AP-TG CMs Meeting: విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Updated : 07 Jul 2024 06:51 IST

ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, మంత్రులతో రెండు కమిటీల ఏర్పాటు 
తొలుత వాటి పరిధిలో చర్చలు
పరిష్కారం కానివి సీఎంల వద్దకు
నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం  
డ్రగ్స్, సైబర్‌ నేరాల కట్టడికి ఉమ్మడి కృషి
సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు భేటీలో నిర్ణయం 
రెండు గంటలపాటు చర్చలు 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్‌ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ, రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారమవని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు.

సుహృద్భావ వాతావరణంలో..

ఇరు రాష్ట్రాల సీఎంల రాకతో ప్రజాభవన్‌ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా.. చంద్రబాబునాయుడు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం దాదాపు రెండు గంటలపాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. త్వరలోనే సీఎస్‌లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటుంది. అక్కడ పరిష్కారమవని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ రెండంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. అలాగే మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాలపై ఉమ్మడిగా యుద్ధం చేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు, రవాణా శాఖల మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖల మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శాంతికుమారి, నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఇరు రాష్ట్రాల అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు, కృష్ణభాస్కర్, కార్తికేయ మిశ్ర, జానకి, ఇంటెలిజెన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు సాదర స్వాగతం 

నిర్ణయించిన సమయానికి ముందే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఆయన సాయంత్రం 5.47 గంటలకు రాగా, తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చారు. ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చేరుకున్నారు. ఆయనకు రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సైతం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందించారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్‌... ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబు సైతం రేవంత్, భట్టి విక్రమార్కలను శాలువాలతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమలను అందజేశారు.


అంశాలవారీగా చొరవ తీసుకున్న సీఎంలు 

పెండింగ్‌ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... అధికారుల సూచనలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు అంశాలవారీగా చొరవ తీసుకుని, న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇరురాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధికారులు తొలుత... విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశం, విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి, ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. సీఎస్‌లు, మంత్రుల కమిటీల పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో సీఎస్‌ల ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.


ఆ ఐదు విలీన పంచాయతీలు మాకే ఇవ్వాలి

నీటిపారుదల అంశాలపై చర్చ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ... ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. 


భవనాలు కావాలి: ఏపీ 
స్థలమే ఇస్తాం: తెలంగాణ 

ర్చ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని, ఏపీ ప్రభుత్వం తరఫున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని, అందులో దిల్లీలోని ఏపీభవన్‌ తరహాలో భవనాలు నిర్మించుకోవాలని రేవంత్‌ సూచించారు.


ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు

మ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం సమస్యలు పెండింగులో ఉండడం వల్ల తెలంగాణకు ఇబ్బందులున్నాయి. ఏపీకి కూడా ఇది సమస్యగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించింది. దానికి వెంటనే అంగీకారం తెలిపాను. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిదేదీ ఉండదు. ఆ దిశగా కలిసి నడుద్దాం. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందాం. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడుదాం.

రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి


సెంటిమెంట్‌ను గౌరవించేలా నడుద్దాం

తంలో నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవి. వారి సెంటిమెంట్‌ను గౌరవించేలా నడుచుకుందాం. అప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఏపీ, తెలంగాణలకు తప్పకుండా మంచి జరుగుతుంది. 

చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి 


డ్రగ్స్‌ సమస్య రెండు రాష్ట్రాలనూ వేధిస్తోంది. మరో పంజాబ్‌లా మారకముందే దాన్ని కట్టడి చేద్దాం. మాదకద్రవ్యాల రహితంగా మార్చితే దేశంలోనే రెండు రాష్ట్రాలను ఆదర్శంగా నిలపవచ్చు.

రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి 


డ్రగ్స్, సైబర్‌ నేరాల కట్టడికి ఇరు రాష్ట్రాలు కృషి చేయాలి. ఇప్పటికే మేం ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ప్రత్యేకాధికారిని నియమించి ఉక్కుపాదం మోపుతున్నాం.

చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని