YS Jagan: జగన్‌ ‘స్మార్ట్‌’ గుట్టు వీడింది!

ఈ ధరలు చూసి విద్యుత్‌ ఉపకరణాల ధరలు ఇంతగా పెరిగాయా అని విస్తుపోకండి. ఇవి కేవలం గత ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం అమలుకు నిర్దేశించినవి . ‘జగన్‌ అండ్‌ కో’ కోసం మాత్రమే ప్రత్యేకం.

Updated : 09 Jul 2024 06:52 IST

అనుబంధ పరికరాల ధరలు అడ్డగోలు 
గుత్తేదారుకు దోచిపెట్టిన ‘జగన్‌ అండ్‌ కో’  
‘షిర్డీసాయి’ కోసం.. టెండరు నిబంధనల్లో మార్పు 
‘ఈనాడు’ పరిశోధనలో వాస్తవాలు వెలుగులోకి 
ఈనాడు - అమరావతి

ధరలు చూసి విద్యుత్‌ ఉపకరణాల ధరలు ఇంతగా పెరిగాయా అని విస్తుపోకండి. ఇవి కేవలం గత ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం అమలుకు నిర్దేశించినవి . ‘జగన్‌ అండ్‌ కో’ కోసం మాత్రమే ప్రత్యేకం. ఇవే ప్రమాణాలున్న విద్యుత్‌ ఉపకరణాల ధరలను ‘ఈనాడు’ మార్కెట్‌లో వెళ్లి వాకబు చేస్తే.. వాటి ధరలు వరుసగా రూ.950, రూ.150, రూ.198, రూ.750 మాత్రమే! ఈ పొంతన లేని ధరలు చూస్తే అస్మదీయ కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు జగన్‌ ప్రభుత్వం ఎంతగా దోచిపెట్టిందో అవగతమవుతుంది. 

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పేరుతో దోపిడీ 

18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు మాటున జరిగిన దోపిడీ చూస్తే విస్తుపోవాల్సిందే. జగన్‌ ప్రభుత్వం.. రూ.6,888.03 కోట్లతో చేపట్టిన స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టు ద్వారా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో 11 లక్షలు, సీపీడీసీఎల్‌లో 5 లక్షలు, ఈపీడీసీఎల్‌లో 2.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు పోను రూ.5,265.40 కోట్లు భరించాలని గత వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది.టెండర్ల ప్రక్రియను జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచి గోప్యంగా ఉంచింది. మార్కెట్‌ ధరల కంటే కొన్ని రెట్లు అధికంగా ధరలను నిర్దేశించి గుత్తేదారుకు చెల్లించేలా గత ప్రభుత్వం చేసిన ‘ధరల నాటకం’ మొత్తం బహిర్గతమైంది.ఇందుకోసం టెండరు నిబంధనలను మార్చేసి రూ.వందల కోట్లను ఆఫీస్‌ నోట్‌ ద్వారా ‘స్మార్ట్‌’గా చెల్లించేంతగా అక్రమాలకు పాల్పడింది. 

  • ఒక వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ప్రభుత్వం సగటున చెల్లించే మొత్తం రూ.12,170.67. అవే ప్రమాణాలు, కొలతలు ఉన్న విడిభాగాలు రూ.4,523.45కే మార్కెట్‌లో దొరుకుతాయి. ఈ లెక్కన ఒక్కొక్క స్మార్ట్‌ మీటర్‌కు వినియోగించే విడిభాగాలపై అదనంగా రూ.7,647.22 చొప్పున గత ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు సిద్ధపడింది. ఈ ప్రకారం ప్రతిపాదించిన 18,58,587 కనెక్షన్లకు రూ. 1,421.30 కోట్లు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పనంగా దోచిపెట్టేలా గత ప్రభుత్వం వ్యవహరించింది.  
  • అనుబంధ పరికరాల కోసం ఒప్పందం ప్రకారం గుత్తేదారు సంస్థకు రూ.2,492.90 కోట్లు చెల్లించేలా ప్రతిపాదనలను గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో గుత్తేదారు సంస్థకు దోచిపెట్టే సొమ్ము పోను.. రైతుల కనెక్షన్ల కోసం వెచ్చించే మొత్తం రూ.1,071.6 కోట్లు మాత్రమే. ఇంధన శాఖ లెక్కల ప్రకారం గుత్తేదారు సంస్థ ఇప్పటికే 50 వేల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసింది.

మీటర్లు లేకుండా పరికరాలేంటి?

స్మార్ట్‌ మీటర్లు లేవు. అయినా వాటిని అమర్చేందుకు విడిభాగాలను మాత్రం డిస్కంలు కొనేశాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనుబంధ పరికరాల సరఫరా టెండరు దక్కించుకున్న గుత్తేదారులు వాటిని లారీల్లో తెచ్చి పడేశారు. డిస్కంలు వెంటనే బిల్లులు చెల్లించేశాయి. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. టెండరు ఒప్పందం ప్రకారం విడిభాగాలను సరఫరా చేసిన వెంటనే 50 శాతాన్ని, వాటిని అమర్చిన తర్వాత 30 శాతాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంది. దీంతో విడిభాగాలను దిల్లీ మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హడావుడిగా గోదాముల్లో పడేశారు. వాటికి సంబంధించిన బిల్లుల్లో 80 శాతాన్ని డిస్కంలు గుత్తేదారుకు చెల్లించాయి. మూడు డిస్కంల పరిధిలో అనుబంధ పరికరాల కోసం చెల్లించాల్సిన రూ.2,492.90 కోట్లలో.. 80 శాతం అంటే రూ.1,994.32 కోట్లు డిస్కంలు ఇప్పటికే చెల్లించాయి. అంటే మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే ఈ పరికరాలకు అయ్యే ఖర్చు రూ.1,071.60 కోట్లు మాత్రమే.. దీని కంటే అదనంగా రూ.922.72 కోట్లు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా వారికి ఇబ్బంది లేదన్నట్లుగా గత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో గుత్తేదారులకు లబ్ధి చేకూర్చింది. 

బిల్లుల కోసం.. మూడు డిస్కంల బాధ్యతలు ఒకే సీఎండీకి!

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ సంస్థలను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ శాసించింది. తనకు కావాల్సిన వ్యక్తిని సీఎండీగా నియమించుకుని బిల్లులు తీసుకున్నట్లు తెలిసింది. అనుబంధ పరికరాల బిల్లులను గుట్టుగా సొమ్మ చేసుకోవడం కోసం అప్పట్లో ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న సంతోషరావు ద్వారా అక్కడ బిల్లుల చెల్లింపు పూర్తి చేసింది. అదే సమయంలో ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు పదవీ విరమణ చేయడంతో  ఇన్‌ఛార్జిగా సంతోషరావుకే బాధ్యతలు అప్పగించేలా గుత్తేదారు సంస్థ చక్రం తిప్పింది. ఈ డిస్కం పరిధిలో భారీ మొత్తంలో కనెక్షన్లు ఉండటంతో తమ బిల్లులు గుట్టుగా చెల్లించడం కోసం సంతోషరావును ఎస్‌పీడీసీఎల్‌కు బదిలీ చేయించింది. ఆ తర్వాత సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో.. ఈ డిస్కంకు కూడా ఇన్‌ఛార్జి బాధ్యతలను సంతోషరావుకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఇక్కడా బిల్లుల విషయంలో అదే తంతు. ఇలా మూడు డిస్కంల పరిధిలో అనుబంధ పరికరాల బిల్లులు ఆఘమేఘాల మీద చెల్లించేలా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కోసం సంతోషరావు పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట సీపీడీసీఎల్‌ ఇన్‌ఛార్జిగా తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని