Surya Narayana: నేను దొరికితే చంపేయాలని సజ్జల ఆదేశించారు!

తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులను ఆదేశించారని రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ ఆరోపించారు.

Updated : 24 Jun 2024 10:49 IST

రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ ఆరోపణ

ఈనాడు డిజిటల్, అమరావతి: తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులను ఆదేశించారని రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ ఆరోపించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ అరాచకాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘గతంలో ఓ దినపత్రికలో నాపై వచ్చిన చిన్న నిరాధార వార్త ఆధారంగా నాటి సీఎస్‌ జవహర్‌రెడ్డి కక్షపూరితంగా నాపై చర్యలకు సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు ఆయన అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి’ అని ప్రశ్నించారు. విచారణ పేరుతో తన భార్య మెడలోని నల్లపూసలనూ తీసివేయించారని వాపోయారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం సృష్టించిన అరాచకాల్లో నిజాలు నిగ్గుతేల్చేలా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్‌ రివ్యూ కమిషన్‌ వేయాలి. దీనిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండు చేశారు.

‘మధ్యాహ్నం తర్వాత యూ ఆర్‌ నో మోర్‌’

‘అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కలిసి ఈ వ్యవహారాలపై వివరించడానికి ఫోన్‌ ద్వారా సంప్రదించాను. ఆ విషయం అప్పటి నిఘా విభాగాధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు తెలిసింది. వెంటనే నా దగ్గరికి పోలీసులు వచ్చారు. యేసుబాబు అనే పోలీసు అధికారి.. ప్రతిపక్ష నేతల్ని కలవడం విరమించుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారు. మర్నాడు ఫోన్‌ చేసి ఉదయం 8.30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరి, కోర్టులో వేసిన కేసులన్నీ ఉపసంహరించుకోకుంటే మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ‘యూ ఆర్‌ నో మోర్‌’, ‘నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అని బెదిరించారు. ఈ వ్యవహారాలన్నీ చంద్రబాబుకు వివరించా. అది తెలిసి నా ఇంటివద్ద 200 మంది పోలీసుల్ని మోహరించారు. నా గురించి చెప్పాలని డ్రైవర్‌ని విజయవాడలోని నాలుగు స్టేషన్లకు తిప్పి, దాడి చేశారు. ఆ సమయంలో ఏసీపీ భాస్కర్‌రావుకు ఫోన్‌ చేసి.. నేను దొరికితే చంపాలని సజ్జల ఆదేశించినట్లు నా డ్రైవర్‌ చెప్పాడు’ అని ఆరోపించారు.  

ఫోన్లు ట్యాప్‌ చేసిన ఆంజనేయులు

‘నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన కారణంగా విధుల నుంచి తొలగించిన అసమర్థ ఐఏఎస్‌ అధికారి గిరిజాశంకర్‌.. ఏడాదిన్నర గడిచినా ఏ కారణంతో నన్ను సస్పెండ్‌ చేశారో ఇప్పటివరకూ మెమో ఇవ్వలేదు. ఈ కేసుతో సంబంధం లేని మా బంధువుల్ని రావి సురేశ్‌రెడ్డి అనే అధికారి ఇబ్బందులకు గురిచేశారు. అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు నా ఫోన్లను ట్యాప్‌ చేసి బెదిరించారు. నా కదలికలన్నీ ముందుగానే తెలుసుకుని నానా ఇబ్బందులకు గురిచేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని