Special status: నెరవేరని ప్రత్యేక హోదా హామీ

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated : 24 Nov 2022 15:08 IST

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో గళమెత్తిన సీఎం జగన్‌

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని, మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని చెప్పడమంటే.. అప్పుడిచ్చిన హామీని ఉల్లంఘించడమే. తాగునీటికి సంబంధించిన కాంపొనెంట్‌ నిధుల్ని కూడా విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది’ అని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా.. ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది.’ అని వివరించారు. ‘దేశ సమగ్ర పురోగతికి కేంద్రం, రాష్ట్రాలతో పాటు.. అంతర్‌రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా మీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. ఈ సందర్భంగా జగన్‌ ఏడు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హాజరైన ప్రతినిధులు

పోలవరంపై కేంద్రానిది తప్పించుకునే ధోరణి

* 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండటంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అయినా 2013-14 నాటి వ్యయ అంచనా మేరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. సాగు, తాగునీటి సరఫరా పనులను కలిపే ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులివ్వాలి.

* రాష్ట్ర విభజన నాటి (2014 జూన్‌ 2) నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా కాగ్‌ నివేదిక (2014-15) పేర్కొంది. కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండడైజ్డ్‌ ఎక్స్‌పెండిచర్‌) అన్న విధానాన్ని తెచ్చిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడుస్తామని చెప్పింది. దీంతో మిగిలిన లోటు అలాగే ఉండిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. ఈ విషయంలో పునరాలోచించి సమస్య పరిష్కరించాలి.

* 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.6,112 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బకాయి పెట్టింది. అప్పుడు ఆ రాష్ట్రానికి విద్యుత్తు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన కేంద్రమే ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి.

* బుందేల్‌ఖండ్‌ తరహాలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పూర్తిగా అమలు చేయలేదు. షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. వాటి పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతోంది. 

* ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినా.. పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నీటిని సరఫరా చేస్తోంది. దీనికి వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు ఆ రాష్ట్రం నుంచి రావాల్సిన రూ.338.48 కోట్లను వీలైనంత త్వరగా ఇప్పించాలి.

* కుప్పం ప్రజలకు తాగునీరందించే పాలార్‌ ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిల్వ చేసేది 0.6 టీఎంసీలే. ఇదే సమయంలో  తమిళనాడు అవసరాల కోసం ఏడాదికి దాదాపు 10 టీఎంసీల నీరిస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలార్‌  నిర్మాణానికి తమిళనాడు సహకరించేలా చూడాలి.

* గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగా నిర్ణయించిన రూ.42,472 కోట్ల నికర రుణ పరిమితిలో రూ.19,923.24 కోట్లు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు మా బాధ్యత లేదని మొరపెట్టుకున్నా వినలేదు. పైగా ఈ కోతను ఏకంగా మరో మూడేళ్లకు పొడిగించింది. అవేమీ గ్రాంట్లు కాదు. వివిధ అవసరాల కోసం సేకరిస్తున్న ఈ రుణాలను ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణపరిమితిలో కోత విధించడం సరికాదు.

* ఆంధ్రప్రదేశ్‌ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో.. ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి కేంద్రం ద్వారా రేషన్‌ సరకులు ఇస్తున్నారు.  రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్‌ అందుతోంది. ఇది ఏ మాత్రం సరికాదు. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాలవారీగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలను తొలగించాలి’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని