Andhra News: 10 నెలలు... ‘5,831 మరణాలు’

రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అధికమవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Updated : 26 Nov 2022 08:42 IST

ప్రాణాలను తీస్తున్న రోడ్డు ప్రమాదాలు
గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్య
అధ్వాన రహదారులు, అతి వేగమే కారణాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అధికమవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అధ్వానంగా ఉన్న రహదారులు, అతివేగం ప్రమాదాలకు మూలమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు పది నెలల్లో రాష్ట్రంలో 14,314 ప్రమాదాలు జరగ్గా... 5,831 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,585 మంది క్షతగాత్రులయ్యారు. అదే 2021లో జనవరి నుంచి అక్టోబరు వరకు 13,019 ప్రమాదాలు జరిగితే... వాటిలో 5,472 మంది మరణించగా... 14,027 మంది క్షతగాత్రులుగా మిగిలారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాలు 9.95%, మరణాలు 6.56%, క్షతగాత్రుల సంఖ్య 11.11% పెరిగాయి.

అధ్వాన రోడ్లతో ప్రమాదాలు

రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అడుగుకో గుంత ఉంటోంది. ఆయా మార్గాల్లో కొత్తగా ప్రయాణించే వారికి ఎక్కడ గుంత ఉందో తెలియకపోవడంతో.. వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులు అధిక సంఖ్యలోనే ఉంటున్నారు. పోలీసులు ఏ విధంగా ప్రమాదం జరిగిందనేది మాత్రమే నమోదు చేస్తారని, గుంతల రోడ్లే కారణం అనేది ఎక్కడా రికార్డు కాదని ఓ అధికారి పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లలో అత్యధికంగా.. అతి వేగమే కారణమని పోలీస్‌శాఖ చెబుతోంది.

రూ.125 కోట్ల నిధితో ఏం చేశారు?

సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో రహదారి భద్రత మండలి ఏర్పాటైనప్పటికీ.. ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యను తగ్గించడంలో ఇది సఫలీకృతం కావడం లేదు. ఈ కమిటీలో పోలీస్‌, రవాణా, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌, వైద్యఆరోగ్యశాఖల భాగస్వామ్యం ఉంటుంది. కేవలం రహదారి భద్రత అంశాలపై మాత్రమే పనిచేసేందుకు ఆయా శాఖల నుంచి అధికారులను ప్రత్యేకంగా కేటాయించాలని, వారికి ఇతర బాధ్యతలు లేకుండా చూస్తేనే.. వాళ్లు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తారని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. రాష్ట్రంలో ఆ దిశగా ప్రత్యేకంగా అధికారులను కేటాయించలేదు. ఆయా శాఖలకు చెందిన అధికారులకు ఇతర బాధ్యతలతోపాటు రహదారి భద్రతను అదనంగా చేర్చారు. జిల్లా కమిటీల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత నిధి కింద రూ.125 కోట్లు కేటాయించింది. ఈ నిధులనూ ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

అత్యధికంగా గుంటూరులో మృతులు

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పది నెలల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 370 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. ఆ తర్వాత వైయస్‌ఆర్‌ కడపలో 346 మంది, విశాఖపట్నంలో 341 మంది, కర్నూలులో 338, అనంతపురంలో 328 మంది చనిపోయారు.

విశాఖపట్నంలో జిల్లాలో అత్యధికంగా 1,110 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తర్వాత గుంటూరులో 940, తూర్పుగోదావరిలో 861, కృష్ణాలో 860, వైయస్‌ఆర్‌ కడపలో 806 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

క్షతగాత్రులుగా మారిన వారు ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో 1,075 మంది ఉన్నారు. తర్వాత తూర్పుగోదావరిలో 979, ప్రకాశంలో 912, వైయస్‌ఆర్‌ కడపలో 903, కృష్ణాలో 891 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

గత పది నెలల్లో ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య వందలోపు ఉన్న జిల్లాలు రెండే ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 28 మంది, అనకాపల్లి జిల్లాలో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో 202 మంది, పల్నాడులో 197 మంది, కాకినాడ జిల్లాలో 190 మంది మృతి చెందారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, లారీల ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు