TDP: వైకాపా జేబు సంస్థలా రాష్ట్ర మహిళా కమిషన్‌

రాష్ట్రంలో మహిళా కమిషన్‌ వైకాపా జేబు సంస్థలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై ఏం చర్యలు

Updated : 11 Aug 2022 14:42 IST

మూడేళ్లలో మహిళలపై 800పైగా అఘాయిత్యాలు జరిగితే ఎంతమందికి నోటీసులిచ్చారు?
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజం
పెద్ద ఎత్తున కార్యకర్తలతో కమిషన్‌ కార్యాలయం ముట్టడి

ఈనాడు డిజిటల్‌- అమరావతి, విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళా కమిషన్‌ వైకాపా జేబు సంస్థలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అతివలపై 800పైగా అత్యాచారాలు జరిగితే మహిళా కమిషన్‌ ఎంత మందికి నోటీసులిచ్చిందని ప్రశ్నించారు. మంగళగిరిలోని కమిషన్‌ కార్యాలయాన్ని బుధవారం తెలుగు మహిళలతో కలిసి ఆమె ముట్టడించారు. అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం సమర్పించారు. ‘జగన్‌రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది’ పేరిట రాసిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. ఈ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేయడంతో అనిత, వాసిరెడ్డి పద్మ మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అనిత విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని మహిళా కమిషన్‌ రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తోంది. వాసిరెడ్డి పద్మ అధికార పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు తప్ప మహిళల కోసం ఆలోచించడం లేదు. బాధితురాలికి ఇక్కడ న్యాయం జరిగేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఏ మూల ఆడబిడ్డకు అన్యాయం జరిగినా తెదేపా అండగా ఉంటుంది. తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు మహిళా కమిషన్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవు. బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని కమిషన్‌ కార్యదర్శి చెబుతున్నారు. అదేదో ముందు వైకాపా మంత్రులకు ఇవ్వాలి’ అని అనిత పేర్కొన్నారు.

మహిళలతో పోలీసుల దురుసు ప్రవర్తన

అంతకముందు మహిళా కమిషన్‌ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున తెలుగు మహిళలు ముట్టడించారు. పోలీసులు లోపలికి వెళ్లనివ్వకపోవడంతో సుమారు రెండు గంటలపైగా మండుటెండలోనే ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కొందరు నేలపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎండలో ఎక్కువసేపు నిరసన తెలపడంతో బాధితురాలి తల్లి శరీరంలో చక్కర స్థాయిలు తగ్గి సొమ్మసిల్లిపోయారు. ఆమెకు తోటి మహిళలు సపర్యలు చేశారు. ప్రధాన గేటును నెట్టుకుని లోనికి వెళ్లేందుకు మహిళలు యత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసులు తమతో దురుసుగా వ్యవహరించారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు లోనికి వెళ్లడానికి అనుమతి లేకపోతే కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మే కిందకు రావాలని డిమాండ్‌ చేశారు. కొంత వాగ్వాదం అనంతరం పరిమిత సంఖ్యలో మహిళలను పోలీసులు లోపలికి అనుమతిచ్చారు.

చంద్రబాబు పరామర్శిస్తే ఉలికిపాటా: బొండా ఉమా

విజయవాడలో అత్యాచార బాధితురాలిని మాజీ సీఎం చంద్రబాబు పరామర్శిస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడ ధర్నాచౌక్‌లో తెదేపా చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిని బంధించి 30 గంటల పాటు అత్యాచారం చేస్తే.. ఆసుపత్రి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఇంత ఘోరం జరిగితే.. ఆసుపత్రి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బాధితురాలు తన నియోజకవర్గానికి చెందిన యువతి కావడంతో, న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కూతవేటు దూరంలోనే ఉన్నా బాధితురాలిని పరామర్శించడానికి మూడు రోజుల వరకు హోంమంత్రికి తీరిక లేదా? అన్నారు. పరామర్శకు తెదేపా అధినేత చంద్రబాబు వస్తున్నారని తెలియగానే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారన్నారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే హోం మంత్రి మీడియా ముందుకొచ్చారని విమర్శించారు. తనను ప్రశ్నిస్తున్నారనే కోపంతో వాసిరెడ్డి పద్మ పలువురి మహిళలను చెయ్యెత్తి కొట్టబోయారన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబానికి అండగా తెదేపా

చుట్టుగుంట, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి తెదేపా అండగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిన రూ.5 లక్షలను బుధవారం విజయవాడలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేతుల మీదుగా అందజేశారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. బొండా ఉమా రాబట్టే తమకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు వచ్చి పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఉమా మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు తమను భయపెట్టాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చూస్తున్నారన్నారు. కమిషన్‌ సభ్యులంతా కలిసి చర్చించాకే నోటీసులు జారీ చేయాలని, అవేమీ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల మేరకే తమకు నోటీసులిచ్చారని ఉమా ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని