Amaravati: రాజధానిపై కక్షతో రింగ్‌రోడ్డును తొక్కేశారు!

ప్రభుత్వమేదైనా అభివృద్ధిని కాంక్షించాలి.. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే.. తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి.

Updated : 24 Jun 2024 06:46 IST

అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేదీ అదే పరిస్థితి
ఈ రెండింటికీ అన్యాయం చేసిన జగన్‌
ఓఆర్‌ఆర్‌ బదులు తూర్పు బైపాస్‌ చాలని ప్రతిపాదన
అదికూడా ముందడుగు పడలేదు
అనంత-అమరావతి రోడ్డును కాదని పులివెందుల మీదుగా ఎక్స్‌ప్రెస్‌వే
ఈనాడు - అమరావతి 

ప్రభుత్వమేదైనా అభివృద్ధిని కాంక్షించాలి.. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే.. తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్‌ వంటి అహంకారి, నిరంకుశ వైఖరితో ఉండే వ్యక్తి సీఎం అయితే రాష్ట్రంలో అభివృద్ధిని ఎలా నాశనం చేస్తారు.. అంతకు ముందు మంజూరైన కీలక ప్రాజెక్టులను ఎలా తుంగలో తొక్కేస్తారు అనేది గత ఐదేళ్లలో నిరూపించి చూపించారు. 2014-19 మధ్య చంద్రబాబు రాజధాని అమరావతి చుట్టూ రూ.18 వేల కోట్ల అంచనా వ్యయంతో 185 కి.మీ. అవుటర్‌ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను, అనంతపురం నుంచి అమరావతికి 393 కి.మీ.ల ఎక్స్‌ప్రెస్‌వేని రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ద్వారా మంజూరు చేయించారు. అవి పట్టాలెక్కాల్సిన సమయంలో జగన్‌ సీఎం అయ్యారు. వెంటనే రాజధాని అమరావతిపై ఉన్న కక్షతో ఓఆర్‌ఆర్‌కు ఉరివేశారు. దానికి బదులు కేవలం 40 కి.మీ.ల విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు చాలని ప్రతిపాదించారు. అదైనా నిర్మాణమైందా అంటే అదీ లేదు. ఇప్పటివరకు మంజూరే కాలేదు. జాతీయ రహదారి నంబరు కూడా కేటాయించిన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను తెరమరుగు చేసి, దానిబదులు తన సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లేలా కోడూరు నుంచి మేదరమెట్ల వరకు ఎక్స్‌ప్రెస్‌వేని మంజూరు చేయించుకొని పక్షపాతం చూపారు. ఇటువంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్‌ఆర్‌కు, అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తక్షణం ఊపిరి పోయాలి. వెంటనే ఇవి మొదలైతే రెండు, మూడేళ్లలో వీటిని పూర్తిచేసే అవకాశం ఉంది.

రాజధానికి తలమానికం..

ఏ నగరమైనా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవుటర్‌ రింగ్‌రోడ్డు ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌ ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా పెద్ద నగరాలు, మెట్రోసిటీల్లో చాలావరకు ఓఆర్‌ఆర్‌లు నిర్మించుకుంటే, మిగిలినవి వాటిని నిర్మించే పనిలో ఉన్నాయి. కానీ గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను తెరమరుగయ్యేలా చేసింది.

ఓఆర్‌ఆర్‌ స్వరూపమిది..

రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ 185 కి.మీ.లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా నిర్మించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ సంస్థ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫీసును కూడా అప్పట్లోనే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటుచేసి, దీనికి ఓ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను కూడా నియమించింది.

 • ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమగ్ర ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు.
 • 185 కి.మీ. ఓఆర్‌ఆర్‌లో..ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కృష్ణా 102 కి.మీ., గుంటూరు జిల్లా పరిధిలో 83 కి.మీ. ఉంటుంది.
 • ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి మొత్తం 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ఓఆర్‌ఆర్‌ వెళ్తుంది.
 • ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది.
 • దీనిని ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగాను, రెండువైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదించారు. 3 చోట్ల టన్నెల్స్‌ కూడా నిర్మించనున్నారు.
 • ఈ రహదారికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలనుకున్నారు.
 • ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,900 హెక్టార్లు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3,325 హెక్టార్లు కలిపి మొత్తం 5,225 హెక్టార్లు అవసరమవుతుంది.

చంద్రబాబు దృష్టిపెడితే ఓఆర్‌ఆర్‌ పరుగులు

రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలతో సిద్ధమైన సీఎం చంద్రబాబు.. తక్షణం ఓఆర్‌ఆర్‌పై దృష్టిసారించాలి. కేంద్రంతో మాట్లాడాలి. గతంలో మంజూరుచేసిన ఈ రహదారికి సమగ్ర పథక నివేదిక రూపొందించేలా చూడాలి. దీనికి అవసరమైన భూమిని తక్షణం సేకరించేలా కార్యాచరణ ఆరంభించాలి. 

పులివెందుల మీదుగా మళ్లించి..

అనంత-అమరావతిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. దాని స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి  పులివెందుల నియోజకవర్గం మీదుగా బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు 344 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే మంజూరు చేయించింది. దీనికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు.

వాస్తవానికి బెంగళూరు నుంచి ఎన్‌హెచ్‌-44లో 111 కి.మీ. ప్రయాణించి కోడూరు వరకు రావాలి. అక్కడ నుంచి కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్‌లో 344 కి.మీ. ప్రయాణించి ముప్పవరం చేరుకోవాలి. మళ్లీ ముప్పవరం నుంచి ఎన్‌హెచ్‌-16లో 110 కి.మీ. ప్రయాణించి విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం 565 కి.మీ.లలో 344 కి.మీ. మాత్రమే కొత్తగా నిర్మించే రహదారి. కానీ దీనికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అంటూ వైకాపా ప్రభుత్వం హడావిడి చేసింది. ఈ రహదారిలో 14 ప్యాకేజీలకుగాను 13 ప్యాకేజీలకు టెండర్లు పూర్తిచేసి గుత్తేదారులకు పనులు అప్పగించారు.

తక్షణం అనంత-అమరావతి హైవేకు జీవంపోయాలి

చంద్రబాబు ఇప్పుడు అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకి తక్షణం జీవం పోయాలి. దీనికి గతంలోనే కేంద్రం ఎన్‌హెచ్‌గా గుర్తించి, సంఖ్యను కూడా కేటాయించడంతో వేగంగా డీపీఆర్‌ల రూపకల్పన, తర్వాత టెండర్లు పిలిచి, పనులు చేపట్టేందుకు జాప్యం ఉండదు. అవసరమైన భూముల కోసం పెగ్‌ మార్కింగ్‌ కూడా చేసినందున భూసేకరణ కూడా చకచకా సాగేందుకు వీలుంటుంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తిచేయాలి. వెంటనే పనులు ఆరంభించేలా చేయగలిగితే..మూడేళ్లలో పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.


జగన్‌ నిర్వీర్యం చేశారిలా..

వైకాపా 2019లో అధికారంలోకి రావడంతోనే జగన్‌ అమరావతి ఓఆర్‌ఆర్‌ను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీనిని కేంద్రం ఎన్‌హెచ్‌గా గుర్తించిందని, భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఓఆర్‌ఆర్‌తో అవసరమే లేదనేలా జగన్‌ వ్యవహరించారు. 185 కి.మీ. ఆరు వరుసల ఓఆర్‌ఆర్‌ స్థానంలో.. కేవలం 40 కి.మీ. మేర నాలుగు వరుసలతో విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మిస్తే చాలంటూ పదేపదే విజ్ఞప్తులు చేశారు. చివరకు కేంద్రం చిన్నఅవుటపల్లి నుంచి కాజా వరకు 40 కి.మీ. తూర్పు బైపాస్‌కు మొగ్గుచూపింది. అయితే ఇది ఇంకా డీపీఆర్‌ దశ కూడా దాటలేదు.


ఆ ప్రాంతాలకు కీలకం.. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే..

బెంగళూరుకు చెందినవారు, రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వారంతా తక్కువ సమయంలో రాజధాని అమరావతికి చేరుకునేలా నాడు చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం-అమరావతి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రతిపాదించింది.

 • దీనికి కేంద్రం ఆమోదించి ఎన్‌హెచ్‌గా గుర్తించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎన్‌హెచ్‌-44లోని రాప్తాడు మండలం మరూరు వద్ద మొదలై నేరుగా అమరావతికి చేరుకునేలా 393.61 కి.మీ.ల ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది.
 • ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేకు అదనంగా ఉమ్మడి కడప, ప్రకాశం జిల్లాల మీదుగా 88.08 కి.మీ., కర్నూలు నుంచి 75.65 కి.మీ. నాలుగు వరుసల కనెక్టింగ్‌ రహదారులు వచ్చి ఈ ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలో కలిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవన్నీ కలిపితే మొత్తం అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిడివి 557.34 కి.మీ.
 • దీనికి ఎన్‌హెచ్‌-544ఎఫ్‌ గా సంఖ్య కూడా కేటాయించింది.
 • ఇందులో తొలుత అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సమాయత్తమయ్యారు. దీనికి 5,462.45 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించారు. వీటికి పెగ్‌ మార్కింగ్‌ కూడా నిర్వహించారు.
 • 19 ప్యాకేజీలకుగాను, 12 ప్యాకేజీల డీపీఆర్‌లు సైతం సిద్ధమయ్యాయి. ఇంతలో వైకాపా ప్రభుత్వం రావడంతో అదంతా ఆగిపోయింది.
 • తొలుత జగన్‌ ప్రభుత్వం ఈ ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతి వరకు కాకుండా చిలకలూరిపేట బైపాస్‌లో కలిపేందుకు ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా ఎన్‌హెచ్‌ అధికారులు డీపీఆర్‌లో మార్పులు చేసినా, తర్వాత జగన్‌ దీనిని విస్మరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని