Andhra News: పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు

పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు.

Updated : 06 Jul 2024 06:41 IST

4 నెలల్లోనే 20 వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు
యాజమాన్య హక్కుల కల్పనకు ముందే వైకాపా పెత్తందార్ల దందా
కావాల్సినవారికి శరవేగంగా రిజిస్ట్రేషన్లు
ఇందుకోసం 12 రోజుల్లోనే 3 మెమోలిచ్చిన ఐజీ రామకృష్ణ  

ఈనాడు, అమరావతి: పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. ఫిబ్రవరి నుంచి నాలుగు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది. గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, వైకాపా ప్రభుత్వంలో మంత్రులు, సీనియర్‌ నేతలు కూడా బినామీల పేర్లతో భూములు కొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

2003కు ముందు పేదలకు ప్రభుత్వం నగర/ పట్టణ శివార్లలో అందజేసిన సాగు భూములు.. ఆయా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందడంతో ఇప్పుడు భారీగా ధర పలుకుతున్నాయి. ఎసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైకాపా పెద్దలు, ఉన్నతాధికారులు ముందుగానే పసిగట్టారు. ఎసైన్డు భూములున్న పేద రైతులకు స్వల్ప మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చి, కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. ఆఘమేఘాలపై సుమారు 9 లక్షల ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు.  ఇందులో సుమారు 20 వేల ఎకరాల భూములను వైకాపా నేతలు తమ పేరిట, బినామీల పేరిట చకచకా రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఎసైన్డ్‌ భూముల లెక్కలు తీయాలని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆపసోపాలు పడింది. 

వేల ఎకరాలు పెద్దలపరం

రిజిస్ట్రేషన్‌ శాఖలోని పుట్టపర్తి జిల్లాలో 4,127 ఎకరాలు, రాయచోటిలో 3,330, ఒంగోలులో 2,392, కడపలో 2,027, తిరుపతిలో 1,814, నంద్యాల 1,494, చిత్తూరు జిల్లాలో 1,269 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కలిపి సుమారు 500 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో విశాఖ నగరంలోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం వంటి ఖరీదైన ప్రాంతాల్లోని ఎసైన్డ్‌ భూములూ ఉన్నాయి. సాధారణంగా భూమి విక్రయించాలంటే క్రయ, విక్రయదారుల మధ్య ఒప్పందాలు జరిగిన రెండు, మూడు నెలలకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. కానీ ఎసైన్డ్‌ భూములపై ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయాయి. దీన్నిబట్టి ప్రభుత్వ నిర్ణయం గురించి ముందే తెలిసిన పెద్దలే వీటిని చౌక ధరకు కొనేశారని అర్థమవుతోంది. 

ఉత్తర్వుల మీద ఉత్తర్వులు 

ఇరవై ఏళ్ల కంటే ముందు ఎసైన్‌ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటును 2023 జులై 31 నుంచి అమల్లోకి తెస్తూ గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మార్గదర్శకాల జీఓ 596ను డిసెంబరు 19న విడుదల చేసింది. ఆ వెంటనే వేల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు హడావుడిగా జరిగిపోయాయి. గత ప్రభుత్వంలో సీఎస్‌ జవహర్‌రెడ్డే రిజిస్ట్రేషన్‌ శాఖ బాధ్యతలూ నిర్వర్తించారు. ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కుల కల్పనకు చర్యలూ ఆయన హయాంలోనే తీసుకున్నారు. చౌక ధరకు పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందార్లు, ఉన్నతాధికారులకు త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు.. రిజిస్ట్రేషన్‌ శాఖ తొలి నుంచీ కుట్రపూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. జవహర్‌రెడ్డి అధ్యక్షతన 2024 జనవరి 13న జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి.. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ అదే నెల 13, 17, 25 తేదీల్లో మొత్తం మూడు మెమోలు జారీ చేశారు. కొర్రీలు వేసి, ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దన్నదే వీటి సారాంశం. సాధారణంగా కలెక్టర్లు ఆమోదించిన జాబితా ప్రకారం జిల్లా రిజిస్ట్రార్లు నిషిద్ధ జాబితా నుంచి సంబంధిత భూములను తొలగిస్తారు. ఇందుకు భిన్నంగా కలెక్టర్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు అందిన జాబితాల్లోనే ఫ్రీహోల్డ్‌/ పట్టా భూమి అని పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని వివరాలు పరిశీలించకుండానే.. కలెక్టర్ల నుంచి అందే జాబితాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని.. భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణాల జోలికి వెళ్లొద్దని ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో లోతుగా విచారణ జరిపితేనే తెలుస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని