TIRUMALA: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల నేడు

భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరుకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేస్తోంది.

Updated : 18 Jun 2024 06:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరుకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేస్తోంది. ఆర్జిత సేవాటికెట్లను ఈ నెల 18న మంగళవారం ఉదయం పదింటికి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇదే సేవలకు ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం ఈ నెల 20న ఉదయం పదింటి వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌ పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్దేశిత రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాలి.  

ఈ నెల 21న ఉదయం పదింటికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవాటికెట్లను ఇదే రోజు మధ్యాహ్నం మూడింటికి అందుబాటులో ఉంచుతారు.

  • ఈనెల 22న ఉదయం పదింటికి అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన టోకెన్ల కోటా విడుదలవుతుంది.
  • సెప్టెంబరు నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం పదింటికి విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడింటికి తిరుమల, తిరుపతిలలో అద్దె గదుల బుకింగ్‌ కోటా విడుదల చేస్తారు. 
  • ఈనెల 27న ఉదయం 11 గంటలకు సెప్టెంబరుకు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవాటికెట్లను బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తుల రద్దీ నాలుగో రోజు సోమవారమూ కొనసాగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని బాటగంగమ్మ అలయం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి మూడు గంటల్లో దర్శనం లభిస్తోంది. ఆదివారం శ్రీవారిని 69,870 మంది దర్శించుకోగా రూ.4 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని