YSRCP: ఆ ప్యాలెస్‌లు కనిపించలేదా?

సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే.. నగరపాలక, పురపాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తున్నారంటూ నానా గొడవ చేస్తారు.

Updated : 24 Jun 2024 10:43 IST

వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం
అనుమతులు లేకున్నా.. ఆ పార్టీ భవనాల నిర్మాణంపై అవ్యాజప్రేమ
అనేకచోట్ల నోటీసు ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు

ఈనాడు, అమరావతి: సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే.. నగరపాలక, పురపాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తున్నారంటూ నానా గొడవ చేస్తారు. కట్టడాన్ని కూలదోస్తామంటారు. ఇలా తమ విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే పట్టణ ప్రణాళిక అధికారులకు.. అనుమతులు తీసుకోకుండా రాజప్రాసాదాల మాదిరిగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాల భవనాలు ఎందుకు కనిపించలేదో అర్థం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 26 భవనాల్లో ఒక్కటి తప్పితే మిగతా 25 చోట్ల అనుమతులే లేవు. వీటిలో ఏడుచోట్ల ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తవగా, మరో రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అడ్డగోలుగా చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనులను అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వైకాపా నేతలతో అంటకాగుతూ తమ బాధ్యతలను విస్మరించారా? కీలకమైన నగరపాలక సంస్థల్లో పోస్టింగ్‌లు ఇచ్చినందుకు విధేయత ప్రదర్శించారా అనేది తేలాల్సి ఉంది. ఆయా నిర్మాణాలను అడ్డుకోని కారణంగా నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయిల ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్నిచోట్ల నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కర్నూలు, కడప ఇలా అనేకచోట్ల గత ఐదేళ్లూ వైకాపా నేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ.. అక్రమ నిర్మాణాలను గాలికి వదిలేశారు. 

వైకాపా నిర్మిస్తున్న భవనాల్లో కొన్నింటి పరిస్థితి ఇదీ..

  • కర్నూలులో అనుమతులు తీసుకోకుండానే ఏడాది కాలంగా వైకాపా కార్యాలయ భవన నిర్మాణ పనులు చేస్తున్నా.. పట్టణ ప్రణాళిక అధికారులు కన్నెత్తి చూడలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదంటే ఆ పార్టీ నేతలతో వీరు ఎంతగా అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక భవన నిర్మాణ పనులకు ఫీజుల కింద నగరపాలక సంస్థకు వైకాపా నేతలతో రూ.14.25 లక్షలు కట్టించారు. 
  • విశాఖలోని ఎండాడలో రెండెకరాల స్థలంలో రెండంతస్తుల వైకాపా కార్యాలయ భవన నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా.. పట్టణ ప్రణాళిక అధికారులు ఏడాదిగా ప్రేక్షకపాత్ర వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే నోటీసులిచ్చారు. భవన నిర్మాణానికి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) నుంచి అనుమతి తీసుకోవలసి ఉంది. వైకాపా నేతలు తెలివిగా సంబంధం లేని విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ)కి దరఖాస్తు చేశారు. అది కూడా ఒక ఫ్లోర్‌ పనులు పూర్తయ్యాక, ఈ నెల 20న దరఖాస్తు చేయడం విశేషం. 

  • అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేటలో 1.75 ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైకాపా కార్యాలయం భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ఇంత జరిగినా.. పట్టణ ప్రణాళిక అధికారులు స్పందించనే లేదు. ఈ భవనంలో ఇంటీరియర్‌ పనులే మిగిలాయి. ప్రభుత్వం మారడంతో మేల్కొని శనివారం హడావుడిగా భవనానికి నోటీసులు అంటించారు.
  • మచిలీపట్నంలో అనుమతులు తీసుకోకపోయినా భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి. మచిలీపట్నం నగరపాలక సంస్థ, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు ఈ విషయంలో అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. అనుమతి తీసుకోకుండా రోడ్డు పక్కన జనసేన జెండా దిమ్మలు పెడితే, తొలగించిన అధికారులు వైకాపా భవన నిర్మాణ పనులను మాత్రం పట్టించుకోలేదు. 
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన బోట్‌యార్డు స్థలంలో నిర్మిస్తున్న భవనం విషయంలోనూ ఎన్నికల ఫలితాలొచ్చే వరకు ఉదాసీనంగానే వ్యవహరించారు. ఆ తరువాతే జోరు పెంచారు. 

వైకాపా కడప జిల్లా కార్యాలయ నిర్మాణంపై నోటీసులు 

కడప నగరపాలక, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైకాపా జిల్లా కార్యాలయానికి నగరపాలక ప్రణాళిక విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ భవనానికి సంబంధించి ప్రణాళిక విభాగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. దాదాపు 15 నెలల నుంచి పనులు జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’లో ఆదివారం అక్రమనిర్మాణంపై కథనం రావడంతో కడప నగరపాలక ప్రణాళిక విభాగం అధికారులు స్పందించారు. అనుమతి లేని నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో ఏడురోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


పశ్చిమగోదావరి జిల్లాలో వైకాపా కార్యాలయ పనుల నిలిపివేత 

సెంట్రింగ్‌ సామగ్రి తరలింపు

ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయం నుంచి సెంట్రింగ్‌ సామగ్రి తరలిస్తున్న కూలీలు

ఉండి, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం పరిధిలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం పనులను నిలిపేశారు. ఇక్కడ దిగువ భాగంలో (గ్రౌండ్‌ ఫ్లోర్‌) ఇప్పటికే శ్లాబ్‌ పూర్తికాగా పై అంతస్తు నిర్మాణానికి గత 15 రోజుల నుంచి సెంట్రింగ్‌ చట్రాల బిగింపు పనులు శరవేగంగా జరిగాయి. తాడేపల్లిలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో ఇక్కడి గుత్తేదారు పనులు నిలిపేసి సెంట్రింగ్‌ సామగ్రిని ఆదివారం తొలగించి వాహనాల్లో తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని