TTD: శ్రీవారి ఎస్‌ఈడీ దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ), రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని తితిదే స్పష్టం చేసింది.

Updated : 23 Jun 2024 06:54 IST

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: తితిదే

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ), రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని తితిదే స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ధరలను సవరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. అధిక ధరలకు ఎస్‌ఈడీ టికెట్లు పొందవచ్చని కొందరు కొన్ని వాట్సప్‌ గ్రూపుల్లో చేస్తున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాస్తవానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తితిదే వెబ్‌సైట్‌ ద్వారా ఇస్తుంది. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకూ కొంత కోటాను కేటాయిస్తుంది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందొచ్చు. రాష్ట్ర పర్యాటక వెబ్‌సైట్‌ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందొచ్చు. ఇది కాకుండా కొందరు దళారులు టూరిజం వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసి ఇస్తామని చెప్పి అమాయకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తితిదే శనివారం వెల్లడించింది. వీటిని నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని