Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇసుక కొండలు సీజ్‌

మాజీ మంత్రి, వైకాపా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్‌ చేశారు.

Updated : 10 Jul 2024 09:13 IST

 వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వలు 
కాలువ పనుల కోసమని నమ్మించే యత్నం 

ఈనాడు, కడప: మాజీ మంత్రి, వైకాపా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్‌ చేశారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక కొండలను కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీన పర్చుకున్నారు. పీటీఎం మండలం సంగమేశ్వరస్వామి ఆలయ సమీపంలోని పాపఘ్ని నదిలో తవ్వి, తంబళ్లపల్లెకు వెళ్లే మార్గంలో రెడ్డివారిపల్లి సమీపంలో రాశులుగా పోశారు. 2022లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీ వాహనాలతో రాత్రింబవళ్లు తరలించి ఇక్కడ నిల్వ చేశారు. అప్పట్లో నిత్యం 100 టిప్పర్ల ఇసుకను తరలించారు. వైఎస్సార్‌ జిల్లా గండికోట జలాశయం నీటిని పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌కు తరలించేందుకు వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు. గాలేరి-నగరి కాలువతో హంద్రీ-నీవా కాలువ అనుసంధానం కోసం పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు మీదుగా పనులు ప్రారంభించారు. ఈ పనుల పేరుతో భారీగా ఇసుక పోగేశారు. ఈ పనులు కొన్ని నెలలుగా జరగడంలేదు. ఈ వ్యవహారం కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. గనులు, జలవనరులు, రెవెన్యూ శాఖలతో పాటు సెబ్‌ అధికారులు కలిసి ఇసుక డంప్‌లను జప్తు చేశారు. ఇక్కడ 27,472 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వ చేసినట్లు కొలతలు వేసి నిర్ధారించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని