AP-TG CMs Meeting: కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి.

Published : 07 Jul 2024 05:03 IST

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీలో నిర్ణయం
ప్రధానాంశాలపై పదేళ్లలో ఇంత సామరస్యపూర్వక చర్చలు ఇదే తొలిసారి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. గడిచిన పదేళ్లలో ఏ వివాదాలూ లేకుండా... రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌- అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, బుల్లెట్‌ ట్రైన్, హైదరాబాద్‌- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టుల్ని ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ అంశాల్ని పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. 

రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కలిసి వెళితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి.. రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనంత తరచుగా సమావేశాలు జరగాలని, అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్నీ వేగంగా పరిష్కరించాలని నిర్ణయించారు. త్వరలో తెలంగాణ నుంచి ఒక కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఇక్కడి అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రులిద్దరూ ఇదే సానుకూల దృక్పథం, పరస్పర సహకారంతో ముందుకెళితే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారమవుతాయని.. ఉభయ రాష్ట్రాల ప్రజలకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారుల్లో వ్యక్తమైంది.

తెలంగాణ ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై చంద్రబాబు ఆరా!

సమావేశం అనంతరం చంద్రబాబు గౌరవార్థం రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. ఆ సందర్భంలోనూ చంద్రబాబు పలు అంశాలను రేవంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం ఎలా పెరుగుతూ వచ్చింది వంటి అంశాల్ని ఆయన తరచి తరచి అడిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆరు గ్యారంటీల అమలుపై ఎలా ముందుకెళ్తుందో కూలంకషంగా తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీల్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయనున్నందున... తెలంగాణ అనుభవాలు తమకు ఉపయోగపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు దేశంలోని సీనియర్‌ నాయకుల్లో ఒకరని.. ఆయన అనుభవం, మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరమని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో భూగర్భ జలాల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు చెప్పారు.


పరస్పరం సహకరించుకునేలా చర్చలు 

‘ఎక్స్‌’లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిగినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘హైదరాబాద్‌లో మంత్రివర్గ సహచరులతో కలిసి తెలంగాణ మంత్రులు, అధికారులతో సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాల గురించి చర్చించాం. రెండు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. సమావేశం ఫొటోల్ని పోస్టుకు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని