Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై స్వతంత్ర కమిటీ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం అంశంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో....

Updated : 11 Jan 2022 05:58 IST

విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ

కేంద్ర, పంజాబ్‌ ప్రభుత్వ దర్యాప్తులపై స్టే

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఆదేశాలు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం అంశంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర, పంజాబ్‌ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు.. తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ‘లాయర్స్‌ వాయిస్‌’ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము నియమించే కమిటీలో చండీగఢ్‌ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐజీ, పంజాబ్‌, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, పంజాబ్‌ అదనపు డీజీపీ (భద్రత) కూడా సభ్యులుగా ఉంటారన్న సంకేతాలను ధర్మాసనమిచ్చింది. విచారణ సందర్భంగా తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఏడుగురు అధికారులకు కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ డి.ఎస్‌.పట్వాలియా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్ర, పంజాబ్‌ ప్రభుత్వాలు ఏర్పరచిన కమిటీల దర్యాప్తును నిలిపివేయాలంటూ గత(జనవరి 7) విచారణలో  న్యాయస్థానం మౌఖిక ఆదేశాలిచ్చినా.. నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎప్పుడు నోటీసులిచ్చారని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం జరిగిందా లేదా అన్న అంశంపై కమిటీ వేసి.. అది నివేదిక ఇవ్వకముందే ప్రధాన కార్యదర్శి, డీజీపీలను దోషులుగా నిర్ధారిస్తూ నోటీసులెలా ఇస్తారని నిలదీసింది. అయితే ధర్మాసనం ఆదేశాల్వికముందే తాము నోటీసులిచ్చామని మెహతా వివరణ ఇచ్చారు.

తర్వాత ఆయన తన వాదనలు వినిపిస్తూ.. ప్రధానమంత్రి భద్రత విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించిందని పేర్కొన్నారు. మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి అంతరాయాలు లేవంటూ చెప్పారని, చివరకు రోడ్డు దిగ్బంధించిన ఆందోళనకారులకు 100 మీటర్ల సమీపంలో ప్రధాని వాహనశ్రేణి నిలిచిపోవాల్సి వచ్చిందని, ఇది ఆ రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కమిటీ దర్యాప్తును కొనసాగనివ్వాలని మెహతా అభ్యర్థించారు. దీనిపై పట్వాలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వ అధికారులది తప్పు అయితే వారిని ఉరితీయండి గానీ.. నిష్పక్షపాత విచారణ మాత్రం జరిగేలా చూడాలని విన్నవించారు.

మోదీ భద్రతా కేసు వాదించొద్దంటూ ‘సుప్రీం’ న్యాయవాదులకు బెదిరింపు కాల్స్‌

 

ప్రధాని పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై జరుగుతున్న కేసు వాదనను నిలిపివేయాలంటూ సోమవారం తమకు ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ... సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జీ) నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు పలువురు సుప్రీం కోర్టు న్యాయవాదులు తెలిపారు. ఇవన్నీ రికార్డెడ్‌ కాల్స్‌ అని, బ్రిటన్‌ నుంచి వచ్చాయని పేర్కొన్నారు.

 

ఇందులో ఫిరోజ్‌పుర్‌లో ప్రధాని పర్యటనను తామే అడ్డుకున్నామని ఎస్‌ఎఫ్‌జీ ప్రకటించుకుంది. పంజాబ్‌ రైతులు, సిక్కులకు వ్యతిరేకంగా నమోదయ్యే కేసులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను హెచ్చరించింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఒక్కరికి కూడా ఇప్పటివరకు శిక్షపడలేదని గుర్తు చేసింది. ఈ ఫోన్‌కాల్స్‌పై సత్వరం చర్య తీసుకోవాలని న్యాయవాదులు.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.


విఫలంపై సుప్రీంకోర్టులోమరో పిటిషన్‌ దాఖలు

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ సోమవారం దాఖలైంది. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అనిరుద్ధ్‌ తివారీ, డీజీపీ చటోపాధ్యాయ, ఫిరోజ్‌పుర్‌ ఎస్‌ఎస్‌పీ హర్మన్‌దీప్‌ సింగ్‌ హన్స్‌ పాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) లేదా ఇంకేదైనా ప్రముఖ సంస్థతో విచారణ చేయించాలని పిటిషన్‌లో న్యాయవాది బరుణ్‌ కుమార్‌ సిన్హా కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని