Telangana HC: వాన్‌పిక్‌ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ పిటిషన్‌ కొట్టివేత

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్‌ కేసును కొట్టివేయాలంటూ మూడో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Updated : 09 Jul 2024 06:34 IST

ఆరోపణలు విచారణలో తేలాల్సిందేనని స్పష్టీకరణ
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్‌ కేసును కొట్టివేయాలంటూ మూడో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి అనుమతించింది. ఈ తీర్పులోని అంశాలతో సంబంధం లేకుండా.. కేవలం కేసు పూర్వాపరాల ఆధారంగా డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణ చేపట్టి, నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్‌పై అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, వాటిని విచారణలోనే తేల్చుకోవాలన్నారు. నిజాయతీగా పెట్టిన పెట్టుబడులను ముడుపులుగా పరిగణించరాదన్న వాదనను విచారణలోనే పరిశీలించాల్సి ఉందన్నారు. అవగాహన ఒప్పందం జరిగిన సమయంలో పిటిషనర్‌ ఉన్నారని సీబీఐ అభియోగ పత్రంలో ఆరోపించారని.. దీనికి సంబంధించి క్విడ్‌ప్రోకోలో ఆయన పాత్ర విచారణలో తేలాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అవగాహన ఒప్పందం ప్రకారం వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేటాయింపు జరిగిందని, రాయితీ ఒప్పందం ప్రకారం తన కంపెనీకి భూకేటాయింపు జరిగిందన్నది నిమ్మగడ్డ వాదన అని, ఈ రెండు ఒప్పందాల మధ్య భాష్యం చెప్పాలంటే విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోపణలు కేవలం వాన్‌పిక్‌ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలకే పరిమితం కాలేదని, పెట్టుబడుల రూపంలో ముడుపులు చెల్లించడం.. జగన్‌కు చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడులూ ఉన్నాయని గుర్తుచేశారు. వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేటాయింపు, భూకేటాయింపులు సహజంగా జరిగాయా.. లేదా కుట్రలో భాగంగానా అన్నది విచారణలో తేలాలన్నారు. అందువల్ల క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ దురుద్దేశపూరితమైనవన్న వాదనను అంగీకరించలేమన్నారు. పూర్తి అంశాలను పరిశీలించకుండా అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనను తోసిపుచ్చారు. వాన్‌పిక్‌ ప్రాజెక్టుపై సీబీఐ నమోదు చేసిన కేసును ఇదే హైకోర్టు కొట్టివేసిందని, దాన్నీ దీన్నీ ఒకే గాటన కట్టలేమన్నారు. కంపెనీపైన కేసు కొట్టివేసినంత మాత్రాన ఛైర్మన్‌పై కేసు కొట్టివేసినట్లు కాదన్నారు. పిటిషనర్‌పై ప్రత్యేకమైన ఆరోపణలున్నాయని, ఇవన్నీ విచారణలో తేలాల్సిందేనని వివరించారు.

కేసు వివరాలివి..

నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామికవాడ (వాన్‌పిక్‌) ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా అప్పటి వైఎస్‌ ప్రభుత్వం (జీ2జీ) పద్ధతిలో రసల్‌ ఆల్‌ ఖైమా (రాక్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. వైఎస్‌ అండ.. మంత్రులు, అధికారుల సాయంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 12,973 ఎకరాలను కేవలం రూ. 165.39 కోట్లకే వాన్‌పిక్‌కు కేటాయించారు. దానికి ప్రతిఫలంగా వైఎస్‌ కుమారుడు జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ. 854 కోట్ల పెట్టుబడులను ముడుపులుగా చెల్లించినట్లు సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని