TTD: ప్రక్షాళన మొదలైంది.. తిరుమల నుంచే శ్రీకారం!

పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది.

Updated : 15 Jun 2024 06:48 IST

తితిదే ఇన్‌ఛార్జి ఈవో ధర్మారెడ్డి తొలగింపు
నూతన ఈవోగా శ్యామలరావు నియామకం

ఈనాడు, అమరావతి: పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును పూర్తిస్థాయి ఈవోగా నియమించింది. ముక్కుసూటిగా వ్యవహరించడంతోపాటు విధుల పట్ల చిత్తశుద్ధితో ఉంటారని, నిబద్ధతతో పనిచేస్తారని ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న శ్యామలరావును తితిదేకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న శ్యామలరావు సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతోపాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పని చేసి గుర్తింపు పొందారు. అలాంటి చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన్ను ఈవోగా నియమించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇన్‌ఛార్జి ఈవోగా రెండేళ్లుగా ధర్మారెడ్డి 

2022 మేలో తితిదే అప్పటి ఈవో జవహర్‌రెడ్డి బదిలీ కావడంతో అప్పట్లో అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పోస్టులోకి ఎవరినీ రానివ్వకుండా ఆయనే కొనసాగుతూ వచ్చారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన్ను ఈ నెల 11న సెలవుపై పంపింది. శుక్రవారం అక్కడి నుంచి పూర్తిగా రిలీవ్‌ చేసేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని