UP Assembly Election Results 2022: డబుల్‌ ఇంజిన్‌.. డబుల్‌ సక్సెస్‌..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్‌ ఇంజిన్‌) ప్రభుత్వం ఉండాలన్న ఆ

Updated : 11 Mar 2022 06:43 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలదళ అద్వితీయ విజయం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్‌ ఇంజిన్‌) ప్రభుత్వం ఉండాలన్న ఆ ఇద్దరు నేతల పిలుపు సత్ఫలితాలనిచ్చింది. ఎన్నికలకు ముందు ఓబీసీ నేతలు పార్టీకి దూరమైనా, రైతులు, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైనా... అభివృద్ధి, సురక్ష నినాదాలతో ప్రతికూలతలన్నిటినీ అధిగమించింది. అధికారంలోకి వస్తామని ఆశించిన సమాజ్‌వాదీల అంచనాలను తలకిందులు చేసింది. గురువారం అర్థరాత్రి చివరి సమాచారం తెలిసే సమయానికి ...మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 251 స్థానాల్లో గెలుపొందగా మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. దాని మిత్రపక్షాలు అప్నాదళ్‌(సోనెవాల్‌) 12 చోట్ల, నిషాద్‌ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు 120 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన బీఎస్పీ, కాంగ్రెస్‌ల ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలింది. ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ భారీగా నష్టపోయింది. కేవలం ఒకే ఒక స్థానంతో ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2017లో గెలుచుకున్న సీట్లలో 18ని కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్న ఏడు సీట్లలో అయిదింటిని కోల్పోయి రెండు స్థానాలకే పరిమితం కానుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 321 సీట్లను గెలుచుకున్న భాజపా కూటమి బలం ఈ దఫా కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో భాజపాకి 41.4 శాతానికి పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అప్నాదళ్‌(సోనెలాల్‌), నిషాద్‌పార్టీలతో కలిసి భాజపా ఉమ్మడిగా పోటీచేసింది. 370 స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా అనుప్రియ పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌(సోనెలాల్‌) 17 స్థానాల్లో, నిషాద్‌ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగాయి. తమకు కేటాయించిన 16 సీట్లలో నిషాద్‌ పార్టీ గుర్తుపై 10 మంది, ఆరుగురు కమలం గుర్తుతో పోటీ చేశారు.

* సమాజ్‌వాదీ పార్టీకి పోలైన ఓట్లలో 32శాతం, ఆర్‌ఎల్‌డీకి 2.93శాతం, బీఎస్పీకి 12.9శాతం, కాంగ్రెస్‌కు 2.37 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్‌, ఎంఐఎంలకు 0.5శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి.

* గోరఖ్‌పుర్‌ అర్బన్‌ స్థానంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి సుభావతి శుక్లపై లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలిచారు.

* ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య సిరాతు నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిని పల్లవి పటేల్‌ చేతిలో 7,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

* ప్రముఖ ఓబీసీ నాయకుడు, ఎన్నికలకు ముందు ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ నుంచి వైదొలగి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్‌ మౌర్య కుషీనగర్‌ జిల్లా ఫాజిల్‌నగర్‌లో 45వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

* విపక్ష ఎస్పీ కూటమిలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) 8 స్థానాలను, సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి.

* నోయిడాలో భాజపా అభ్యర్థి పంకజ్‌సింగ్‌ చరిత్ర సృష్టించారు. ఆయన లక్షా 79వేల ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

* కుషీనగర్‌ జిల్లాలోని తమ్‌కుహిరాజ్‌ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ ఓటమి పాలయ్యారు.

* యూపీలోని బుందేల్‌ఖండ్‌లో భాజపా మరోసారి అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌లోని మొత్తం 19 స్థానాల్లో భాజపా విజయం సాధించగా, ఓట్ల లెక్కింపుపై చివరి సమాచారం అందే సమయానికి ఈసారి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని