AP News: నాన్న తాగితేనే ‘అమ్మఒడి’ వచ్చిందని చెబుతారా?

‘‘నాన్న తాగడం ద్వారానే అమ్మఒడి డబ్బులు వచ్చాయని చెబుతారా? మద్యం తాగితేనే అమ్మఒడి ఇస్తారా? ఎక్కువ సంక్షేమం ఉన్నందున ఎక్కువ తాగాలంటారా?’’ అని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీ

Updated : 25 Nov 2021 09:23 IST

 శాసనమండలిలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

ఈనాడు, అమరావతి: ‘‘నాన్న తాగడం ద్వారానే అమ్మఒడి డబ్బులు వచ్చాయని చెబుతారా? మద్యం తాగితేనే అమ్మఒడి ఇస్తారా? ఎక్కువ సంక్షేమం ఉన్నందున ఎక్కువ తాగాలంటారా?’’ అని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నల వర్షం కురిపించారు. శాసనమండలిలో బుధవారం ‘రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌’ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘మద్యం ఆదాయంతో అమ్మఒడి ఇస్తామంటే బడులకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది? తాగిన దాంట్లో నుంచే అమ్మఒడి డబ్బులు వచ్చాయంటే ఎలా ఉంటుంది? సంక్షేమ పథకాలతోపాటు వైద్య బిల్లుల చెల్లింపునూ దీని ఆదాయంతోనే చేపట్టండి. తాగితాగి లివర్‌ చెడిపోతుందని, అందుకే వైద్య బిల్లులను ఇందులోనే పెట్టాలని చెప్పండి. ధరలను పెంచడం ద్వారా దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్నారు. రెండున్నరేళ్లల్లో తాగే వారి సంఖ్య తగ్గిందా? వారి ఖర్చు తగ్గిందా? మద్యం అక్రమ రవాణా గతంలో కంటే పెరిగిందా? రాష్ట్రంలోని మద్యంలో నాణ్యత లేనందున పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారా? ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందో..లేదో తెలియదు. ఎప్పటికైనా ప్రభుత్వం కచ్చితంగా ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటుంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మద్యం ధరలు పెంచడంతో మద్యం అలవాటున్న పేదవాడు కూలికి వెళ్తే వచ్చే రూ.500ల్లో ఏకంగా రూ.400 తాగేందుకే ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరలు పెంచినా తాగేవారి సంఖ్య తగ్గలేదు. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వస్తోంది. కరోనా సమయంలో మద్యం ధరలు పెంచారు’’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయంటే నాటుసారా కాయడం పెరిగింది. పక్క రాష్ట్రాలకు వెళ్లి తాగుతున్నారు. తాగడం తగ్గలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై ఆదాయం రూ.7వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.15వేల కోట్లు వస్తోంది. చిత్రవిచిత్రంగా ఉన్న మద్యం బ్రాండ్ల్స పేర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. సీఎం జగన్‌ చర్యలు పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో తెంగాణ, కర్ణాటకకు పిల్లలు వెళ్లిపోయారు’’ అని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ వెల్లడించారు.


తప్పని పరిస్థితుల్లోనే మద్యం ఆదాయంతో సంక్షేమం: బుగ్గన

ప్పని పరిస్థితుల్లోనే మద్యం ఆదాయాన్ని సామాజిక బాధ్యత కింద అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా పథకాలకు కేటాయిస్తున్నట్లు మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్‌ తెలిపారు. మండలిలో రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ ‘‘మద్యం ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పెరిగింది. ఆ రెవెన్యూను సంక్షేమానికి వినియోగించేందుకు బిల్లు తెచ్చాం. పన్నుల రూపంలో వచ్చే రెవెన్యూనే సంక్షేమానికి కేటాయిస్తాం. అదనపు ఆదాయం ఉంటుందని ఇది చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని