AP news: నిన్న కేసులతో వేదన.. నేడు పదవుల అధిరోహణ

నిన్న వైకాపా ప్రభుత్వ వేధింపులే నేడు కొంతమంది తెదేపా నాయకులకు మంత్రి పదవులు దక్కడానికి సోపానాలయ్యాయి.

Published : 13 Jun 2024 04:07 IST

సభా ప్రాంగణం వద్ద కిక్కిరిసిన కార్యకర్తలు, అభిమానులు

ఈనాడు-అమరావతి: నిన్న వైకాపా ప్రభుత్వ వేధింపులే నేడు కొంతమంది తెదేపా నాయకులకు మంత్రి పదవులు దక్కడానికి సోపానాలయ్యాయి. వైకాపా అరాచకాలు, దుర్మార్గాలు, దమనకాండలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పలువురు నాయకులను జగన్‌ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసింది. ఒక్కొక్కరి పైనా పదుల అక్రమ కేసులు బనాయించింది.. జైల్లోనూ పెట్టింది. అయినా సరే తట్టుకుని నిలబడి, కష్టకాలంలోనూ వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు.  

శస్త్రచికిత్స చేయించుకున్నా అచ్చెన్నను వదల్లేదు 

అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట జగన్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నారనే కక్షతో అచ్చెన్నాయుడుపై ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో కుంభకోణం పేరిట అక్రమ కేసు బనాయించారు. రాత్రివేళ  ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటికి ఒకరోజు ముందే మొలలకు శస్త్ర చికిత్స చేయించుకున్నా వదల్లేదు. రక్తస్రావం అవుతున్నా అత్యంత అమానవీయంగా ఆయన్ను రోడ్డు మార్గంలో కొన్ని గంటలపాటు వాహనంలో తిప్పి శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించారు.  ఇలా అచ్చెన్నపై 21 కేసులు పెట్టారు. అయినా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. 

గొట్టిపాటి ఆర్థిక మూలాలపై దెబ్బ 

తెదేపాను వీడి వైకాపాలో చేరమంటే ఒప్పుకోనందుకు గొట్టిపాటి రవికుమార్‌ ఆర్థిక మూలాలపై జగన్‌ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ వేసింది. వివిధ శాఖల అధికారులతో ఆయన గ్రానైట్‌ క్వారీలపై దండయాత్ర చేయించింది. క్వారీలన్నింటినీ మూయించేసింది. ఆయన సంస్థలపై మొత్తం 60కు పైగా కేసులు పెట్టింది. దాదాపు రూ. 280 కోట్లకు పైగా జరిమానాలు విధించింది.  అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరాటం చేశారు. పార్టీ తరఫున గట్టిగా నిలబడ్డారు. 

నారాయణపై ముప్పేట దాడి.. 

తెదేపాకు వివిధ రూపాల్లో అండగా ఉంటున్నారనే కారణంతో పొంగూరు నారాయణపై జగన్‌ ప్రభుత్వం కేసులతో ముప్పేట దాడి చేసింది. చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనతో ఆయనకు సంబంధాన్ని ఆపాదించి.. అరెస్టు చేసింది. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు తదితర అంశాల్లో సీఐడీతో కేసులు పెట్టించి.. విచారణ పేరిట వేధించింది. నారాయణ అవన్నీ తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు. 

వైకాపా బాధితుడు కొల్లు రవీంద్ర 

వైకాపా ఫ్యాక్షన్‌ పాలనకు కొల్లు రవీంద్ర ప్రధాన బాధితుడు. ఆయనపై 25 కేసులు బనాయించారు. సంబంధం లేని హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి..అరెస్టు చేశారు. రెండు నెలల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ముందస్తు నిర్బంధం పేరిట ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారు.  ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సహా అనేక కేసులు పెట్టారు. అయినా రవీంద్ర పార్టీనే నమ్ముకుని పనిచేశారు. 

ఎదురొడ్డి నిలిచిన బీసీ జనార్దనరెడ్డి 

బీసీ జనార్దన్‌రెడ్డి నంద్యాల జిల్లాలో వైకాపా అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు. దీంతో ఆయనపై ఎడాపెడా కేసులు పెట్టారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు బనాయించి నెల రోజులకు పైగా జైల్లో ఉంచారు. బనగానపల్లె నియోజకవర్గంలో తెదేపా కార్యకలాపాలు చేసుకోనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వాటన్నింటినీ తట్టుకుని జనార్దన్‌రెడ్డి పార్టీ కోసం నిలబడ్డారు. 

వైకాపాను అసెంబ్లీలో ఎదుర్కొన్న నిమ్మల 

  • నిమ్మల రామానాయుడు తెదేపా శాసనసభా పక్ష ఉపనేతగా దీటుగా పనిచేశారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎన్ని విధాలుగా కవ్వించినా తట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో కలిసిపోయి పనిచేశారు. అవన్నీ ఆయనకు కలిసొచ్చాయి. 
  • వంగలపూడి అనిత తెలుగు మహిళా అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరించి.. వైకాపా తీరును ఎండగట్టారు. ఆమెపై ఆ పార్టీ మూకలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేశాయి. చివరికి దళితురాలైన ఆమె పైనే ఎట్రాసిటీ కేసు పెట్టారు. 
  • డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో చాలా దీటుగా వ్యవహరించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. వీరందరికీ మంత్రి పదవులు వరించేందుకు ఈ అంశాలు దోహదపడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు