Kumaraswamy: కుమారస్వామి మనసులో ఏముందో?.. నేడు విశాఖ ఉక్కుకు రానున్న కేంద్ర మంత్రి

‘ఆంధ్రుల హక్కు’ అని సాధించుకున్న విశాఖ ఉక్కుపై మూడేళ్ల క్రితం చీకట్లు ముసురుకున్నాయి. ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేయగా... ఉద్యోగులు ఎన్నో రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

Published : 10 Jul 2024 05:13 IST

కష్టాల సుడిలో ‘ఆంధ్రుల హక్కు’
ఊపిరి పోసే యత్నాలపై ఆశలు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మూడేళ్లకు పైగా ఉద్యోగుల ఆందోళన... జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి... నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామి బుధవారం వస్తున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో గురువారం సమీక్షించనున్నారు. మంత్రి ఏం చెబుతారు, సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. 

కష్టాల నడుమ నిర్వహణ

‘ఆంధ్రుల హక్కు’ అని సాధించుకున్న విశాఖ ఉక్కుపై మూడేళ్ల క్రితం చీకట్లు ముసురుకున్నాయి. ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేయగా... ఉద్యోగులు ఎన్నో రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. మూడేళ్లుగా 60 శాతం ఉత్పత్తే వస్తోంది. తగినంత వర్కింగ్‌ క్యాపిటల్‌ లేక రూ.15వేల కోట్ల విలువైన యంత్రసామగ్రి నిరుపయోగంగా ఉంది. 2022 నుంచి ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌-3 ఆపేయడంతో రెండున్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తి కోల్పోయింది. విశాఖ ఉక్కుకు చెందిన రాయబరేలి ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంటును రూ.2వేల కోట్లకు విక్రయించారు. విశాఖలో విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. తాజాగా చెన్నై, హైదరాబాద్‌లోని ఉక్కు యార్డులతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను   రూ.475 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదించారు. 

పట్టించుకోని జగన్‌

రాష్ట్రంలోనే అతి పెద్ద కర్మాగారాన్ని కాపాడాలన్న అంశాన్నీ విస్మరించి విశాఖ ఉక్కు ఊపిరి తీసేలా గతంలో జగన్‌ సర్కార్‌ వ్యవహరించింది. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి రూ.23,200 కోట్ల రుణాలు పొందిన జగన్‌... అందులో రూ.2వేల కోట్లయినా ఆర్థికసాయం చేయలేదు. విజయనగరం జిల్లాలో స్టీలు ప్లాంటుకు సంబంధించిన మాంగనీస్, ఇసుక గనుల లీజులు పొడిగించకుండా ఐదేళ్లు తాత్సారం చేశారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.90 కోట్లకు చేరగా, చెల్లించడానికి కనీసం ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరినా జగన్‌ ప్రభుత్వం ససేమిరా అంది. పైగా స్టీలుప్లాంటును నగరానికి 20 కి.మీ. దూరం తరలించి, ఆ భూముల్లో రాజధాని నిర్మించాలనుకున్న జగన్‌ ఆలోచనను ఇటీవల మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించిన విషయం విదితమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని