TDP: చంద్రబాబును సీఎం చేద్దాం

 చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటానికి శపథం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమేనని.. 160 స్థానాల్లో విజయం సాధించి చంద్రబాబును సీఎం పీఠం ఎక్కించాలని సూచించారు.

Updated : 28 May 2022 07:08 IST

రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయం
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటానికి శపథం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమేనని.. 160 స్థానాల్లో విజయం సాధించి చంద్రబాబును సీఎం పీఠం ఎక్కించాలని సూచించారు. 40 ఏళ్లలో ఎన్నడూ పడని కష్టాలు, ఇబ్బందులు తెదేపా కార్యకర్తలు, నాయకులు ఈ మూడేళ్లలో పడ్డారని.. వారిపై అక్రమంగా తెరిచిన రౌడీషీట్లు, కేసుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తేస్తామని ప్రకటించారు. తెదేపా కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన వారికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తాటతీస్తామని హెచ్చరించారు. మహానాడులో శుక్రవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పేరిట బయల్దేరిన అలీబాబా 40 దొంగలను ప్రజలు ఎదిరించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తేశారని, ఈ మూడేళ్లలో ఏం సంక్షేమం అమలు చేశారని వారిని నిలదీయాలి. వైకాపాలా తెదేపా గాలికి పుట్టిన పార్టీ కాదు. తెదేపాను లేకుండా చేయడం జగన్‌ తాత, తండ్రివల్లే కాలేదు.. అలాంటిది జగన్‌వల్ల ఏమవుతుంది. చంద్రబాబు తలపెట్టిన బాదుడే-బాదుడు కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గొప్ప స్పందన లభించింది. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాబోతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న మహానాడు ఇది. 3 లక్షల మందితో శనివారం భారీ బహిరంగ సభ తలపెట్టాం. దాన్ని విజయవంతం చేయాలి. మనకు పోలీసుల సహకారం లేదు. ఎవరికి వారే వాలంటీర్లుగా మారి సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.

చీమల దండులా మహానాడుకు..
మహానాడును విఫలం చేయాలని సీఎం జగనే రంగంలోకి దిగి ఆటంకాలు కల్పించినా 40ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా చీమల దండులా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘సభకు స్టేడియం ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వలేదు. ఇప్పుడు బెదిరించే అధికారులను హెచ్చరిస్తున్నా... ఏడాదిలో తెదేపా అధికారంలోకి రాబోతోంది. అప్పుడు అందరి భరతం పడతాం. ఎవరైనా అధికారులు ఫోన్‌ చేసి ఇబ్బంది పెడితే ఆ ఫోన్‌ నంబరు, వారి పేరు రాసుకోండి. భవిష్యత్తులో ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు