Vizag: దసపల్లా భూములపై వ్యూహాత్మక ఎత్తుగడ

విశాఖ నగరం నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువైన దసపల్లా భూములను స్వాధీనం చేసుకొనేందుకు స్థిరాస్తి వ్యాపారులు పక్కాగా ప్రణాళిక వేశారు.

Updated : 01 Oct 2022 10:21 IST

గత ఏడాది ఆగస్టులోనే డెవలప్‌మెంట్‌ ఒప్పందం

ముఖ్యనేత ఆదేశాలతో వేగంగా కదిలిన దస్త్రాలు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగరం నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువైన దసపల్లా భూములను స్వాధీనం చేసుకొనేందుకు స్థిరాస్తి వ్యాపారులు పక్కాగా ప్రణాళిక వేశారు. దీనికి అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు తోడవడంతో అంతా చకచకా సాగిపోయింది. మూడు దశాబ్దాలుగా భూముల కోసం పోరు సాగించిన ప్రభుత్వ యంత్రాంగం చివరికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు దాసోహమంది. దసపల్లా భూములు ప్రభుత్వానికి చెందుతాయని, వీటి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్‌ చేసిన వైకాపా నేతలు, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. అస్మదీయులకు భూములు కట్టబెట్టేందుకు 2009 నుంచి 2014 మధ్య వెలువడిన కోర్టు తీర్పులను సాకుగా చూపి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో సీసీఎల్‌ఏ సెప్టెంబరు 29న జారీ చేసిన మెమో ప్రకారం దసపల్లా భూములపై తదుపరి చర్యలు తీసుకొనే అధికారం జిల్లా కలెక్టర్‌కు కట్టబెట్టారు.

*  గత ఎనిమిది ఏళ్ల నుంచి ఏదో ఒక విధంగా దసపల్లా భూములను స్వాధీనం చేసుకొనేందుకు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని వారు ఒత్తిళ్లు తెచ్చినా గతంలో పనిచేసిన కలెక్టర్లు ఎవరూ తలవంచలేదు. వీరికి అప్పటి ప్రభుత్వాలు దన్నుగా  నిలవడంతో విలువైన భూములు ప్రైవేటు పరం కాలేదు.

ఏడాదిన్నర నుంచి కన్ను
* ఇప్పుడు అధికార వైకాపాకు చెందిన కీలక నేత ఏడాదిన్నర కాలం నుంచి దసపల్లా భూములపై కన్నేశారు. ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తూ అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మెమో సదరు నేత ప్రయత్నాలకు బలం చేకూర్చినట్లయింది. ఈ తరుణంలో దసపల్లా భూముల వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ తీసుకొనే నిర్ణయం కీలకంగా మారింది.

ఆ ఇద్దరికి కట్టబెట్టేందుకు...
నిషేధిత భూముల జాబితాలో ఉండగానే నగరానికి చెందిన విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఉమేష్‌, దుస్తుల వ్యాపారి గోపినాథ్‌రెడ్డిలకు చెందినదిగా చెబుతున్న ‘ఎస్యూర్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ’ అనే సంస్థ, దసపల్లా భూములు కొనుగోలు చేసిన వారితో అభివృద్ధి ఒప్పందం(డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌) చేసుకుంది. ఈ మేరకు విశాఖ సూపర్‌బజార్‌ ఆవరణలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2021 ఆగస్టులో తొలిసారి ఒప్పంద రిజిస్ట్రేషన్‌ చేయించారు. తదుపరి అదే ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మరికొందరితో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

* డెవలప్‌మెంట్‌ ఒప్పందం పూర్తయ్యాక దసపల్లా భూములకు సంబంధించిన దస్త్రాల కదలిక జిల్లా స్థాయిలో ప్రారంభమైంది. ఈ భూముల వ్యవహారంపై ఎటువంటి ధోరణిని అనుసరించాలో తెలపాలని కోరుతూ 2021 ఆగస్టు నెలలో కలెక్టర్‌ మల్లికార్జున ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయా దస్త్రాలు వేగంగా కదులుతూ ఈ నెల 29న మెమో జారీ అయింది.


నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం

* సర్వే సంఖ్యలు 1027, 1028, 1196, 1197ల్లో మొత్తం 60ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 40 ఎకరాలవరకు వీఎంఆర్‌డీఏ (టౌన్‌ప్లానింగ్‌ ట్రస్టు, వుడా)గా ఉన్న సమయంలో 1980 ప్రాంతంలో భూములు సేకరించి దసపల్లా లేఅవుట్‌గా అభివృద్ధి చేసి విక్రయించింది. కొంత భూమిని నౌకాదళం సేకరించి నౌకాదళాధిపతి నివాసగృహాన్ని నిర్మించారు.

* మిగిలిన 20 ఎకరాల్లో 5 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ఇవి పోను మిగిలిన 15 ఎకరాలను రాణీ కమలాదేవి నగరంలో ఉన్న 60 నుంచి 70 మంది ప్రముఖులకు విక్రయించారు. వారంతా వైకాపా ముఖ్య నేత అస్మదీయులకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో భూమి అభివృద్ధి ఒప్పందం చేసుకొన్నారు. 22ఏ జాబితాలో ఉన్న ఆ భూముల ‘డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌’ నిబంధనలకు విరుద్ధమే అయినప్పటికీ ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ఆగస్టులో రిజిస్ట్రేషన్‌ చేసి పెండింగ్‌లో ఉంచారు. నాడు 595/2021పి, 783/21పి, 985/21పి సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో 22ఎ నుంచి దసపల్లా భూములకు మినహాయిస్తే ఆయా రిజిస్ట్రేషన్లు చెల్లుబాటవుతాయి. తద్వారా రూ.2వేల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని