Revanth Reddy: శంషాబాద్‌లో ఆరోగ్య హబ్‌

ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Updated : 23 Jun 2024 06:17 IST

అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు
విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్‌ ఛానెల్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరిస్తున్న బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ. చిత్రంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 500-1000 ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ... ‘‘ఎన్టీఆర్‌ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో 24 వసంతాలు పూర్తి చేసుకొని... లక్షల మందికి సేవలందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకమ్మకి క్యాన్సర్‌ రావడం, ఆమెను కోల్పోవడంతో ఆ దుఃఖం, బాధ ఇంకెవరికీ కలగొద్దనే ఉద్దేశంతో 1988-89లో ఈ సంస్థకు పునాది వేశారు. తర్వాత వివిధ రకాల ఆటంకాలు ఎదురైనా... 2000లో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక... నాటి ప్రధాని వాజ్‌పేయిని పిలిపించి, ఆయన చేతుల మీదుగా సంస్థను ప్రారంభింపజేశారు. నాడు ఎన్టీఆర్‌ కన్న కల... నెరవేరింది. ఆయన ఏ లోకంలో ఉన్నా మనందరినీ కచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈ సంస్థకు సంబంధించిన లీజు, భవనాల అనుమతుల విషయమై ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే క్యాబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేమంతా వేర్వేరుగా ఉన్నా... ఈ హోదా, గౌరవం ఎన్టీఆర్‌ ఇచ్చిన అవకాశాలతోనే సాధ్యమయ్యాయి. ఆయన సూచించిన మార్గంలో పేదలకు సేవ చేయాలనే ఆలోచనను అందిపుచ్చుకున్న మేం ఇలాంటి సంస్థకు భవిష్యత్తులోనూ అండగా నిలబడతాం’’ అని భరోసా ఇచ్చారు. 

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, వేదికపై బసవతారకం ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు,
సీఈవో కూరపాటి కృష్టయ్య, ట్రస్ట్‌ సభ్యులు జేఆర్‌ఎస్‌ ప్రసాద్, నోరి దత్తాత్రేయుడు,
ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ట్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌

18 గంటలు పని చేస్తాం...

‘‘మనకు ప్రజల్లో గుర్తింపు రావాలంటే... నైపుణ్యమున్న ఆటగాడితోనే పోటీ పడాలని పెద్దలు చెబుతుంటారు. పక్కరాష్ట్రంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... అభివృద్ధి, సంక్షేమంలో ఆయనతో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుందని అనుకున్నా. కానీ, ఇప్పుడాయన 18 గంటలు పనిచేస్తే... నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. మనం కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని మా అధికారులు, సహచరులతో చెప్పా. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడి రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్‌తో పోటీపడే వారు లేరు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు ఆయనే పునాది వేశారు. బసవతారకం ఆసుపత్రి, రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేద వాడికి కూడు, గూడు ఉండాలనే గొప్ప ఆశయాలతో ఆయన ఉన్నతంగా పనిచేశారు. వాటినే వారసత్వంగా ఇచ్చారు. వారసత్వంగా రాజకీయాలే కాదు... సంక్షేమం, సేవలను కూడా స్వీకరించాలి. మొదటితరంలో ఎన్టీఆర్‌... రెండోతరంలో చంద్రబాబు, బాలకృష్ణలు ఉన్నారు. మూడోతరంలోని లోకేష్, భరత్‌లు ఈ సేవలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. బాలకృష్ణ కోరినట్లు ఆసుపత్రి 25వ వార్షికోత్సమే కాదు... 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తా’’ అని రేవంత్‌ స్పష్టంచేశారు.

త్వరలో అమరావతిలోనూ బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభిస్తాం  

అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న భూమి లీజును పొడిగించిన సీఎం రేవంత్‌రెడ్డికి బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ‘‘ఆసుపత్రి ఛైర్మన్‌గా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. ఆసుపత్రిపై నమ్మకంతో ప్రభుత్వాలు కూడా మాకు సాయం అందిస్తున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం కృషి చేస్తాం. త్వరలో అమరావతిలోనూ ఆసుపత్రి పనులు ప్రారంభిస్తాం’’ అని ప్రకటించారు. ఆసుపత్రి సీఈవో డాక్టర్‌ కూరపాటి కృష్ణయ్య మాట్లాడుతూ... 110 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి నేడు 600 పడకలకు చేరుకుందన్నారు. ఇక్కడ ఏడాది కాలంలో రూ.125 కోట్ల విలువైన రాయితీతో కూడిన చికిత్సలు అందించామన్నారు. అనంతరం గత ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రికి అండగా నిలిచిన దాతలు... ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ ఫౌండేషన్, దివ్యశక్తి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, అంకుర్‌ ప్రాజెక్టులు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, టయోట్సు రేర్‌ ఎర్త్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్, లియోపిలిజేషన్‌ సిస్టం ఇండియా లిమిటెడ్, కోర్‌ కార్బన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులను రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రఖ్యాత క్యాన్సర్‌ నిపుణులు నోరి దత్తాత్రేయుడు, నామా నాగేశ్వరరావు, జేఆర్‌ఎస్‌ ప్రసాద్, విశాఖ ఎంపీ శ్రీభరత్, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని