Andhra News: బ్యాగు చినిగింది.. ‘కానుక’ చెదిరింది!

బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాకానుక కింద ఇచ్చిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. నాణ్యమైన వస్తువులను సకాలంలో అందిస్తున్నామని పదేపదే సీఎం జగన్‌ చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో అవన్నీ అవాస్తవాలుగా తేలుతున్నాయి.

Updated : 01 Oct 2022 07:49 IST

విద్యార్థులకు ఇచ్చిన రెండు నెలలకే పాడైపోయిన బ్యాగులు

నాణ్యత చూడకుండానే చిన్నారులకు పంపిణీ

పాడైనవాటి బదులు కొత్తవి ఇవ్వాలని సరఫరాదారులకు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాకానుక కింద ఇచ్చిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. నాణ్యమైన వస్తువులను సకాలంలో అందిస్తున్నామని పదేపదే సీఎం జగన్‌ చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో అవన్నీ అవాస్తవాలుగా తేలుతున్నాయి. బ్యాగులు నాణ్యంగా లేవని మొదటి నుంచీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. గుత్తేదారులు సరఫరా చేస్తున్న వస్తువులు ఎలా ఉన్నాయో పరిశీలించనేలేదు. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు సాక్సులు, బ్యాగుల నాణ్యతపై ఫిర్యాదు చేస్తే వారిపైనే కోప్పడ్డారు. చేసేదిలేక వారు పిల్లలకు కిట్లను అందించారు. వాడటం మొదలు పెట్టిన 15 రోజులకే బ్యాగులు చినిగిపోవడం, జిప్పులు ఊడిపోవడంతో జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాపీగా అధికారులు స్పందించారు. పాడైనవాటి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని, వాటి బదులు కొత్తవి ఇస్తామని తెలిపారు. అక్టోబరు 7 లోపు నమోదు పూర్తికావాలని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల్లో చాలావరకు చెడిపోయాయి. ఇవన్నీ తీసుకొని కొత్తవి సరఫరా చేయడం ఇప్పుడు జరిగే పనేనా? ఒకవేళ కొత్తవి ఇస్తే అవి మళ్లీ పిల్లల దగ్గరకు చేరడానికి ఎన్ని నెలల సమయం పడుతుంది అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు పునఃప్రారంభం రోజునే విద్యాకానుక కిట్లు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు ఇచ్చినా ఇప్పటికీ సరఫరాలో అయోమయం నెలకొంది. పాడైన, చినిగిపోయిన బ్యాగులు తీసుకొని, కొత్తవి ఇచ్చేటప్పటికి నవంబరు వచ్చేస్తుంది. మొదట్లో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఏకరూప దుస్తులు సరఫరాలోనూ జాప్యం జరిగింది. బూట్లు సైజుల్లో తేడా కారణంగా ఇప్పటికీ కొందరు విద్యార్థులు చెప్పులు వేసుకొనే బడులకు వస్తున్నారు. ఇప్పుడు బ్యాగుల పరిస్థితి ఇలా ఉంది. మరో విశేషమేమిటంటే.. 47,40,421 మంది విద్యార్థులకు విద్యాకానుక ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వారి సంఖ్య 3.50 లక్షలకు పైగా తగ్గింది. మరి ఆమేరకు కిట్లు ఏమయ్యాయో అధికారులకే తెలియాలి.


‘‘విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పుస్తకాలు సహా విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించాలి. ఏకరూప దుస్తులతోపాటు వేటిలోనూ నాణ్యత తగ్గకుండా చూడాలి’’

- ముఖ్యమంత్రి జగన్‌


‘‘జగనన్న విద్యాకానుకలో సరఫరా చేసిన బ్యాగుల్లో నాణ్యత లేకపోవడం వల్ల పాడైన వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని సరఫరాదారులకు కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. చెడిపోయిన వాటి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే కొత్తవి ఇస్తారు’’

- ప్రధానోపాధ్యాయులకు సమగ్రశిక్ష అభియాన్‌ లేఖ


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని