Sucharita: అది రాజీనామా కాదు.. ధన్యవాద లేఖ

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అసంతృప్తుల పంచాయితీల్లో భాగంగా  బుధవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుచరిత, కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు.

Updated : 14 Apr 2022 05:40 IST

సీఎంతో భేటీ తర్వాత మాజీ మంత్రి సుచరిత వెల్లడి

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ఈనాడు, అమరావతి: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అసంతృప్తుల పంచాయితీల్లో భాగంగా  బుధవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుచరిత, కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ ఇన్నాళ్లూ మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యవాద లేఖ రాశాను.. అది రాజీనామా లేఖ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతవరకూ జగన్‌తోనే ఉంటామని ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి ఇంకో అడుగు ముందుకేసి ఊపిరి ఉన్నంతవరకు జగన్‌ బాటలోనే నడుస్తానని చెప్పుకొచ్చారు. సీఎంతో భేటీ అనంతరం వారిద్దరూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు.


రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వైకాపా కార్యకర్తనే
- మేకతోటి సుచరిత

ఇన్నాళ్లూ అవకాశం కల్పించారని ధన్యవాదం తెలుపుతూ రాసిన లేఖ అది. మా అమ్మాయిది చిన్న వయసు. తనకు అవగాహన లేక మీడియా ముందు ఎలా చెప్పాలో తెలియక రాజీనామా అంటే దాన్నే హైలైట్‌ చేశారు. మీడియా చేసినదాన్ని నేను తప్పు పట్టడం లేదు. నేను రాజకీయాల్లో ఉంటే జగన్‌ వెంటే, వైకాపాలోనే ఉంటా. వేరేవైపు చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల నుంచి విరమించుకున్నా వైకాపా కార్యకర్తగానే ఉంటా. ముఖ్యమంత్రి జగన్‌ నన్ను చెల్లి అని సంబోధిస్తారు. ఆయన అదే ప్రేమనూ ఇప్పుడూ చూపుతున్నారు. ముఖ్యమంత్రిని మా కుటుంబసభ్యులం వచ్చి కలిసే స్వేచ్ఛ మాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్లి సీఎంను కలిశా. నాకు ఆపరేషన్‌ జరిగి రెండు వారాలు కూడా కాలేదు. అయినా ఓపిక చేసుకుని వచ్చి ముఖ్యమంత్రిని కలిశాను. ఎందుకంటే నేను రాజీనామా చేశానని, స్పీకర్‌కు లేఖ పంపానని, సీఎం నాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, నాపైన చర్యలు తీసుకోనున్నారని వస్తున్న ప్రచారాలకు తెరదించేందుకే. నావల్ల జగన్‌కు ఏ చిన్న ఇబ్బందీ రాకూడదనేదే నా ఉద్దేశం. మంత్రివర్గంలో రెండున్నరేళ్ల తర్వాత మార్పులుంటాయనీ సీఎం ముందే చెప్పారు. అయితే మనిషిని కదా మంత్రివర్గంలో చోటు కోల్పోయినప్పుడు చిన్న భావోద్వేగానికి గురయ్యా. సాధారణ దళిత మహిళనైన నేను ఎన్ని జన్మలెత్తితే, ఎన్ని సొమ్ములు ఖర్చు చేస్తే హోం మంత్రిని కాగలను. అలాంటిది నన్ను హోం మంత్రి స్థాయికి సీఎం తీసుకువచ్చారు. మా కార్యకర్తలం, మేమంతా వైకాపా గెలుపు కోసమే కృషి చేస్తాం.


ఎమ్మెల్యే పదవి వదిలి జగన్‌ వెంట నడిచా
- కాపు రామచంద్రారెడ్డి

జగన్‌ కోసం గతంలో ఎమ్మెలే పదవికి రాజీనామా చేసి వచ్చా. అదే ప్రేమతో అప్పటి నుంచీ ఆయన వెంటే నడుస్తున్నా. ఊపిరి ఉన్నంతవరకు జగన్‌ వెంటే నడుస్తా. అనంతపురం జిల్లాలో వైకాపా సీనియర్‌ నేతగా.. మంత్రి పదవి వస్తుందని నమ్మకంతో ఉన్నా. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఉషశ్రీ చరణ్‌కు ఇచ్చారు. ఆమెతో నాకు విభేదాలేమీ లేవు, అన్నా చెల్లెళ్లలా ఉంటాం. నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో సీఎం చెప్పారు. సీనియర్లు అర్థం చేసుకోవాలని, పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో నాకు మంచి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.


నాకు మంత్రి పదవి వద్దని సీఎంతో చెప్పా: ఆళ్ల

మంగళగిరి, న్యూస్‌టుడే: తనకు మంత్రి పదవి అవసరం లేదని, దానికన్నా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి చెప్పినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహకారంతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని