Andhra News: తితిదే నిధుల వినియోగంపై విజిలెన్స్‌ ఆరా

తితిదే గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల హయాంలో నిబంధనలను అతిక్రమించి నిధుల కేటాయించడం, ఇంజినీరింగ్‌ పనులు చేపట్టడంపై విజిలెన్స్‌ అధికారులు కూపీ లాగుతున్నారు.

Updated : 07 Jul 2024 06:24 IST

ఇంజినీరింగ్, శ్రీవాణి ట్రస్టు పత్రాల తనిఖీ
వైకాపా హయాంలో సొమ్ముల దుబారాపై దృష్టి

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే- బైరాగిపట్టెడ: తితిదే గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల హయాంలో నిబంధనలను అతిక్రమించి నిధుల కేటాయించడం, ఇంజినీరింగ్‌ పనులు చేపట్టడంపై విజిలెన్స్‌ అధికారులు కూపీ లాగుతున్నారు. శ్రీవాణి టికెట్ల కేటాయింపుతో పాటు ఆ ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల వినియోగంపైనా ఆరాతీస్తున్నారు. మొత్తంగా వైకాపా హయాంలో తితిదేలో సాగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పది రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే ఓ దఫా తనిఖీల్లో కొంత సమాచారం రాబట్టింది. రెండు రోజుల పాటు తిరుమలలోని పలు విభాగాల నుంచి వివరాలు సేకరించిన అధికారులు.. తిరుపతిలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రింటింగ్‌ ప్రెస్‌లోని రికార్డులను పరిశీలించారు. 

బడ్జెట్‌కు, పనులకు పొంతనేది?

సాధారణంగా తితిదేలో ఇంజినీరింగ్‌ విభాగానికి ఏటా క్యాపిటల్‌ పనుల కోసం రూ.200 కోట్ల వరకు కేటాయిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సివిల్‌ వర్క్స్‌కు బడ్జెట్‌లో కేటాయింపులకు, పిలిచిన టెండర్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. తితిదేకు సంబంధం లేని రహదారులు, ఇతరత్రా నిర్మాణాలకూ నిధులు కేటాయించి, టెండర్లు పిలిచారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు పెద్దమొత్తంలో పనులకు ఆమోదం తెలిపినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వీటి పనులు ఎవరికి కట్టబెట్టారు? తితిదే ఇంజినీరింగ్‌ విభాగంలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఏడాదికి ఎన్ని పనులు చేపట్టగలరు? తాహతుకు మించి నిధులు కేటాయించేందుకు ఆ విభాగం అధికారులు ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చింది? తదితర విషయాలను కూపీ లాగుతున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏ పని చేయాలన్నా వర్క్స్‌ కమిటీ సిఫార్సు తప్పనిసరి. కమిటీ సభ్యుల నివేదికల ఆధారంగానే ధర్మకర్తల మండలి ఆమోదం తెలుపుతుంది. దీంతో వర్క్స్‌ కమిటీ ఆయా పనులను ఏ లెక్కన ఎంపిక చేసిందో విజిలెన్స్‌ విభాగం ఆరాతీస్తోంది.

స్వామివారి దర్శనం పేరిట వ్యాపారం

శ్రీవాణి టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణకు వినియోగించాలి. పలుచోట్ల ఇతర అవసరాలకు మళ్లించినట్లు విజిలెన్స్‌ అనుమానిస్తోంది. ఆలయాలకు నిధులు కేటాయింపుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, అంచనాలు రూపొందించడంలోనే తిరకాసు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటిదాకా చేసిన ఖర్చుల వివరాలు సేకరిస్తోంది. శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు సమర్పించే పూలతో అగరుబత్తీలను తయారుచేస్తున్నారు. ఈ కంపెనీ ఎంపికలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్‌ ఆరాతీస్తోంది. తిరుమలలో వసతి గదుల మరమ్మతు టెండర్లు కొందరు గుత్తేదార్లకు మాత్రమే దక్కడంతో, వాటిని ఏ ప్రాతిపదికన కట్టాబెట్టారన్నది తేల్చాల్సి ఉంది. విద్యుత్‌ బస్సుల కొనుగోళ్ల వివరాలను సైతం విజిలెన్స్‌ విభాగం సేకరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని