Andhra News: విలాసాల వలలో నుంచి.. వ్యభిచార కూపంలోకి

వివిధ కారణాలతో ఇంటి నుంచి బయటకు వచ్చి అదృశ్యమైన బాలికలు, మహిళల జీవితం ఎక్కడో మొదలై మరెక్కడో విషాదంగా ముగుస్తోంది. కుటుంబ సమస్యలు, స్వేచ్ఛ, సంపాదన అంటూ ఇంట్లో చెప్పకుండా, భవిష్యత్తును ఆలోచించకుండా ఎంతో మంది బయటకు వస్తున్నారు.

Updated : 24 Jun 2024 09:56 IST

అదృశ్యమవుతున్న మహిళల్లో కొందరు ఈ ఊబిలో చిక్కుతున్న దయనీయం
వివిధ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్న వైనం
బాధితులకు వాసవ్య మహిళా మండలి కౌన్సెలింగ్‌

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వివిధ కారణాలతో ఇంటి నుంచి బయటకు వచ్చి అదృశ్యమైన బాలికలు, మహిళల జీవితం ఎక్కడో మొదలై మరెక్కడో విషాదంగా ముగుస్తోంది. కుటుంబ సమస్యలు, స్వేచ్ఛ, సంపాదన అంటూ ఇంట్లో చెప్పకుండా, భవిష్యత్తును ఆలోచించకుండా ఎంతో మంది బయటకు వస్తున్నారు. స్పాలు, మసాజ్‌ సెంటర్లు, వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల ముసుగులో మోసపోతున్నారు. నేర స్వభావమున్నవారి మాటలు నమ్మి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖ జైలులోనే దాదాపు 90 మంది మగ్గిపోతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జైళ్లలోనూ ఎంతోమంది ఉన్నారు. మరికొందరు నేరగాళ్ల చేతుల్లో, వ్యభిచార గృహాల్లో బందీలవుతున్నారు. వివిధ కేసుల్లో విశాఖ జైలులో శిక్ష అనుభవిస్తున్న యువతకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వారి కౌన్సెలింగ్‌ సమయంలో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

డబ్బు ఆశతో..

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి 21 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఐదేళ్లకు భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటికే వారికి పాప ఉంది. కొద్దిరోజులపాటు టెలికాలింగ్‌ కంపెనీలో పనిచేసింది. ఆ తరువాత ఆమె (28)కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన నగరంలోని ఓ సంస్థ నిర్వాహకులు పరిచయమయ్యారు. అధిక జీతం, విలాసవంతమైన జీవితం ఆశ చూపడంతో అందులో భాగస్వామి అయింది. డబ్బు ఆశతో మరికొందరు యువతులను ఆ ఊబిలోకి దించింది. 

స్పా ముసుగులో వ్యభిచారం

రాజమహేంద్రవరంలోని ఓ స్పా కేంద్రంలో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులు ఈనెల 14న దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో అనధికారికంగా నిర్వహిస్తున్న స్పా, మసాజ్‌ కేంద్రాలపై మార్చిలో నగర పోలీసులు దాడులు చేశారు. ఓ స్పాలో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 17 మంది యువతులకు విముక్తి కల్పించారు. 

పవన్‌ చెప్పినా పట్టించుకోకుండా..

2019 నుంచి 2021 మధ్య మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఈ గణాంకాలను కేంద్ర హోంశాఖ గతేడాది రాజ్యసభలో వెల్లడించింది. ఇదే విషయాన్ని వారాహి యాత్రలో భాగంగా పవన్‌కల్యాణ్‌ సైతం గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినవి అవాస్తవమని, ఆధారాలేమున్నాయని అప్పటి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారు.

మోసపూరిత ప్రకటనలతో..

గతంలో ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉద్యోగాల పేరిట ప్రకటన ఇచ్చారు. నెలకు రూ.20 వేల జీతం, రూ.20 వేల ప్రోత్సాహకాలు ఇస్తామనడంతో పెద్దఎత్తున ఆశావహులు నమోదు చేసుకుని ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత చాలా వాటిల్లో మొత్తం పరిస్థితి మారిపోతోంది. ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగంలో చేరేముందు సంస్థల పూర్వాపరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 

స్వేచ్ఛ కావాలని..

అయిదో తరగతి వరకు చదువుకున్న 26 ఏళ్ల యువతి.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదంటూ చాలా పెళ్లి సంబంధాలను తిరస్కరించింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలి స్వేచ్ఛ, ఉద్యోగమంటూ విశాఖకు వచ్చింది. ‘ఇంట్లో నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నచ్చినట్లు జీవితం గడిపేందుకు ఇక్కడికి వచ్చా’ అని చెప్పడం గమనార్హం. ఆ నిర్ణయం ఆమె భవిష్యత్తును అంధకారం చేసింది. 

ప్రేమ కరవై.. విలాసాలు అలవాటై..

ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ కరవైన పిల్లలు బయటివారు కాస్త ప్రేమ చూపినట్లు నటించినా కరిగిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనవారిని గుడ్డిగా నమ్మి వారు చెప్పినట్లు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేక కొందరు విలాసాలకు అలవాటుపడుతున్నారు. దీన్ని నేరగాళ్లు ఆసరాగా చేసుకుని వారితో అసాంఘిక కార్యక్రమాలు చేయిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపెట్టి గంజాయి సరఫరా చేయిస్తున్నారు. చివరికి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎవరూరాని పరిస్థితి. 

అంగీకరించకుంటే ఎదురుదాడి

విశాఖలోని కొన్ని సంస్థల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొందరు మహిళలను కీలక స్థానంలో ఉంచి ఉద్యోగాల పేరిట యువతులను నమ్మిస్తున్నారు. అక్కడి కార్యకలాపాల గురించి చెప్పకుండా శిక్షణ ఇస్తున్నారు. వారికి ముందుగా మత్తుపదార్థాలు అలవాటు చేస్తున్నారు. తర్వాత వారు వ్యభిచారంలో పాల్గొనేలా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారు. ఎదురుచెప్పిన వారిపై దాడులు చేస్తున్నారు. లేదంటే పోలీసులకు అప్పగిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.


యువతకు అవగాహన కల్పిస్తున్నాం

ఆహార భద్రత, ఇంట్లో స్వేచ్ఛ లేకపోవడం తదితర దుర్భలత్వాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు యువతులను ప్రలోభపెడుతున్నారు. వీటిపై విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నాం. బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకుంటేనే మహిళలు, పిల్లల అక్రమ రవాణా అదుపులోకి వస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

మాధవి గణపతి, కార్యనిర్వాహక సభ్యురాలు, వాసవ్య మహిళా మండలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని