Ukraine Crisis: భారత్‌కు చేరిన మరో 1,176 మంది

యుద్ధభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 1,176 మంది శుక్రవారం మనదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగ పేరిట చేపట్టిన ఈ తరలింపు కార్యక్రమంలో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌(ఐఏఎఫ్‌)కు చెందిన మూడు విమానాలు రొమేనియా, హంగరీల నుంచి 630 మందిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని

Updated : 05 Mar 2022 05:57 IST

నేడు తరలింపు కార్యక్రమంలో పాల్గొననున్న 15 విమానాలు
ఆపరేషన్‌ గంగ’పై సమీక్షించిన ప్రధాని మోదీ

దిల్లీ, ముంబయి: యుద్ధభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 1,176 మంది శుక్రవారం మనదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగ పేరిట చేపట్టిన ఈ తరలింపు కార్యక్రమంలో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌(ఐఏఎఫ్‌)కు చెందిన మూడు విమానాలు రొమేనియా, హంగరీల నుంచి 630 మందిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ విమాన స్థావరానికి చేర్చాయి. మరోపక్క రొమేనియా రాజధాని బుకారెస్ట్‌, హంగరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి రెండు ఎయిర్‌ ఇండియా(ఏఐ) ఎక్స్‌ప్రెస్‌ విమానాలు 369 మంది భారతీయులను శుక్రవారం ముంబయికి చేర్చాయి. బుడాపెస్ట్‌ నుంచి బయలుదేరిన విమానం 184 మందితో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.20 దిగింది. బుకారెస్ట్‌ నుంచి వచ్చిన మరో విమానం 185 మందితో తెల్లవారుజామున 2.13కు ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణికులకు కేంద్రమంత్రి రావుసాహెబ్‌ దన్వే స్వాగతం పలికారు. తమ సంస్థకు చెందిన ఓ విమానం శుక్రవారం తొలిసారిగా బుడాపెస్ట్‌ నుంచి 177 మంది భారతీయులను దిల్లీకి తీసుకువచ్చిందని గో ఫస్ట్‌ విమానయాన సంస్థ వెల్లడించింది.

మాస్కోకు రెండు ఐఎల్‌-76!
ప్రభుత్వం చేపట్టిన భారతీయుల తరలింపు కార్యక్రమంలో గురువారం నుంచి ఐఏఎఫ్‌ పాల్గొంది. ఇప్పటి వరకూ ఏడు సి-17 విమానాల ద్వారా 1,428 మందిని ఐఏఎఫ్‌ సురక్షితంగా మనదేశానికి తీసుకువచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లోని సుమి, ఖర్కివ్‌ల నుంచి రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్న భారతీయులను తరలించేందుకు రెండు ఐఎల్‌-76 సైనిక రవాణా విమానాలను సిద్ధం చేసినట్లు ఐఏఎఫ్‌ అధికారులు శుక్రవారం తెలిపారు.  
* ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి 2,600 మంది భారతీయులను తరలించేందుకు శుక్రవారం-ఆదివారం మధ్య 12 విమానాలను నడపనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకూ 30 విమానాల ద్వారా 6,600 మందిని మనదేశానికి తీసుకువచ్చినట్లు సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాల్ఫ్‌గ్యాంగ్‌ ప్రాక్‌ షెహ్యర్‌ శుక్రవారం తెలిపారు.  
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కార్యక్రమం(ఆపరేషన్‌ గంగ)పై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* భారతీయుల తరలింపు కార్యక్రమంలో శనివారం ప్రైవేటు విమానాలు 11, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన 4 విమానాలు పాల్గొంటాయని విమానయాన మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.
* అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా మారిన ఖర్కివ్‌(300), సుమీ(900)ల్లో చిక్కుకుపోయిన 1000 మంది భారతీయుల తరలింపునకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి శుక్రవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని