Serp: సెర్ప్‌ నిండా వైకాపా మనుషులే.. పెద్దిరెడ్డి, అవినాష్‌రెడ్డి సిఫార్సుతో భారీగా నియామకాలు

మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో కీలకమైన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌)ని వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది.

Updated : 10 Jul 2024 08:11 IST

ఆ పార్టీకి జీ హుజూర్‌ అన్నవారికే పదోన్నతులు, వేతనాల పెంపు 
మహిళల ఉపాధి కల్పన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ నిధుల మళ్లింపు

ఈనాడు, అమరావతి: మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో కీలకమైన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌)ని వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది. లక్ష్యానికి దూరంగా.. వైకాపా కార్యకర్తలు, సానుభూతిపరులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఐదేళ్లూ నడిపించింది. వైకాపాకు జై కొట్టేవారిని ఏరికోరి ఎంపిక చేసుకుని మరీ రాష్ట్ర కార్యాలయానికి తెచ్చుకున్నారు. ఆ పార్టీ నాయకుల సిఫార్సులతో పదుల సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా నియమించారు. వైకాపాకు వంత పాడేవారికి ఇష్టారాజ్యంగా వేతనాలు పెంచారు. పదోన్నతులూ కల్పించారు. జాతీయ జీవనోపాధుల కల్పన కింద కేంద్ర ప్రభుత్వమిచ్చిన నిధుల్ని, డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న రూ.2,100 కోట్ల అభయహస్తం సొమ్మునూ పక్కదారి పట్టించారు. పొదుపు మహిళలకు ఉపాధి కల్పన కోసమంటూ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చిన రూ.1000 కోట్ల నిధుల్నీ దారి మళ్లించేశారు. ఇవన్నీ సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్‌ విధులు నిర్వహిస్తున్నప్పుడే జరిగాయి. ఆయన మొన్నటి ఎన్నికల ముందు వైకాపాలో చేరి, కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నవరత్న పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమంటూ ‘వై’ క్రియేటర్స్‌ అనే సర్వే సంస్థను తెరపైకి తెచ్చి రూ.110 కోట్ల సెర్ప్‌ నిధుల్ని దారి మళ్లించారు. డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేసేలా సెర్ప్‌ను మళ్లీ గాడిన పెట్టాలంటే సమూల ప్రక్షాళన తప్పనిసరి.  

 ఇష్టానుసారం పదోన్నతులు, వేతనాల పెంపు

2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ హయాంలో 30 మంది కన్సల్టెంట్లను సెర్ప్‌ రాష్ట్ర కార్యాలయంలో నియమించారు. ఇందులో 10 మంది అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సుతో వచ్చినవారే. సీఈఓ ఇంతియాజ్‌ కూడా కొంతమందిని నియమించుకున్నారు. వీటిలో చాలా నియామకాలకు ఆర్థికశాఖ నుంచి అనుమతి కూడా లేనట్టు తెలిసింది. 2014 నుంచి పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచకుండా వీరికి మాత్రం ఇష్టానుసారం ఏటా పెంచుతూ పోయారు. హెచ్‌ఆర్‌ కూడా ఇష్టారాజ్యంగా పెంచేశారు. ప్రస్తుతం సెర్ప్‌ డైరెక్టర్లలోనూ అత్యధిక మంది వైకాపాకు వంతపాడినవారే. వైఎస్సార్‌ జిల్లాలో ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫార్సుతోనూ అప్పట్లో కొన్ని నియామకాలు జరిగినట్టు తెలిసింది. వారికి జిల్లా సమాఖ్యల నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. 

చేయూత మార్ట్‌ల ఏర్పాటులోనూ చేతివాటం

వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 51 చేయూత మార్ట్‌లను నిర్మించింది. ఆయా మండలాల పరిధిలోని ఒక్కో డ్వాక్రా మహిళ నుంచి పెట్టుబడి పేరుతో రూ.200 నుంచి రూ.300 చొప్పున వసూలు చేసి వీటిని నిర్మించారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో అప్పట్లో సెర్ప్‌లో కీలక అధికారికి రూ.5 లక్షలు, కింది స్థాయి అధికారులకు తలో కొంత ముట్టింది. 51 మార్ట్‌ల నిర్మాణంలో మెజారిటీ ఒకే కంపెనీకి కట్టబెట్టారు. ఇక్కడ కూడా గోల్‌మాల్‌ జరిగినట్టు ఆరోపణలున్నాయి. పెట్టుబడి పెట్టిన మహిళలకు.. లాభాల్లో ఒక్క రూపాయి కూడా పంచలేదు. చేయూత మార్ట్‌ల్లో ప్రైవేటు కంపెనీల వస్తువులు, సరకులే తప్ప డ్వాక్రా ఉత్పత్తులను అమ్మనేలేదు.

 స్త్రీనిధి ఎండీ నాంచారయ్య ధిక్కార స్వరం 

గత ప్రభుత్వ హయాంలో వివిధ పోస్టుల్లో నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్న విశ్రాంత అధికారులందరూ కొత్త ప్రభుత్వ ఆదేశాలతో విధుల నుంచి వైదొలగారు. గత ప్రభుత్వంలో వైకాపాకు పూర్తిగా వంతపాడారని పేరున్న స్త్రీనిధి ఎండీ నాంచారయ్య మాత్రం ఈ ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లు తెలిసింది. స్త్రీనిధి నిధుల దుర్వినియోగం కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఆయనపై న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని