై సైకిళ్ల, ఈ-ఆటోల కొనుగోళ్లలో అస్మదీయ సంస్థలకే కాంట్రాక్టులు
వైకాపా పెద్దలు, అధికారుల జేబుల్లోకి భారీగా కమీషన్లు 
గత ఐదేళ్ల కొనుగోళ్లపై విచారణ జరిపితే బాగోతం వెలుగులోకి

శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ పురపాలక కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా ఈ-ఆటోలు

ఈనాడు, అమరావతి: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో గత ఐదేళ్లలో వివిధ కొనుగోళ్లలో భారీగా నిధుల గోల్‌మాల్‌ జరిగింది. వైకాపా ప్రభుత్వంలో అస్మదీయ గుత్తేదారు సంస్థలకు స్వచ్ఛాంధ్ర సంస్థ నిధులు అడ్డగోలుగా ధారపోశారు. ట్రై సైకిళ్లు, ఈ-ఆటోల నుంచి డస్ట్‌బిన్ల కొనుగోళ్ల వరకు అప్పటి ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన సంస్థలకే అధికారులు కాంట్రాక్టులు కట్టబెట్టారు. 2014-19లో తెదేపా ప్రభుత్వం ఇచ్చిన ధరల కంటే అధికంగా చెల్లించి వైకాపా ప్రభుత్వ పెద్దలు కొందరు, స్వచ్ఛాంధ్ర సంస్థలో అధికారులు కమీషన్లు కొట్టేశారు. నాసిరకం ట్రైసైకిళ్లు, కదలని ఈ-ఆటోల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. లక్షల సంఖ్యలో కొన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్న డస్ట్‌ బిన్లు (ప్లాస్టిక్‌ బుట్టలు) చాలాచోట్ల పంపిణీయే కాలేదు. గత ఐదేళ్లలో జరిగిన భారీ కొనుగోళ్లపై కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తే ఈ అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుంది.

డస్ట్‌ బిన్ల కొనుగోళ్లలో అడ్డగోలుగా దోపిడీ 

గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు 12 లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్‌ డస్ట్‌ బిన్లు ఒక్కోటి జీఎస్‌టీతో కలిపి రూ.68కి గత తెదేపా ప్రభుత్వ హయాంలో స్వచ్ఛాంధ్ర సంస్థ కొనుగోలు చేసింది. వైకాపా ప్రభుత్వంలో 10 లీటర్ల సామర్థ్యంగల 30 లక్షల డస్ట్‌బిన్లు ఒక్కోటీ రూ.75 ధరకు కొన్నది. ఒక్కో దానిపై అదనంగా రూ.7 చొప్పున గుత్తేదారులకు  చెల్లించి రూ. 2.10 కోట్ల నిధులకు అధికారులు టెండర్‌ పెట్టారు. ప్లాస్టిక్‌ బుట్టల వ్యవహారాన్ని అధికారులు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చాలా గోప్యంగా ఉంచారు. టెండర్‌ ప్రక్రియ నుంచి గుత్తేదారు సంస్థల ఎంపిక, డస్ట్‌ బిన్ల పంపిణీ వంటి వివరాలు ఆర్టీఐ ద్వారా కూడా ఇవ్వకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేశారు. 

ట్రై సైకిళ్ల సేకరణలోనూ అదే దారి

వీధుల్లో సేకరించే చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు 500 ట్రై సైకిళ్లు తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కోటి రూ.23,750 ధరకు కొన్నారు. అప్పట్లో జిల్లా యూనిట్‌గా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని సేకరించి పంచాయతీలకు సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇదే స్వచ్ఛాంధ్ర సంస్థ రాష్ట్రం యూనిట్‌గా దాదాపు 14,000 ట్రై సైకిళ్లు కొని, ఒక్కో దానికి రూ.32,750 చొప్పున చెల్లించింది. ఒక్కో సైకిల్‌పై అదనంగా రూ.9 వేల చొప్పున రూ. 12.60 కోట్లు ఖర్చు చేసింది. స్వచ్ఛాంధ్ర సంస్థలో కీలక స్థానంలోని అధికారి ఒకరు ఈ విషయంలో చక్రం తిప్పారు.  

తెదేపా ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో చేసే ప్రతి కొనుగోళ్లలోనూ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రాధ్యాన్యమిచ్చేవారు. అప్పట్లో పంచాయతీలకు అందించిన డస్ట్‌బిన్లు, ట్రై సైకిళ్లు ఎంఎస్‌ఎంఈలు సరఫరా చేసినవే. వైకాపా వచ్చాక ఆ పార్టీ పెద్దలకు సంబంధించిన అస్మదీయ సంస్థలకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. 

భారీ సంస్థల ప్రయోజనాలే లక్ష్యంగా 

ప్రభుత్వ పెద్దల అస్మదీయ గుత్తేదారు సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారులు బరి తెగించారు. టెండర్లలో పాల్గొనే గుత్తేదారు సంస్థలకు అనుభవం, టర్నోవర్‌ భారీగా చూపించి చిన్న సంస్థలు దరిదాపులకు రాకుండా చేశారు. ఉదాహరణకు 30 లక్షల డస్ట్‌బిన్ల సేకరణకు సంబంధించిన టెండర్లలో పాల్గొనే సంస్థల వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్లు తప్పనిసరన్న నిబంధన పెట్టారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు అవకాశం కోల్పోయాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి ముఖ్య అనుచరుడి సంస్థకు డస్ట్‌బిన్ల పంపిణీ టెండర్‌ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారి ఒకరు భారీగా కమీషన్లు కొట్టేశారన్నది ప్రధాన ఆరోపణ. డస్ట్‌ బిన్లు కూడా పూర్తిగా ప్రజలకు పంపిణీ చేయలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఈ-ఆటోల కొనుగోళ్లలో కమీషన్ల కహానీ 

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వంలో రూ.21.18 కోట్లతో కొనుగోలు చేసి 36 పట్టణ స్థానిక సంస్థలకు సరఫరా చేసిన 516 ఈ-ఆటోల్లోనూ భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన కొన్ని సంస్థల ద్వారా ఒక్కో ఆటో రూ.4.10 లక్షలకు స్వచ్ఛాంధ్ర సంస్థ కొన్నది. 2023 జూన్‌ 8న అప్పటి సీఎం జగన్‌ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఇవి స్టార్టవ్వని కారణంగా వేరే వాహనాల ద్వారా పుర, నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు చేరవేశారు. వీటిలో సగానికి పైగా రోడ్ల మీదకు రాకుండా షెడ్లకే పరిమితమయ్యాయి. చెత్త తరలింపునకు అనువుకాని ఆటోలను ప్రభుత్వం కొన్నదన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. బ్యాటరీలు పాడవడం, ఛార్జింగ్‌ సరిగా కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి.


విజిలెన్స్‌ విచారణ పేరుతో ఎంఎస్‌ఎంఈలకు తీవ్ర ఇబ్బందులు

స్వచ్ఛాంధ్ర సంస్థ ద్వారా అప్పట్లో తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన వివిధ కొనుగోళ్లపై వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించి అనేక ఎంఎస్‌ఎంఈలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వీరికి పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా తిప్పలు పెట్టింది. బాధితులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకొందరు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే తెదేపా ప్రభుత్వంలో డస్ట్‌ బిన్లు, ట్రై సైకిళ్ల కొనుగోళ్లపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అయినా అధికారులు అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు. అయినప్పటికీ స్వచ్ఛాంధ్ర సంస్థలో తిష్ఠవేసి చక్రం తిప్పుతున్న కొందరు అధికారులు పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా ఎంఎస్‌ఎంఈలను ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని