Sarada Peetham: శారదాపీఠానికి దాసోహం!

ప్రజల బాధలు పట్టించుకోని జగన్‌ జమానాలో... విశాఖ శారదా పీఠం ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెంతకు జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఇలా ఎందరో వచ్చివెళ్లేవారు.

Updated : 20 Jun 2024 10:20 IST

వైకాపా పాలనలో ఇష్టారాజ్య నిర్ణయాలు
ఐదేళ్లుగా వై-కేటగిరీలో పోలీసుల పహారా, ఎస్కార్ట్‌ వాహనాలు
ప్రతి నెలా  రూ.20-25 లక్షల ఖర్చు 
జగన్‌ కోసం యాగాలు చేసినందుకు ప్రతిఫలం

శారదా పీఠం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు

ఈనాడు, విశాఖపట్నం: ప్రజల బాధలు పట్టించుకోని జగన్‌ జమానాలో... విశాఖ శారదా పీఠం ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెంతకు జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఇలా ఎందరో వచ్చివెళ్లేవారు. దీంతో  పీఠంపై ఎన్ని విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. పైగా పటిష్ఠమైన పోలీసు భద్రత కల్పించారు. ఆ ఖర్చంతా ఇన్నాళ్లూ ప్రభుత్వమే భరించింది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి హోదాకు గండి పడుతుందని భావించారేమో... ఇటీవల పీఠాధిపతి స్వరం మార్చి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.

ఆ ఇద్దరికీ: ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడం సహజం. కానీ రాష్ట్రంలో ఇతర మఠాలు, మఠాధిపతులకూ ఇవ్వని ప్రాధాన్యం విశాఖ శారదా పీఠానికి గత వైకాపా ప్రభుత్వం కల్పించింది. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో 2+2 భద్రతను కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు విధులో ఉంటారు. ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌ ఉంటారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్‌ వాహనం కేటాయించారు. ఎస్కార్ట్‌ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖే భరించాలి. ఇక్కడ 20-25 మంది వరకు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు వ్యక్తులకు భద్రత కల్పిస్తే... వారికయ్యే జీతభత్యాల ఖర్చును ఆ వ్యక్తులే భరించాలి. కానీ ప్రభుత్వమే భద్రత కల్పించడంతో... నెలకు రూ.20-25 లక్షల వరకు ప్రజాధనం ఖర్చుచేస్తున్నట్లే. వైకాపా హయాంలో ఐదేళ్లు ఇలా రూ.12-15 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. ప్రస్తుతం భద్రత తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాగా... అలాంటిది ఏమీ లేదని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 21న చాతుర్మాస దీక్షకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర రుషికేశ్‌ వెళ్తున్నట్లు సమాచారం. ఈలోగా భద్రతపై ఏం నిర్ణయం ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

రాజశ్యామల యాగం తర్వాతే

కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ శారదాపీఠానికి, పీఠాధిపతికి ఏళ్లతరబడి భారీ భద్రత ఇవ్వడం గమనార్హం. జగన్‌ మెచ్చిన గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్‌ వాహనాలు, వై-కేటగిరీలో చుట్టూ భద్రతాసిబ్బంది ఉండాల్సిందే. 2019 ఎన్నికలకు ముందు స్వరూపానందేంద్ర రాజశ్యామల యాగం చేశారు. అందుకే జగన్‌ సీఎం అయ్యారనే ప్రచారం బాగా సాగింది. అందుకే జగన్‌ అధికారంలోకి రాగానే శారదా పీఠాధిపతి దేవాదాయశాఖలో చక్రం తిప్పారనే విమర్శలొచ్చాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా నిత్యం పీఠం ముందు వరస కట్టేవారు. భీమిలిలో రూ.200 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని పీఠం కారుచౌకగా తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. జగన్‌ మరోసారి సీఎం కావాలని ఇటీవల ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేసినా ప్రయోజనం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని