Andhra Pradesh: అప్పులు, ఆర్థిక పరిస్థితులపై నాలుగు శ్వేతపత్రాలు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేతపత్రాలు (వైట్‌ పేపర్‌) వెలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది.

Updated : 15 Jun 2024 06:37 IST

పూర్తి లోతుల్లోకి వెళ్తున్న ప్రభుత్వం
కసరత్తు ప్రారంభించిన అధికారులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేతపత్రాలు (వైట్‌ పేపర్‌) వెలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది. గడిచిన ఐదేళ్లలో ఆర్థికశాఖలో చోటుచేసుకున్న అనేక అవకతవకల్ని, అప్పుల్ని లోతుల్లోకి వెళ్లి వెలికితీయాలని నిర్ణయించారు. ఇందుకు ఎవరెవరు కసరత్తు చేయాలో ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థికమంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్‌ ఈ విషయం వెల్లడించారు. ఆర్థికశాఖకు సంబంధించే నాలుగు శ్వేతపత్రాలు వెలువరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తేలుస్తున్నారు. దీంతోపాటు కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు? ఆ అప్పులను వేటికి వెచ్చించారు? ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏయే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధించనున్నారు. మరోవైపు ప్రభుత్వశాఖల వద్ద ఉన్న మొత్తం సొమ్మును ఒక కార్పొరేషన్‌కు బదలాయించి జగన్‌ ప్రభుత్వం వినియోగించేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నిధులను, ఇతర నిధులనూ వాడేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిధులు పెండింగు పెట్టింది. ఆ వివరాలన్నీ తేలాల్సి ఉంది. అప్పులు ఒక రూపంలో భారమైతే... జగన్‌ ప్రభుత్వం ఇప్పటికీ సరఫరాదారులకు, గుత్తేదారులకు చెల్లించని మొత్తాలు మరో పెద్ద భారం. అదీ ఒకరకమైన అప్పే. ఆ పెండింగు బిల్లులపై హైకోర్టులో ఎన్నో కేసులు దాఖలయ్యాయి. గడిచిన ఐదేళ్లుగా ఎంత మొత్తం పెండింగు బిల్లులు ఉన్నాయో ఇంతవరకు బయటపెట్టలేదు. ఆ వివరాలన్నీ సేకరించాలంటే చాలా లోతుల్లోకి వెళ్లాలి. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత బిల్లులు ఎక్కడెక్కడ పెండింగులో ఉన్నాయి, ఆ మరుసటి సంవత్సరానికి ఎంత బదిలీ అయ్యింది, మళ్లీ ఎప్పుడెప్పుడు ఎంత పెండింగు... ఇలా లెక్కలను ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి తేల్చాలి. ఈ సమాచారమంతా సేకరించి నాలుగు శ్వేతపత్రాలను వెలువరించనుంది. సంబంధిత బృందం ఆ పనుల్లోకి దిగింది. 

రాష్ట్రాన్ని గాడిన పెడతాం: పయ్యావుల కేశవ్‌

‘‘వైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పులెన్ని, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పులెన్ని అనే అంశాల్లో చాలా లోతుల్లోకి వెళ్తాం. రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తాం. సమగ్ర దృశ్యం రాష్ట్ర ప్రజల ముందు పెట్టి అక్కడ నుంచి ముందుకు వెళ్తాం. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ దిశగానే వెళ్తాం. ఎక్కువ శ్రమ    పడాల్సి ఉంది. అందుకు సిద్ధపడ్డాం. రాష్ట్ర అప్పు ఎంతనేది తెలియజేస్తాం. ఒకరిద్దరు అధికారులకే ఈ వివరాలు తెలుసు. శాసనసభకూ తెలియజేయలేదు. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా నాడు నేను లేవనెత్తిన అంశాలపైనా శోధిస్తాం. చూపించని లెక్కలు చాలా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకువస్తాం. ఎక్కడా దాపరికం ఉండదు. పన్నులు పెంచకుండా, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం నడపడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు చంద్రబాబు బ్రాండ్, ఆయన అనుభవం ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాం. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచి ఆదాయాలు పెంచుతాం’’ అని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని