Andhra News: 100 రోజులు.. రూ. 100 కోట్లు

గత వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది.

Updated : 10 Jul 2024 09:12 IST

పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
సందర్శకులకు వినోదం అందించడమే లక్ష్యంగా అడుగులు
ఈనాడు - అమరావతి

నీటిలో తేలియాడే ఇలాంటి రెస్టారెంట్‌లను ఏర్పాటు చేస్తారు

గత వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు వినోదాన్ని అందించే ప్రాజెక్టులను వంద రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే విశాఖపట్నం, అరకు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, దిండి, సూర్యలంక, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లో.. రానున్న మూడు నెలల్లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నదులు, సువిశాలమైన తీర ప్రాంతంలో వినోద సంబంధిత సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రతిపాదిత ప్రాజెక్టులివే...

  • రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణా నదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్‌ అందుబాటులోకి రానుంది.  500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీనిని రూపొందించనున్నారు. ఇదే తరహా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదించారు. 
  • విశాఖపట్నం, సూర్యలంక, కాకినాడ బీచ్‌లలో క్లాంపింగ్, గ్లాంపింగ్‌ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. బీచ్‌ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్‌ ఏర్పాటు చేస్తారు.
  • విశాఖలోని తొట్లకొండ, అరకు, హార్సిలీహిల్స్‌లో కారవాన్‌ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రాత్రివేళల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కారవాన్లలో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. 
  • విజయవాడలో బెర్మ్‌ పార్కు, విశాఖ-రుషికొండలో అడ్వెంచర్‌ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్‌ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, సూర్యలంక, విశాఖలో వాటర్‌ స్పోర్ట్స్‌లో భాగంలో 5 జెస్కీలు ఏర్పాటు చేయనున్నారు.
  • విజయవాడలో బెర్మ్‌ పార్కు నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుంచి పోలవరం-భద్రాచలం మధ్య డబుల్‌ డెక్కర్‌ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోనసీమ బ్యాక్‌ వాటర్‌లో సింగిల్‌ బెడ్‌ రూం లగ్జరీ హౌస్‌ బోటు, విజయవాడలో మరో వీఐపీ బోటు ఏర్పాటు చేయనున్నారు.
  • విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా తీరం మీదుగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రూయిజ్‌నౌకను ప్రవేశపెట్టనున్నారు. 
  • అరకులో ట్రెక్కింగ్, రాక్‌ క్లైంబింగ్, పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, మోటార్‌ బైక్‌ టూరింగ్‌ వంటివి ఏర్పాటు చేయనున్నారు. 
  • చంద్రగిరి కోట వద్ద సౌండ్, లైట్‌ షో, విజయవాడలో బెర్మ్‌ పార్కు నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీం, వాటర్‌ పార్కు ఏర్పాటు చేయాలని  భావిస్తున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని