Volunteers: మోసపోయాం.. మన్నించండి

వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.

Updated : 16 Jun 2024 06:45 IST

తెదేపా ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు
తిరిగి విధుల్లో చేర్చుకోవాలని అధికారులకు వినతులు

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం ఇస్తున్న వాలంటీర్లు


వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయకపోతే వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని బెదిరించారు. రోడ్డున పడిన మమ్మల్ని మీరే ఆదుకోవాలి. ముఖ్యమంత్రితో చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలి.

కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎదుట.. రాజీనామా చేసిన వాలంటీర్ల ఆవేదన


ఈనాడు, అమరావతి: వాలంటీర్లను వైకాపా నేతలు నిండా ముంచేశారు. ఎన్నికల ముందు వారితో బలవంతంగా రాజీనామాలు చేయించి ఇప్పుడు రోడ్డున పడేశారు. రాజీనామా చేయకపోతే మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని వైకాపా ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుల వరకు బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన వారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. వైకాపాను నమ్మి మోసపోయిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి వినతులిస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో అత్యధికంగా మహిళా వాలంటీర్లు ఉంటున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ముందు కొందరు వాలంటీర్లు శుక్రవారం కన్నీటిపర్యంతమయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోనూ పలువురు వాలంటీర్లు ఎంపీడీవోను శనివారం కలిసి తిరిగి విధుల్లో చేర్చుకోవాలని వినతులిచ్చారు. విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ ఎన్నికల ఫలితాల తరవాత పలువురు ఎమ్మెల్యేలను వాలంటీర్లు కలిసి విజ్ఞప్తులు అందజేశారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటి గుమ్మం వద్దకు అందించే పేరుతో వైకాపా ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను ప్రారంభించి అదే వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి, భయపెట్టి చాలామంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనేలా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.08 లక్షల మందికిపైగా అప్పట్లో రాజీనామా చేశారు.

రాజీనామా చేసేవరకు ఒకలా, ఇప్పుడు మరోలా!

రాజీనామా చేసి ఎన్నికల ప్రచారం చేసేవరకు వాలంటీర్లకు అనేక హామీలిచ్చిన అప్పటి ప్రజాప్రతినిధులెవరూ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి తాము మళ్లీ వస్తే కొనసాగుతారనే చెప్పామంటూ తప్పుకొంటున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరిని కలవడానికి ప్రయత్నిస్తే ఇంట్లో ఉండీ లేనని కుటుంబసభ్యులతో చెప్పించి వెళ్లగొట్టారు. కాకినాడ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే తనను కలవడానికి వచ్చిన వాలంటీర్లతో సరిగా మీరు పని చేయనందునే ఎన్నికల్లో ఓడిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కనిపిస్తే బాగుండదని తనను కలవడానికి వెళ్లిన వాలంటీర్లను ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: అధికార బలంతో తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని పలువురు వాలంటీర్లు వైకాపా నాయకులపై శనివారం రాత్రి నెల్లూరు చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు గ్రామీణం 41వ డివిజన్‌కు చెందిన కార్పొరేటరు, స్థానిక వైకాపా నాయకులు తమపై ఒత్తిడి తీసుకొచ్చి.. రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు