Chandra babu naidu: మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం

‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Published : 13 Jun 2024 03:39 IST

సహాయకులుగా ఎంబీఏ చేసిన వారిని నియమిస్తాం
శాఖలవారీ శ్వేతపత్రాలు ప్రజల ముందుంచుదాం
కొత్త మంత్రులతో సీఎం చంద్రబాబు

ఉండవల్లి నివాసంలో నూతన మంత్రివర్గంతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. శాఖల వారీ శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని, జగన్‌ హయాంలోని రివర్స్‌ విధానాలు, అరాచకాల్ని వారికి వివరిద్దామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఓఎస్డీలు, పీఏ, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పనితీరు ద్వారా శాఖలకు వన్నెతేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ఇదో అపూర్వ అవకాశమని, మరింత కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం పెట్టాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని.. ప్రస్తుత పరిస్థితుల్ని వారికి వివరించారు. ‘‘మీలో చాలా మంది ఉన్నతవిద్యావంతులు, యువకులు ఉన్నారు. ఉత్సాహంగా పనిచేయండి. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పులు జరగనివ్వకండి. వ్యవస్థలను చక్కదిద్ది రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని