AP News: జగన్‌ కార్యాలయం వద్ద వర్రా రవీందర్‌రెడ్డి ప్రత్యక్షం

వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి శనివారం మాజీ సీఎం జగన్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు.

Updated : 23 Jun 2024 10:53 IST

క్యాంపు కార్యాలయం వద్ద వర్రా రవీందర్‌రెడ్డి (వృత్తంలో)

ఈనాడు, కడప: వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి శనివారం మాజీ సీఎం జగన్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు. వైకాపా ఘోరంగా ఓటమిపాలైన తర్వాత తొలిసారిగా పులివెందులకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వైకాపా నాయకుడు వర్రా రవీందర్‌రెడ్డి జగన్‌ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. రవీందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం నుంచి హల్‌చల్‌ చేసినా.. శనివారం ఆయన పులివెందులలో జగన్‌ వద్ద ప్రత్యక్షం కావడం గమనార్హం. వైకాపా ఎత్తుగడలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో లీకులిచ్చారు. తాజా పరిణామాలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని స్పష్టమైంది.

గడిచిన రెండు మూడేళ్లుగా రవీందర్‌రెడ్డి.. తెదేపా కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్య ప్రచారం చేపట్టారు. జగన్‌ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతాలను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెట్టారు. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై రెండేళ్ల కిందట అసభ్యకరమైన పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌లపై కూడా వ్యతిరేక ప్రచారం చేపట్టారు. రవీందర్‌రెడ్డిపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. వంగలపూడి అనిత ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా కుమార్తె సునీత ఫిర్యాదుపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయగా.. షర్మిల ఫిర్యాదుపైనా కేసులున్నప్పటికీ ఇప్పటి వరకూ అతడిని ఎవరూ అరెస్టు చేయలేదు.

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీందర్‌రెడ్డిపై ఈగ వాలకుండా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఏపీ సీఐడీ పోలీసులు రవీందర్‌రెడ్డిపై నిఘా పెట్టినట్లు సమాచారం. అతడు వైకాపా అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనేక సెటిల్‌మెంట్లు, భూదందాలు, పంచాయితీలు చేసినట్లు సమాచారం. డబ్బులు కావాలని బెదిరించడం.. లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తారనే అభియోగాలున్నాయి. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడలో జగన్‌ సతీమణి భారతి పేరు చెప్పుకొని సెటిల్‌మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసు విషయంలో ఎంపీ అవినాష్‌రెడ్డికి మద్దతుగా ఏడాది కిందట ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు రవీందర్‌రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్ని ఆగడాలకు పాల్పడిన వ్యక్తి జగన్‌ పర్యటనలో హల్‌చల్‌ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది.


వర్రా లీలలు.. ఒక్కొక్కటిగా బయటకు!

కదిరి, న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్‌ సతీమణి భారతి వద్ద పనిచేసే వర్రా రవీందర్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో చేసిన భూ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా వేముల మండలానికి చెందిన వర్రా రవీందర్‌రెడ్డి.. తనది కాని భూమిని తన పేరున మార్చుకునేందుకు కుట్ర చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో సిఫార్సులు చేయించుకొని కాజేసే ప్రయత్నం చేశారు. నల్లచెరువు మండలం అల్లుగుండు సర్వే నంబరు 183-2లో అంజినమ్మకు 0.92 ఎకరాల పొలం ఉంది. దీన్ని 2006 ఆమె ఊటూరి వెంకట రమణారెడ్డికి విక్రయించారు. ఇదే భూమిని అంజినమ్మ తల్లి గంగులమ్మ తన మనవరాలైన వెంకట సులోచనకు 2008లో కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందే అంజినమ్మ వద్ద భూమి కొన్న వెంకట రమణారెడ్డి.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమిపై తనకు హక్కు ఉందని సులోచన కోర్టును ఆశ్రయించారు. కోర్టు వెంకట రమణారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

అధికారులకు బెదిరింపులు: ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమిపై వర్రా రవీంద్రరెడ్డి కన్నేశారు. సులోచన నుంచి భూమిని తన పేరుతో అగ్రిమెంటు రాయించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తర్వాత గతేడాది ఏప్రిల్‌లో పట్టాదారు పాసుపుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ‘‘నాకు పట్టాదారు పాసు బుక్కులివ్వండి, ఏం జరిగినా చూసుకుంటా’’ అంటూ రెవెన్యూ సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫారసుతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకట రమణారెడ్డి సైతం సిద్ధారెడ్డి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. హక్కు కలిగినవారికే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తర్వాత రెవెన్యూ అధికారులు తనకు పట్టాదారు పాసుబుక్కులు ఇచ్చారని వెంకటరమణారెడ్డి తెలిపారు. దీంతో సిద్ధారెడ్డిపై కక్ష పెంచుకున్న వర్రా రవీంద్రరెడ్డి.. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై అసత్యప్రచారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని