Andhra News: విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం సిద్ధం

రాష్ట్ర విద్యుత్‌రంగంపై జులై ఒకటో తేదీన ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. విద్యుత్‌ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి పర్యవసానాలను అందులో వివరించనున్నట్లు తెలిసింది.

Published : 22 Jun 2024 05:06 IST

జులై ఒకటిన విడుదల
ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వ నిర్వాకం.. ప్రజల ముందుకు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌రంగంపై జులై ఒకటో తేదీన ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. విద్యుత్‌ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి పర్యవసానాలను అందులో వివరించనున్నట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వ జమానాలో విద్యుత్‌ రంగం సంక్షోభంలో కూరుకుంది. వైకాపా అధికారం చేపట్టే నాటికి విద్యుత్‌ సంస్థల అప్పులు, నష్టాలు సుమారు రూ.30 వేల కోట్లు. గత ఐదేళ్లలో అవి రూ.1.14 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచబోతోంది. ఇప్పటికే సిద్ధంచేసిన ముసాయిదా పత్రాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైన సవరణలు చేసి సీఎం చంద్రబాబు పరిశీలనకు పంపనున్నారు. 

ప్రజలపై ఛార్జీల భారం..

గత ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.18,817 కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేసింది. మరో రూ.12,491 కోట్ల భారానికి సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి అందించాయి. ఇంతగా ఛార్జీలు పెంచినా డిస్కంల అప్పులు, నష్టాలు ఐదేళ్లలో సుమారు రూ.84 వేల కోట్లు పెరగడానికి కారణమేంటి? అనే వివరాలను కూడా ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. 

గత ఐదేళ్లలో డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్‌ ఎంత? ఒక్కొక్క యూనిట్‌కు ఎంత ధర చెల్లించాయి? వంటి వివరాలను కూడా శ్వేత పత్రంలో పేర్కొననున్నట్లు తెలిసింది. 

స్మార్ట్‌ టెండర్ల వ్యవహారమూ..  

రాష్ట్రంలో 38.63 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కాంట్రాక్టును గత ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు ఏ ధరకు కట్టబెట్టింది? ఇందులో నిబంధనల అతిక్రమణ ఏమైనా ఉందా? అనే వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించనుంది. ఈ టెండరును అదానీ సంస్థ రూ.1,280 కోట్లకు దక్కించుకుంది. 

విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద రూ.13 వేల కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు.. రాష్ట్రంలోని 18.5 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.6,883 కోట్లతో నిర్వహించిన టెండర్ల వివరాలను కూడా ప్రస్తావించనుంది. ఈ బిడ్‌ను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు